దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు.
కాగా, పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో ఓ ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే డాక్టర్ ఎమ్‌సీ దావర్. మధ్యప్రదేశ్‌కు చెందిన దావర్(77)ను స్థానికులు 20 రూపాయల డాక్టర్ అని కూడా పిలుస్తారు. దావర్.. అతని వద్దకు వచ్చిన పేషంట్స్‌కు కేవలం రూ.20 మాత్రమే ఫీజు తీసుకుని వారికి వైద్యం అందిస్తుంటారు. అందుకే దావర్‌కు 20 రూపాయల డాక్టర్ అనే పేరు వచ్చింది.
దావర్ వివరాలు ఇవే..
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాకు చెందిన డాక్టర్ ఎమ్‌సీ దావర్ పద్మశ్రీ దక్కించుకున్నారున. అయితే, డాక్టర్ దావర్ జనవరి 16, 1946న పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. దేశ విభజన తర్వాత భారత్‌లోకి వచ్చారు. 1967లో దావర్ జబల్‌పూర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారత సైన్యంలో దావర్ సుమారు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. ఆ తర్వాత 1972 నుండి జబల్‌పూర్‌లోని ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పేషంట్స్ వద్ద నుంచి కేవలం రూ.2 మాత్రమే తీసుకుని వారికి వైద్యం అందించారు. ప్రస్తుతం తన ఫీజును రూ.20కి పెంచి అందరికీ వైద్యం అందిస్తున్నారు.
కాగా, పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా దావర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దావర్ మీడియాతో మాట్లాడుతూ..‘కష్టపడితే కొన్నిసార్లు ఆలస్యమైనా ఫలితం మాత్రం ఉంటుంది. దాని ఫలితంగానే నేను ఈ అవార్డును అందుకున్నాను. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. అందుకే పేషంట్స్ వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం లేదు. విజయం ప్రాథమిక మంత్రం ఏంటంటే.. ఓపికగా పనిచేస్తే కచ్చితంగా విజయం దక్కుతుంది. అలాగే గౌరవం కూడా అందుతుంది’ అని కామెంట్స్ చేశారు.
ఇదే క్రమంలో దావర్ కుమారుడు రిషి కూడా తన తండ్రికి పద్మ పురస్కారం అందడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా పరపతి ఉంటేనే అవార్డులు ఇస్తారని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ, ప్రభుత్వం మా లాంటి వారిని కూడా గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి వారిని గుర్తించి సత్కరిస్తున్న తీరు చాలా మంచి విషయం. మా నాన్నకు ఈ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఇది మాకు, మా కుటుంబానికి, మా నగరానికి చాలా గర్వకారణమని దావర్ కోడలు సుచిత అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment