
ఫవాద్ ఖాన్, అలీ జఫర్, మహీరా ఖాన్
కళలకు హద్దుల్లేవు అంటారు. కానీ సహనానికి మాత్రం ఓ హద్దు ఉంటుంది కదా. ఓ వైపు మన దేశ వాసుల ప్రాణాలను తీస్తూ మరోవైపు అదే ప్రజల కష్టార్జితంతో తమ కళాకారులకు ప్రాణాలను పోయాలనే దుర్భుధ్దులున్న చోట... కళలకు హద్దులు ఉండాల్సిందే. అందుకే పాకిస్తానీ కళాకారులు ఇప్పుడు నిషేధాన్ని ఎదుర్కుంటున్నారు. తమ దేశం విచక్షణ మరచి ఏళ్లుగా తీవ్రవాదమూకలకు అడ్డాగా మారిన వైనానికి తమను ప్రేమతో ఆదరించిన సమాజం ముందు సిగ్గుతో తలదించుకుంటున్నారు. వాస్తవానికి ఇంకా ముందే.. అంటే గత 2016లో ఉరిలో భారత ఆర్మీపై పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర దాడి తర్వాత, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పాకిస్తానీ కళాకారులను భారత్ విడిచిపెట్టి వెళ్ళాలని డిమాండ్ చేసింది.
అప్పటి నుంచీ పాకిస్తానీ నటులు భారతీయ చిత్రాల్లో పాల్గొనడం తగ్గినా మళ్లీ ఇటీవలే కొంచెం పుంజుకుంది. అయితే దేశాన్ని తీవ్రమైన ఆవేదనకు, అదే సమయంలో తీవ్రాగ్రహావేశాలకు గురిచేసిన తాజా తీవ్రవాద దాడి నేపథ్యంలో, భారతదేశంలో పాకిస్తానీ నటులపై ఈ సారి ఏకంగా అధికారిక నిషేధం విధించారు. ఈ నిషేధం ఇప్పట్లో ఎత్తేసే పరిస్థితి కనిపించడం లేదు. భవిష్యత్తులో మళ్లీ పాక్ నటులు మన సినిమాల్లో కనిపిస్తారో లేదో... తెలీదు.
ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా బాలీవుడ్‌లో పనిచేసిన పాకిస్తానీ నటుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే... ఫవాద్ ఖాన్ అనే పాకిస్తానీ నటుడు ’ఖూబ్ సూరత్’, ’కపూర్ అండ్ సన్స్, ’ఏ దిల్ హై ముష్కిల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. అలాగే అత్యంత పాప్యులర్ పాకిస్తానీ నటి మహీరా ఖాన్ ’రైస్’ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించింది.
’తేరే బిన్ లాడెన్’, ’మేర్ బ్రదర్ కి దుల్హన్’, ’చష్మే బద్దూర్’, ’డియర్ జిందగీ’ వంటి చిత్రాల్లో నటించిన అలీ జఫర్ కూడా పాకిస్తానీయుడే. ’హిందీ మీడియం’ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ సరసన మరో పాకిస్తానీ..సబా ఖామర్ నటించింది. ’క్రియేచర్ 3ఇ’చిత్రంలో ఇమ్రాన్ అబ్బాస్ అనే పాకిస్తానీ నటుడు నటించాడు.
’సనం తేరీ కసమ్’ చిత్రంలో మరో పాకిస్తానీ నటుడు మావ్రా హోకేన్ కనిపించగా, ’మామ్’ చిత్రంలో శ్రీదేవి సరసన సజల్ అలీ నటించాడు. అంతేకాకుండా కొందరు పంజాబీ చిత్రాల్లో కూడా నటించారు. అలా భారతీయ పంజాబీ చిత్రాల్లో పనిచేసిన పాకిస్తానీ నటుల్లో ఇమ్రాన్ అబ్బాస్ ఉన్నాడు. ఆయన ’జీవే సోనేయా జీవే’ చిత్రంలో నటించాడు. ’లక్ లాగ్ గయి’ అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న ఫిరోజ్ ఖాన్ కూడా పాకిస్తానీయే. ‘బేబే భంగ్రా పౌండే నె’ చిత్రంలో సోహైల్ అహ్మద్ నటించాడు.
నసీం వికీ – ’మా దా లడ్లా’ చిత్రంలో కనిపిస్తాడు. ఏదేమైనా వీరందరూ కోట్లాది మంది ఆదరాభిమానాలకు, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న భారతీయ సినిమాలో అవకాశాలకు దూరమయ్యారు. హద్దులెరుగని ప్రేమతో ఆదరించిన భారతీయ ప్రేక్షకులను బలితీసుకునే తమ దేశపు నీచబుద్ధికి వీరు నిరసన తెలపాల్సిన అవసరం కనీస మానవ ధర్మం.