
Singer Sonu Nigam Bags Padma Shri Award 2022: దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను హోం మంత్రిత్వ శాఖ మంగళవారం (జనవరి 25) ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ఈ ఏడాదికిగాను 128 మందికి ఈ అవార్డులు లభించాయి. ఈ అవార్డులను రాష్ట్రపతి తన అధికారిక నివాసం - రాష్ట్రపతి భవన్‌లో ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే వేడుకల్లో ప్రదానం చేస్తారు. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌కు ఈ అరుదైన గౌరవ పురస్కారం దక్కింది. కళారంగంలో అనేక సేవలందించినందుకు గాను సోనూ నిగమ్‌ను 'పద్మశ్రీ' అవార్డుతో ప్రభుత్వం సత్కరించనుంది.
జూలై 30, 1973న ఆగమ్ కుమార్ నిగమ్, శోభ నిగమ్ దంపతులకు హర్యానాలోని ఫరిదాబాద్‌లో జన్మించాడు సోనూ నిగమ్. నాలుగేళ్ల చిరుప్రాయం నుంచే తండ్రితోపాటు వేదికలెక్కి పాటలు పాడటం ప్రారంభించిన సోనూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 18 ఏళ్ల వయసులో బాలీవుడ్లో తానేంటే నిరూపించుకోవాలని ముంబైకి వచ్చాడు. హిందుస్తానీ గాయకుడు గులాం ముస్తఫా ఖాన్ వద్ద శిక్షిణ తీసుకున్నాడు. హిందీ, బెంగాలీ, అస్సామీ, భోజ్ పురీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, మైథిలి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, తుళు, తమిళం, తెలుగు, ఉర్దూ లాంటి అనేక భాషల్లో ప్రేమ, దేశభక్తి, రాక్, వేదనా భరిత గీతాలను ఆలపించాడు.