యోగా గురు అయ్యంగర్ అస్తమయం
పుణే: ‘ఐయ్యంగార్ యోగా’ వ్యవస్థాపకుడు , ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యోగా గురు బీకేఎస్ ఐయ్యంగార్ బుధవారం తెల్లవారుజామున అస్తమించారు. ఆయన వయస్సు 96 యేళ్లు. వయోభారంతోనే ఆయన చనిపోయినట్లు బంధువులు చెప్పారు. యోగాపై ఆయన పలు పుస్తకాలు రచించారు. యోగాకు చేసిన సేవలకు గాను 1991లో ఆయనను పద్మశ్రీ అవార్డు, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి.
2004లో టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 100 మంది ప్రతిభావంతుల లిస్టులో అయ్యంగార్ పేరు కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉండగా, అయ్యంగార్ మృతిపై ప్రధాన మంత్రి మోడీ తన సంతాపాన్ని ప్రకటించారు. ముందు తరాల వారు యోగా గురువుగా అయ్యంగార్‌ను గుర్తించుకుంటారని ఆయన కొనియాడారు. యోగా వ్యాప్తికి అయ్యంగార్ అంకితభావంతో పనిచేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
యోగా ద్వారా భారతదేశ కీర్తిని ప్రపంచమంతా ఇనుమడింపజేశారని అయ్యంగార్ సేవలను ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కీర్తించారు. అయ్యంగార్ కర్ణాటక రాష్ట్రం బెల్లూర్‌లోని ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో 1918 డిసెంబర్ 14వ తేదీన జన్మించారు. అతడి పూర్తిపేరు బెల్లూర్ కృష్ణమాచార్య సుందరరాజ అయ్యంగార్. చిన్నతనంలో ఆయన మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో బాధపడేవారు.
అతడి 16వ యేట గురువు టి. కృష్ణమాచార్య వద్ద యోగాభ్యాసం మొదలుపెట్టారు. రెండేళ్ల తర్వాత పుణే వెళ్లి యోగాలో ఇతరులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కాలక్రమేణా ‘అయ్యంగార్ యోగా’ను ప్రారంభించి ఎందరికో యోగాలో శిక్షణ ఇవ్వడమే కాక సొంతంగా కొన్ని మెళకువలను కనిపెట్టారు. ఆయన కనిపెట్టిన ‘అష్టాంగ యోగా’ ఇప్పుడు యోగా ఉపాధ్యాయులకు ఒక పాఠ్యాంశంగా మారింది. అయ్యంగార్‌కు 1943లో వివాహమైంది. ఆరుగురు సంతానం ఉన్నారు.
ఇతని వద్ద శిష్యరికం చేసిన వారిలో జె.కృష్ణమూర్తి, జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత్ పట్వార్‌ధాన్ వంటి వారు ఉన్నారు. అలాగే బెల్జియంకు చెందిన మదర్ ఎలిజిబెత్ రాణి కూడా తన 80 వ యేట ఈయన వద్ద యోగా మెళకువలు నేర్చుకున్నారు. అయ్యంగార్‌పై గౌరవ సూచకంగా చైనాకు చెందిన బీజింగ్ పోస్ట్ 2011లో స్టాంప్‌ను విడుదల చేసింది. అలాగే శాన్‌ఫ్రాన్సిస్కో 2005 అక్టోబర్ 3వ తేదీన బీకేఎస్ డేగా ప్రకటించింది. అయ్యంగార్ తన భార్య రమామణి జ్ఞాపకార్థం 1975లో పుణేలో రమామణి మెమోరియల్ యోగా ఇనిస్టిట్యూట్‌ను స్థాపించారు. లైట్ ఆఫ్ యోగా, లైట్ ఆఫ్ ప్రాణాయామా, లైట్ ఆన్ ది యోగా సూత్రాస్ ఆఫ్ పతంజలి వంటి ఎన్నో పుస్తకాలను ఆయన రచించారు.