Kapoor and Sons
-
కేవలం మనీ కోసమే నటిస్తున్నా!
న్యూఢిల్లీ: రంగుల ప్రపంచం.. సినీలోకం. చాలామంది తమ ప్రతిభను లోకానికి చూపాలని, తమ నటనతో అబ్బురపరచాలని సినీరంగంలో అడుగుపెడుతుంటారు. కానీ, కేవలం డబ్బు సంపాదించేందుకు ఇటువైపు వచ్చేవాళ్లు అరుదు. అలా వచ్చినవాళ్లు కూడా మనస్సువిప్పి మనీ కోసం సినిమాల్లో నటిస్తున్నామని చెప్పడం ఇంకా అరుదు. కానీ ఇటీవల బాలీవుడ్ సినిమాల్లో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ మాత్రం తాను డబ్బు కోసమే నటిస్తున్నట్టు ఏ మొహమాటం లేకుండా చెప్పేశాడు. 'నేను కంప్యూటర్ ఇంజినీర్ని కానీ, కోడింగ్ ద్వారా రూపాయి కూడా సంపాదించలేకపోయాను. దీంతో డబ్బు సంపాదించేందుకు నేను నటుడిగా మారాను' అని ఫవాద్ చెప్పాడు. 34 ఏళ్ల ఈ స్టార్ తాజాగా 'కపూర్ అండ్ సన్స్' సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాలో తన సహ నటులైన అలియా భట్, సిద్ధార్థ కపూర్ అమెరికాలో విహరిస్తుండగా.. ఫవాద్ మెల్బోర్న్లో జరిగిన భారతీయ చిత్రోత్సవంలో పాల్గొన్నాడు. ఈ చిత్రోత్సవంలో ఉత్తమచిత్రంగా 'కపూర్ అండ్ సన్స్'కు అవార్దు లభించింది. ఈ అవార్డును నటుడు రిషికపూర్‌తో కలిసి అందుకున్న ఫవాద్ మాట్లాడుతూ.. తాను నటించిన సినిమాకు ఈ పురస్కారం రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఫవాద్ నటించిన 'యే దిల్ హై ముష్కిల్' చిత్రం త్వరలోనే విడుదల కానుంది. -
కపూర్ అండ్ సన్స్‌కి 150 కోట్లు
కథలో బలం ఉంటే స్టార్ ఇమేజ్‌తో పనిలేదన్న విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇటీవల బాలీవుడ్లో రిలీజ్ అయిన కపూర్ అండ్ సన్స్, భారీ వసూళ్లను రాబడుతుండటమే ఇందుకు నిదర్శనం. సూపర్ స్టార్లు లేకపోయిన కథాబలంతోనే ఈ సినిమా సంచలనాలను నమోదు చేస్తోంది. మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కపూర్ అండ్ సన్స్, ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇందులో 105 కోట్ల వరకు భారత్‌లోనే సాధించగా, మరో 45 కోట్లు ఓవర్ సీస్లో కొల్లగొట్టింది. సిద్దార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్, ఆలియా భట్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రిషీకపూర్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ వయసులో కూడా రిషీ కపూర్ ప్రొస్థటిక్ మేకప్‌తో తాత పాత్రలో నటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరో కీలక పాత్రలో రత్నా పాఠక్ ఆకట్టుకుంది. కుటుంబ సంబందాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. -
'కపూర్ అండ్ సన్స్' మెప్పించింది
జానర్ : ఫ్యామిలీ డ్రామా నటీనటులు : రిషీ కపూర్, ఫవాద్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ తదితరులు దర్శకత్వం : షకూన్ బత్రా సంగీతం : ఆమాల్ మాలిక్ నిర్మాత : కరణ్ జోహర్ విడుదలకు ముందే ఆసక్తిని కలిగించిన బాలీవుడ్ సినిమా 'కపూర్ అండ్ సన్స్'. సినిమాలకు ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ 'ప్రేమ' అయితే, ఎవర్ గ్రీన్ ఎలిమెంట్ 'కుటుంబం'. అలాంటి ఫ్యామిలీ డ్రామాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'కపూర్ అండ్ సన్స్'. అన్నదమ్ముల చిల్లర గొడవలతో మొదలై బంధాల మధ్య ఉండే భావోద్వేగాలతో ముగిసే ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. రాహుల్ (ఫవాద్ ఖాన్), అర్జున్ (సిద్ధార్థ్ మల్హోత్రా)లు అన్నదమ్ములు. రాహుల్ ఇంట్లో పెద్దవాడు అవడంతో అందరి అంచనాలకు తగ్గట్టు బాధ్యతగా వ్యవహరిస్తుంటాడు.. కానీ 'పెద్దరికం' అనే చట్రంలో జీవితాన్ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్‌లో ఉంటాడు. ఇక చిన్నవాడైన అర్జున్.. అన్న పేరు చెప్పుకుంటూ ఆకతాయి పనులు చేస్తుండే కుర్రాడు. అన్నదమ్ములిద్దరూ ఏదో ఒక