
అభిమానులతో సెల్ఫీలు దిగుతారు, ఆటోగ్రాఫ్‌లు ఇస్తారు.. కానీ ఈ సింగర్ మాత్రం ఏకంగా వారికి ముద్దులు పెట్టేశాడు. అతడే ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్. ఆ మధ్య ఈయన ఓ షోలో.. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన మహిళా అభిమానులకు ముద్దులు పెట్టడం వివాదంగా మారింది. తాజాగా ఈ వివాదంపై సింగర్ అమిత్ టండన్ (Amit Tandon) స్పందిస్తూ.. ఉదిత్‌కు వయసుతో పాటు వంకర బుద్ధి కూడా పెరిగిందని వ్యాఖ్యానించాడు.
ఆయనది వక్రబుద్ధి
అమిత్ మాట్లాడుతూ.. ఉదిత్ నారాయణ్ (Udit Narayan) పాటలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆయనకు వంకర బుద్ధి ఉంది. ఇలా చెప్పొచ్చే, లేదో నాకు తెలీదు కానీ, ఏ పరిస్థితినైనా ఆయన అడ్వాంటేజ్‌గా తీసుకుంటాడు. నేను కూడా చాలా షోలు చేశాను. అభిమానులు నాకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించేవారు. వారిని మనం ఎంత దగ్గరకు రానివ్వాలి? ఎక్కడ ఉంచాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా సరే లిమిట్‌లోనే ఉండాలి.
హద్దుల్లో ఉంటే బెటర్
ఒకవేళ నేనే గనక నా ప్రియురాలు లేదా భార్యతో అతడి షోకు వెళ్లాననుకోండి. నా పార్ట్‌నర్ ఆయనతో ఫోటో తీసుకుంటుంటే దాన్ని ఆయన అడ్వాంటేజ్‌గా తీసుకుని ముద్దు పెడితే మాత్రం ఊరుకునేవాడిని కాదు. కచ్చితంగా అతడిని చితకబాదేవాడిని. అయితే గాయకుడిగా మాత్రం నాకు ఆయనపై విపరీతమైన గౌరవం ఉంది. కాకపోతే మనకంటూ కొన్ని పరిమితులు గీసుకుంటే మంచిది. హద్దులు దాటకుండా ఉంటేనే అందరికీ ఉత్తమం.
తండ్రి అలా.. కొడుక్కేమో యాటిట్యూడ్
ఉదిత్ కుమారుడు అదిత్ నారాయణ్ ఓ షోలో జనాలపైకి మైక్ విసరడం చూశాను. ఏదేమైనా సరే హుందాగా ప్రవర్తించాలే తప్ప ఇలా యాటిట్యూడ్ చూపించకూడదు. అదిత్ నాకు వ్యక్తిగతంగా తెలియదు.. బహుశా అతడు మంచివాడు కావచ్చు. కానీ సోషల్ మీడియాలో చూస్తున్న విజువల్స్‌లో మాత్రం తనకు యాటిట్యూడ్ ఉందని ఇట్టే అర్థమవుతోంది అని అమిత్ చెప్పుకొచ్చాడు.
చదవండి: పహల్గాంలోనే ఉన్నా.. పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే: ఆర్జే కాజల్