ఈ వారం youtube హిట్స్
ఘోస్ట్‌బస్టర్స్ : ట్రైలర్
నిడివి : 2 ని. 37 సె.
హిట్స్ : 1,44,75,067
అతీంద్రియ శక్తులంటే కామెడీ కాదు. హారర్! మరి హారర్ మూవీలో కామెడీ యాక్టర్లు మెలిసా మెకార్తీ, క్రిస్టన్ వీగ్, కేట్ మెకినన్, లెస్లీ జోన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్‌లకు ఏం పని? ఏం పని అంటే దుష్ట శక్తులనుంచి ఈ లోకాన్ని కాపాడే పని. అదీ కామెడీలా, కడుపుబ్బ నవ్వించేలా. ‘ఘోస్ట్‌బస్టర్స్’ పేరుతో ఈ ఏడాది జూలై 15న విడుదల అవుతున్న ఈ చిత్రంలో రోవన్ అనే భూతం బారినుండి మానవాళిని కాపాడే ప్రయత్నంలో మన కామెడీ టీమ్ ఎలాంటి హాస్య విన్యాసాలను ప్రదర్శిస్తుందో శాంపిల్‌గా ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. 1984లో రిలీజ్ అయిన ‘ఘోస్ట్‌బస్టర్’కు ఇది సీక్వెల్. అయితే డెరైక్టర్ నుంచి నటీమణుల వరకు ఇందులో అంతా కొత్తవారే. అన్నట్లు ‘ఘోస్ట్‌బస్టర్స్’లో మనకు కనిపించే ప్రధాన పాత్రలన్నీ మహిళలవే. మగ ఘోస్ట్. ఆడ బస్టర్స్ (నిరోధించేవారు).
కపూర్ అండ్ సన్స్ : సాంగ్
నిడివి : 2 ని. 22 సె.
హిట్స్ : 91,48,722
క్రేజియస్ట్ హౌస్ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ విన్నారా? వినడం కంటే మంచి విషయం.. చూడడం! మార్చి 18న విడుదలౌతున్న బాలీవుడ్ మూవీ ‘కపూర్ అండ్ సన్స్ (సిన్స్ 1921)’ చిత్రంలోని ఈ ‘లడికీ బ్యూటీఫుల్.. కర్ గయీ చుల్’ వీడియో సాంగ్ మిమ్మల్ని ఒక వినోదాత్మకమైన గుంపు ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఆలియాభట్, సిద్ధార్థ మల్హోత్రా శోభాయమానంగా వెలిగిపోతూ మిగతావాళ్లతో కలిసి ఇందులో వేసే స్టెప్స్ మిమ్మల్ని ఉల్లాసభరితం చేస్తాయి. బాద్షా, ఫాజిల్ పూరియా, సుకృతీ కక్కర్, నేహా కక్కర్ ఆలపించిన ‘.. కర్ గయీ చుల్’ గీతానికి బాద్షా, కుమార్ సాహిత్యాన్ని సమకూర్చారు. స్వర కల్పన కూడా అతడే.. బాద్‌షా! ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు అన్నదమ్ముల సరదా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా... ‘కపూర్ అండ్ సన్స్’.