విషయంలో తరచూ గొడవలు పడుతూ బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న తాతయ్యను(రిషీ కపూర్) కలిసేందుకు అన్నదమ్ములిద్దరూ కలిసి సొంత ఊరికి బయలుదేరాల్సి వస్తుంది. ఈ ప్రయాణమే సినిమాలోని ములుపు. తాతగారిని కలిసి, ఆయన కోరిక విన్న తరువాత ఇన్నాళ్లూ గొడవలతో అల్లరి చిల్లరగా సాగిన ఈ అన్నదమ్ముల వ్యవహారం గాడిన పడుతుంది. అక్కడి నుంచి కథ ఊపందుకుంటుంది. తలో దిక్కుగా ఉన్న కుటుంబాన్ని ఒక్క చోట చేర్చాలన్నదే అవసాన దశలో ఉన్న తాతగారి బలమైన కోరిక. ఆయన కోరికను దిగ్విజయంగా పూర్తి చేసి చూపిస్తారు సోదరులు. అలాగే తాతగారి ఊరిలో టియా (అలియా భట్)ను చూసిన అన్నదమ్ములిద్దరూ ఆమె ప్రేమలో పడిపోతారు. అయితే టియా మనసు ఎవరు గెలుచుకున్నారనే లవ్ ఎపిసోడ్ ప్రేక్షకులను అలరిస్తుంది. కుటుంబంలో తలెత్తే మనస్పర్థలు, మనసులోనే దాచుకునే కొన్ని సున్నిత భావోద్వేగాలను చూపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేశాడు దర్శకుడు. ఇక అలియా, సిద్ధార్థ్‌ల కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్‌లో అన్నదమ్ముల మధ్య చోటుచేసుకునే సంఘటనలన్నీ అందరి ఇళ్లల్లో జరిగేంత సహజంగా ఉండటంతో ప్రేక్షకుడు తేలికగానే కథలో లీనమవుతాడు. సినిమాలో 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపించిన రిషీ కపూర్ సినిమాకు హైలెట్‌గా నిలిచారు. రాహుల్‌గా నటించిన పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ ఆకట్టుకున్నాడు. అలియా అందంతోపాటు ఈసారి అభినయం కూడా మెప్పించింది. ఆమాల్ మాలిక్ సంగీతం వినసొంపుగా ఉంది. మొత్తంగా దర్శకుడు షకూన్ బత్రా 'కపూర్ అండ్ సన్స్'ను విజయవంతంగా ఇంట్రడ్యూస్ చేశారు. బలాలు కథనం అలియా, సిద్ధార్ట్ ల జంట సంగీతం బలహీనతలు స్లో నేరేషన్ -
ఈ వారం youtube హిట్స్
ఘోస్ట్‌బస్టర్స్ : ట్రైలర్ నిడివి : 2 ని. 37 సె. హిట్స్ : 1,44,75,067 అతీంద్రియ శక్తులంటే కామెడీ కాదు. హారర్! మరి హారర్ మూవీలో కామెడీ యాక్టర్లు మెలిసా మెకార్తీ, క్రిస్టన్ వీగ్, కేట్ మెకినన్, లెస్లీ జోన్స్, క్రిస్ హెమ్స్వర్త్లకు ఏం పని? ఏం పని అంటే దుష్ట శక్తులనుంచి ఈ లోకాన్ని కాపాడే పని. అదీ కామెడీలా, కడుపుబ్బ నవ్వించేలా. ‘ఘోస్ట్‌బస్టర్స్’ పేరుతో ఈ ఏడాది జూలై 15న విడుదల అవుతున్న ఈ చిత్రంలో రోవన్ అనే భూతం బారినుండి మానవాళిని కాపాడే ప్రయత్నంలో మన కామెడీ టీమ్ ఎలాంటి హాస్య విన్యాసాలను ప్రదర్శిస్తుందో శాంపిల్‌గా ఈ ట్రైలర్లో చూడొచ్చు. 1984లో రిలీజ్ అయిన ‘ఘోస్ట్‌బస్టర్’కు ఇది సీక్వెల్. అయితే డెరైక్టర్ నుంచి నటీమణుల వరకు ఇందులో అంతా కొత్తవారే. అన్నట్లు ‘ఘోస్ట్‌బస్టర్స్’లో మనకు కనిపించే ప్రధాన పాత్రలన్నీ మహిళలవే. మగ ఘోస్ట్. ఆడ బస్టర్స్ (నిరోధించేవారు). కపూర్ అండ్ సన్స్ : సాంగ్ నిడివి : 2 ని. 22 సె. హిట్స్ : 91,48,722 క్రేజియస్ట్ హౌస్ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ విన్నారా? వినడం కంటే మంచి విషయం.. చూడడం! మార్చి 18న విడుదలౌతున్న బాలీవుడ్ మూవీ ‘కపూర్ అండ్ సన్స్ (సిన్స్ 1921)’ చిత్రంలోని ఈ ‘లడికీ బ్యూటీఫుల్.. కర్ గయీ చుల్’ వీడియో సాంగ్ మిమ్మల్ని ఒక వినోదాత్మకమైన గుంపు ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఆలియాభట్, సిద్ధార్థ మల్హోత్రా శోభాయమానంగా వెలిగిపోతూ మిగతావాళ్లతో కలిసి ఇందులో వేసే స్టెప్స్ మిమ్మల్ని ఉల్లాసభరితం చేస్తాయి. బాద్షా, ఫాజిల్ పూరియా, సుకృతీ కక్కర్, నేహా కక్కర్ ఆలపించిన ‘.. కర్ గయీ చుల్’ గీతానికి బాద్షా, కుమార్ సాహిత్యాన్ని సమకూర్చారు. స్వర కల్పన కూడా అతడే.. బాద్షా! ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు అన్నదమ్ముల సరదా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా... ‘కపూర్ అండ్ సన్స్’.