Fawad Khan
-
భార్య అనుచిత ప్రవర్తన... చిక్కుల్లో హీరో
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్‌పై లాహోర్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. యాంటి- పోలియో టీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు... ఫవాద్ ఖాన్ కూతురికి పోలియో డ్రాప్స్ వేసేందుకు పోలియో వర్కర్లు ఫైజల్ టౌన్‌లోని అతడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న ఫవాద్ భార్య సదాఫ్ ఖాన్.. తమ కూతురికి పోలియో డ్రాప్స్ వేసేందుకు నిరాకరించారు. అంతేకాకుండా కారు డ్రైవర్‌తో కలిసి సంబంధిత వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వారు ఫవాద్ ఖాన్ సహా అతడి భార్య, డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫవాద్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఈవెంట్ నిమిత్తం దుబాయ్‌లో ఉన్నాడు. కాగా పోలియో కేసులు అత్యధికంగా నమోదయ్యే దేశాల్లో ఒకటైన పాకిస్తాన్లో.. అక్కడి చట్టాల ప్రకారం పిల్లలకు పోలియో చుక్కలు వేయించని తల్లిదండ్రులకు జరిమానా విధించడంతో పాటు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇక సోనమ్ కపూర్ ఖూబ్సూరత్ సినిమాలో హీరోగా నటించిన ఫవాద్.. యే దిల్ హై ముష్కిల్ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్ర పోషించాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నటులపై బాలీవుడ్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు బాలీవుడ్ తెరకు దూరం కానున్నాడు. -
రహస్యంగా దేశం విడిచిన పాక్ నటుడు
పాకిస్థాన్‌కు చెందిన నటీనటులందరూ సెప్టెంబర్ 25లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం మహారాష్ట్ర నవనిర్మాణ సేన అల్టిమేటం జారీచేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. భద్రత కల్పిస్తామని ముంబై పోలీసులు హామీ ఇచ్చినా.. పాక్‌కు చెందిన చెందిన సినీ, టీవీ నటీనటులు భయాందోళన చెందుతున్నారు. పాక్ నటుడు ఫవాద్ ఖాన్ రహస్యంగా దేశం విడిచి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పట్లో భారత్‌కు తిరిగొచ్చే ఉద్దేశ్యం అతనికి లేదని తెలుస్తోంది. కరణ్ జొహార్ సినిమాలో ఫవాద్ నటించాడు. ఎంఎన్ఎస్ హెచ్చరికల అనంతరం ఫవాద్ సినిమా ప్రమోషన్లో పాల్గొనడని కరణ్ జొహార్ ఇటీవల చెప్పాడు. కాగా పాక్ నటుల షూటింగ్‌లను అడ్డుకుంటామని, వాళ్లకు అవకాశాలు ఇవ్వరాదని ఎంఎన్ఎస్ నాయకులు బాలీవుడ్ దర్శక నిర్మాతలను హెచ్చరించారు. పాక్‌కు చెందిన పలువురు నటీనటులు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. వీళ్లలో ఫవాద్ అగ్రశ్రేణి నటుడు. -
కేవలం మనీ కోసమే నటిస్తున్నా!
న్యూఢిల్లీ: రంగుల ప్రపంచం.. సినీలోకం. చాలామంది తమ ప్రతిభను లోకానికి చూపాలని, తమ నటనతో అబ్బురపరచాలని సినీరంగంలో అడుగుపెడుతుంటారు. కానీ, కేవలం డబ్బు సంపాదించేందుకు ఇటువైపు వచ్చేవాళ్లు అరుదు. అలా వచ్చినవాళ్లు కూడా మనస్సువిప్పి మనీ కోసం సినిమాల్లో నటిస్తున్నామని చెప్పడం ఇంకా అరుదు. కానీ ఇటీవల బాలీవుడ్ సినిమాల్లో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ మాత్రం తాను డబ్బు కోసమే నటిస్తున్నట్టు ఏ మొహమాటం లేకుండా చెప్పేశాడు. 'నేను కంప్యూటర్ ఇంజినీర్ని కానీ, కోడింగ్ ద్వారా రూపాయి కూడా సంపాదించలేకపోయాను. దీంతో డబ్బు సంపాదించేందుకు నేను నటుడిగా మారాను' అని ఫవాద్ చెప్పాడు. 34 ఏళ్ల ఈ స్టార్ తాజాగా 'కపూర్ అండ్ సన్స్' సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాలో తన సహ నటులైన అలియా భట్, సిద్ధార్థ కపూర్ అమెరికాలో విహరిస్తుండగా.. ఫవాద్ మెల్బోర్న్లో జరిగిన భారతీయ చిత్రోత్సవంలో పాల్గొన్నాడు. ఈ చిత్రోత్సవంలో ఉత్తమచిత్రంగా 'కపూర్ అండ్ సన్స్'కు అవార్దు లభించింది. ఈ అవార్డును నటుడు రిషికపూర్‌తో కలిసి అందుకున్న ఫవాద్ మాట్లాడుతూ.. తాను నటించిన సినిమాకు ఈ పురస్కారం రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఫవాద్ నటించిన 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం త్వరలోనే విడుదల కానుంది. -
మూవీలో సత్తా ఉండాలి.. అంతే కానీ..!
నోయిడా: అనుష్కా శర్మ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఏ దిల్ హై ముష్కిల్’.ఆమె ప్రియుడిగా బాలీవుడ్ నటుడు ఫవాద్ ఖాన్ నటిస్తున్నాడు. ఫవాద్ నటుడు మాత్రమే కాదు ప్లే బ్యాక్ సింగర్ గానూ పేరు తెచ్చుకున్నాడు. తొలి మూవీ ఖుబ్సురత్ విడుదల నుంచీ జిందగీ గుల్జార్ హై వరకు తనదైన నటనతో అందరినీ మెప్పిస్తున్న ఫవాద్ సినిమాల విషయంలో ఆసక్తికర కామెంట్లు చేశాడు. మూవీలో కంటెంట్ ఉంటే చాలు సరిపోతుంది, మల్టీ స్టారర్ అయితేనే హిట్ అవుతుందని తాను భావించడం లేదన్నాడు. క్రియేటివ్ రోల్ ఏది వచ్చినా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం బెటర్ ఆప్షన్ అంటున్నాడు. ఆ మూవీలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. మల్టీ స్టారర్ మూవీలలో ఎక్కువగా ఎంచుకుంటున్నారని విలేకరి అడిగిన ప్రశ్నపై భిన్నంగా స్పందించి ఈ విషయాలు చెప్పాడు. కాన్పెప్ట్ నచ్చితే అన్ని రకాల మూవీలు చేస్తానని, అయితే ఎంచుకునే పాత్రపై కాస్త అవగాహన ఉంటే సరిపోతుందని పేర్కొన్నాడు. మరో కొత్త మూవీ 'కపూర్ అండ్ సన్స్' గే పాత్రలో ఫవాద్ కనిపించనున్నాడు. పాకిస్తానీ సినిమాలు మాత్రమే కాదు బాలీవుడ్ మూవీలను ఎంతో ఇష్టపడతానని చెప్పాడు. పలానా మూవీలు మాత్రమే చేయాలని అని భావించడానికి ఇవేమీ ప్రభుత్వ నిర్ణయాలు కాదని, మనసుకు నచ్చే పాత్రలు చేస్తూ కెరీర్ సాఫీగా సాగేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఫవాద్ తన మనసులో మాటను బయటపెట్టాడు. -
పాకిస్థాన్ నటుడికి బాలీవుడ్ హీరో మద్దతు
ముంబై: పాకిస్థాన్ నటుడు ఫవద్ ఖాన్ కు బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా బాసటగా నిలిచాడు. సృజనకు సరిహద్దులు లేవని, ఎవరు ఎవరితోనైనా నటించే స్వేచ్ఛ నటులకు ఉందని మల్హోత్రా అన్నాడు. ప్రస్తుతం తమతో ఫవద్ ఖాన్ నటిస్తున్నాడని తెలిపాడు. 17వ జియో మామి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి మల్హోత్రా హాజరయ్యాడు. పాకిస్థాన్ నటులు, క్రికెటర్లను మహారాష్ట్ర గడ్డపై అడుగుపెట్టనీయబోమని శివసేన ప్రకటించిన నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. ఫవద్ ఖాన్, మహిర ఖాన్ లాంటి పాకిస్థాన్ నటులు బాలీవుడ్ లో నటించకుండా నిషేధించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ జంటగా నటిస్తున్న 'కపూర్ అండ్ సన్స్' సినిమాలో ఫవద్ ఖాన్ నటిస్తున్నాడు. తన గాల్ ఫ్రెండ్ అలియా భట్ నటించిన 'షాన్ దార్' సినిమా చూశానని, తనకు బాగా నచ్చిందని మల్హోత్రా తెలిపాడు. ఇది గొప్ప సినిమా అని కితాబిచ్చాడు. రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా నటించాడు. -
మా ఇద్దరి తీరు వేరు
‘ఖూబ్సూరత్’ హీరో ఫవద్ ఖాన్ అంటే తనకు అభిమానం ఉన్నా పనితీరులో తమ ఇద్దరి మధ్య అంత సత్సంబంధాలు లేవని ‘హమ్‌సఫర్’ డెరైక్టర్ సర్మద్ ఖూసత్ అన్నాడు. 2011లో పాకిస్థాన్‌లో సూపర్‌హిట్ అయిన టీవీ షో ‘హమ్‌సఫర్’కు సర్మద్ దర్మకత్వం వహించగా, ఫవద్ హీరోగా నటించాడు. ‘ఫవద్ మంచి నటుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే నాకు,అతనికి పని విధానంలో చాలా తేడా ఉంది. మా ఇద్దరి మధ్య ‘కెమిస్ట్రీ’ అంతగా కుదరలేదనే చెప్పాలి. హమ్‌సఫర్ వరకు మా ఇద్దరి మధ్య సంబంధాలు బాగానేఉన్నాయి. అయితే అతడితో మళ్లీ,మళ్లీ పనిచేయాలనే ఆలోచన నాకు లేదు.. అతడు నా విష్ లిస్ట్‌లో లేడు..’ అని స్పష్టం చేశాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా అలాంటిదేమీ లేదన్నాడు. ‘నాకు ఫవద్ నటనంటే చాలా ఇష్టం.. అయితే మా మధ్య అంతగా విభేదాలు లేవు.. భవిష్యత్తులో అతడితో పనిచేయాల్సి వస్తే తప్పకుండా చేస్తా.. నేను, ఫవద్, మహిరా కలిసి మళ్లీ ఒక ప్రాజెక్టు చేస్తామనే అనుకుంటున్నా.. అయితే అతడితో తప్పనిసరిగా చేయాలి అనే భావన నాలో లేదు. నా అభిమాన నటుల్లో అతడు లేడు..’ అని చెప్పాడు. భారత ప్రేక్షకులు ఫవద్ను ఆదరించడం తనకు చాలా ఆనందంగా ఉందని సర్మద్ పేర్కొన్నాడు. ‘భారత ప్రేక్షకులు ప్రతిభను గుర్తిస్తారని మరోసారి రుజువైంది.. ఇటువంటి ఘటనల వల్ల రెండు దేశాల మధ్య అనుబంధం మరింత పెరుగుతుందని భావిస్తున్నా..’ అని పాకిస్థానీ డెరైక్టర్, నటుడు అయిన సర్మద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్థానీ రచయిత రచించిన ‘ఫర్హత్ ఇష్థియఖ్స్’ అనే నవల ఆధారంగా ఈ సీరియల్‌ను నిర్మించారు. ఇందులో భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని రచయిత చక్కగా విశదపరిచాడని, ఇటువంటి డ్రామా ఉన్న కథాంశాలను భారత ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సర్మద్ ధీమా వ్యక్తం చేశాడు. -
ఫవద్తో మళ్లీ నటిస్తా: సోనమ్
పాకిస్థాన్ నటుడు ఫవద్ఖాన్తో మరోసారి నటిస్తానని ‘ఖూబ్సూరత్’ సినిమా విజయపథంలో సాగిపోతున్న ఆనందంలో తేలియాడుతున్న నటి సోనమ్‌కపూర్ తెలిపింది. 1980లో ‘ఖూబ్సూరత్’ పేరిట హృషికేశ్ ముఖర్జీ సినిమా తీయగా దానిని రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఫవద్‌ఖాన్, సోనమ్‌కపూర్ నటించారు. ‘ఫవద్ సరసన వీలైనంత త్వరగా మరోసారి నటిం చాలని ఉంది. మా ఇరువురి నటనను ప్రేక్షకులు మెచ్చుకున్నారు. మా కెమిస్ట్రీ అందరికీ బాగా నచ్చింది. అందువల్ల త్వరలో మేమిద్దరం కలిసి మరో సినిమాలో నటిస్తాం’అని ఈ రాంఝ్నా సినిమా కథానాయిక చెప్పింది. ‘ఖూబ్సూరత్ సినిమాకి ఇంత భారీ స్పందన వస్తుందనుకోలేదు. ఈ స్పందనచూసి నాకే దిగ్భ్రాంతి కలిగింది. ఈ సినిమాని మరిన్ని థియేటర్లలో విడుదల చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడనిపిస్తోంది. ఈ సినిమా కేవలం 900 థియేటర్లలోనే విడుదలైంది. ప్రేక్షకుల స్పందన ఇంతగా ఉంటుందని మేము అనుకోలేదు. అసలు ఊహించలేదు కూడా. ఈ సినిమాని మరో ‘ఐషా’గా భావిస్తున్నారు. ఈ సినిమాచూసి వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సినిమాని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ సినిమాలో అంత గొప్పగా చేశానని నేను అనుకోవడం లేదు’ అని అంది. కాగా ఫరాఖాన్‌తో కలిసి నటించిన ‘భాగ్ మిల్కా భాగ్’ ధనుష్ సరసన నటించిన ‘రాంఝ్నా’ తాజాగా విడుదలైన ఖూబ్సూరత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ‘నేను నటించడం అదృష్టంగా వారంతా భావిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వారంతా నాకు స్నేహితులుగా మారారు. నాతో నటించడాన్ని వారు అదృష్టంగా భావించినందువల్లనే మా మధ్య స్నేహం కొనసాగుతోంది. వారి గురించి నేనుకూడా అలాగే అనుకుంటాను’ అని సోనమ్ తన మనసులో మాట చెప్పింది. -
హృషికేష్‌జీకి అంకితం చేస్తున్నా
ముంబై: తన తాజాచిత్రం‘ఖూబ్సూరత్’ను దివంగత నిర్మాత హృషికేష్ ముఖర్జీకి అంకితం చేస్తున్నానని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పేర్కొంది. 1980లో హృషికేష్ ముఖర్జీ ‘ఖూబ్సూరత్’ సినిమా తీశారు. ఇప్పుడు అదే టైటిల్‌తో విడుదలైన సినిమాలో సోనమ్ నటించింది. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు ఫవద్‌ఖాన్ కథానాయకుడిగా నటించాడు. ‘ఈ సినిమాలో నాది ప్రధాన పాత్ర కాదు. ప్రతి సినిమాకి నిర్మాత, దర్శకుడు, రచయితలే కథానాయకులనేది నా భావన. ఏ సినిమా హిట్ అయినా ఆ గొప్పదనాన్ని నా ఖాతాలో వేసుకోను. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద అది బోల్తాపడినా ఆ నింద నాపై మోపవద్దు. సినిమా అనేది ఉమ్మడి కృషి. అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది’ అని అంది. ఈ సినిమా మీ సొంత బ్యానర్‌పై విడుదలైనందువల్ల ముందుజాగ్రత్తలేమైనా తీసుకున్నారా అని అడగ్గా ఒక వస్తువును మార్కెట్లోకి విడుదల చేసేముందు దానిపై మనకు సంపూర్ణ విశ్వాసముండాలంది. హృషికేశ్ ఇప్పటికీ బతికిఉండి ఈ సినిమా చూసినట్టయితే సంతోషించేవాడేమో కదా అని అడగ్గా ఒకవేళ ఆయన కనుక ఈ సినిమాను చూసినట్టయితే తనకు ఇబ్బందిగా అనిపించేదేమో అంది. హృషికేష్ తీసిన ఈ సినిమాని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని మీకు ఎందుకనిపించిందని ప్రశ్నించగా అందరినీ కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశామని తెలిపింది. ఈ సినిమాని ఆ మహానుభావుడికే ఎంతో ప్రేమతో అంకితం చేస్తున్నానని చెప్పింది. మీ భవిష్య ప్రణాళికలేమిటని అడగ్గా ఈ నెల 21వ తేదీనుంచే ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా షూటింగ్ ప్రారంభించామంది. తన సోదరి రేహా కూడా మరో సినిమా తీస్తోందని తెలిపింది.