కేవలం మనీ కోసమే నటిస్తున్నా!
న్యూఢిల్లీ: రంగుల ప్రపంచం.. సినీలోకం. చాలామంది తమ ప్రతిభను లోకానికి చూపాలని, తమ నటనతో అబ్బురపరచాలని సినీరంగంలో అడుగుపెడుతుంటారు. కానీ, కేవలం డబ్బు సంపాదించేందుకు ఇటువైపు వచ్చేవాళ్లు అరుదు. అలా వచ్చినవాళ్లు కూడా మనస్సువిప్పి మనీ కోసం సినిమాల్లో నటిస్తున్నామని చెప్పడం ఇంకా అరుదు. కానీ ఇటీవల బాలీవుడ్ సినిమాల్లో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ మాత్రం తాను డబ్బు కోసమే నటిస్తున్నట్టు ఏ మొహమాటం లేకుండా చెప్పేశాడు.
'నేను కంప్యూటర్ ఇంజినీర్‌ని కానీ, కోడింగ్ ద్వారా రూపాయి కూడా సంపాదించలేకపోయాను. దీంతో డబ్బు సంపాదించేందుకు నేను నటుడిగా మారాను' అని ఫవాద్ చెప్పాడు. 34 ఏళ్ల ఈ స్టార్ తాజాగా 'కపూర్ అండ్ సన్స్' సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు.
ఈ సినిమాలో తన సహ నటులైన అలియా భట్, సిద్ధార్థ కపూర్ అమెరికాలో విహరిస్తుండగా.. ఫవాద్ మెల్‌బోర్న్‌లో జరిగిన భారతీయ చిత్రోత్సవంలో పాల్గొన్నాడు. ఈ చిత్రోత్సవంలో ఉత్తమచిత్రంగా 'కపూర్ అండ్ సన్స్'కు అవార్దు లభించింది. ఈ అవార్డును నటుడు రిషికపూర్‌తో కలిసి అందుకున్న ఫవాద్ మాట్లాడుతూ.. తాను నటించిన సినిమాకు ఈ పురస్కారం రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఫవాద్ నటించిన 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం త్వరలోనే విడుదల కానుంది.