
కంకిపాడు సిగలో విరిసిన పద్మం
సినీ నటుడు ‘కోట’ పద్మశ్రీకి ఎంపిక
కంకిపాడు : కంకిపాడు సిగలో పద్మం విరిసింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ప్రకటించిన పద్మ అవార్డుల్లో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావును పద్మశ్రీ వరించింది. కోట స్వగ్రామం కంకిపాడు కావటంతో పట్టణ వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానమిదీ.. కోట సీతారామాంజనేయులు, విశాలాక్షి దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో కోట శ్రీనివాసరావు రెండో కుమారుడు. పెద్ద కొడుకు నర్సింహారావు, చిన్న కుమారుడు శంకర్‌రావు. శ్రీనివాసరావు తండ్రి సీతారామాంజనేయులు హస్తవాసి గల వైద్యుడు. శ్రీనివాసరావు ప్రాథమిక, ఉన్నత విద్య పునాదిపాడు, కంకిపాడులోనే సాగింది. అనంతరం ఉన్నత విద్య విజయవాడలో పూర్తిచేశారు.
నాటక రంగం నుంచి సినీ రంగంలోకి...
చిన్ననాటి నుంచి కళా రంగం అంటే కోటకు అమితమైన ఇష్టం. కళా రంగంపై ఉన్న ఆసక్తితో తన స్టేట్ బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలేసి సినిమాల వైపు అడుగులు వేశారు. ప్రాథమికంగా నాటక రంగం విషయానికొస్తే ఆయన నటించిన పూలరంగడు (మునసుబు), పుణ్యవతి (కరణం), జల్సా రంగడు (భుజంగరావు), మంగళసూత్రం తదితర నాటకాలు విశేషంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ముఖ్యంగా పుణ్యవతిలో ఆయన నటనను ఆ తరం ఇంకా గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత సినిమా రంగంలో ప్రవేశించి పిసినారిగా, విలన్‌గా, రాజకీయ నాయకుడిగా, తాజాగా గబ్బర్‌సింగ్ సినిమాలో తాగుబోతు పాత్రలోనూ ఇమిడిపోయి ప్రేక్షకులను అలరిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని పాత్రలనూ పోషించి, జీవించి ఉత్తమ ప్రశంసలు అందుకున్నారు.
కంకిపాడుపై ఎనలేని ప్రేమ
తన స్వగ్రామమైన కంకిపాడుపై కోట శ్రీనివాసరావుకు ఎనలేని ప్రేమ. తరచూ ఇక్కడికొచ్చి వెళ్తూ ఉండటమేగాక స్థానిక ప్రముఖులను కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంటారు. విద్యాభివృద్ధికి ప్రత్యక్ష వితరణలతో పాటుగా గుప్త దానాలు కూడా కోట చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కళామతల్లికి విశిష్ట కళార్చన చేస్తున్న కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ ప్రకటించడంపై పట్టణ వాసుల్లో సంతోషం నెలకొంది. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావును ‘సాక్షి’ ఫోన్‌లో పలకరించి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ తనకు పద్మశ్రీ ప్రకటించటం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు.