బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదస్పద వ‍్యాఖ్యలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవల 1947లో వచ్చిన స్వాతంత్ర్యం భిక్షగా అభివర్ణించారు. ప్రధాని మోడీ అధికారంలో 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని టైమ్స్ నౌ సమ్మిట్ 2021లో తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, ప్రముఖులు కంగనాను తీవ‍్రంగా విమర‍్శించారు. ఆమె అందుకున్న పద్మశ్రీ అవార్డును సైతం రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఆ డిమాండ్‌కు స్పందనగా కంగనా మరో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయితే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తాను అని తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఇలా రాసుకొచ్చింది. 'సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, వీర్ సావర్కర్ జీ వంటి మహానుభావుల త్యాగాలతో 1857లో మొదటి స్వాతంత్య్ర పోరాటం జరిగిందని అదే ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాను. 1857లో ఏం జరిగిందో నాకు తెలుసు. కానీ 1947లో ఏం జరిగిందో నాకు తెలీదు. ఎవరైనా నాకు చెబుతారా. అది చెప్పగలిగితే నా పద్మశ్రీని తిరిగి ఇస్తాను. క్షమాపణ కూడా చెబుతాను. దయచేసి ఇందులో నాకు సహాయం చేయండి.'
'అంతకుముందు మనకు వచ్చిన స్వాతంత్ర్యం కేవలం భౌతికమైనది. కానీ భారతదేశం 2014లో మానసికంగా విముక్తి పొందిందని ప్రత్యేకంగా చెప్పాను. చనిపోయిన నాగరికత సజీవంగా తిరిగి వచ్చింది. ఈ స్వాత్యంత్రం ఇప్పుడు గర్జిస్తూ, పైకి ఎగురుతోంది. నేడు మొదటిసారిగా ఇంగ్లీష్‌లో మాట్లాడలేనందుకు, చిన్న గ్రామాల నుంచి వస్తున్నందుకు, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు వాడనందుకు ప్రజలు సిగ్గుపడలేరు. ప్రతిదీ అదే ఇంటర్వ్యూలో స్పష్టంగా ఉంది. అపరాధ భావం ఉన్నవారు దహించుకుపోతారు. దాని గురించి ఏం చేయలేం. జై హింద్.' అని తనను సమర్థించుకుంది. ఇంకా కంగనా తన స్టోరీలో 'భిక్షగా లభించిన స్వాతంత్ర్యం కూడా ఒక స్వాతంత్య్రమా ? కాంగ్రెస్ పేరుతో బ్రిటీష్ వారు ఏం వదిలేశారు. వారు బ్రిటీష్ వారి కొనసాగింపు.' అని రాసుకొచ్చింది.
ఇంతకుముందు కంగనా ట్విటర్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు కంపెనీ ఆమె ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై అనుచిత వ్యాఖ‍్యలు చేసినందుకు ఈ చర్య తీసుకుంది ట్విటర్. కంగనా ఇప్పుడు తన వీడియోలు, సందేశాలను ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment