'కపూర్ అండ్ సన్స్' మెప్పించింది
జానర్ : ఫ్యామిలీ డ్రామా
నటీనటులు : రిషీ కపూర్, ఫవాద్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ తదితరులు
దర్శకత్వం : షకూన్ బత్రా
సంగీతం : ఆమాల్ మాలిక్
నిర్మాత : కరణ్ జోహర్
విడుదలకు ముందే ఆసక్తిని కలిగించిన బాలీవుడ్ సినిమా 'కపూర్ అండ్ సన్స్'. సినిమాలకు ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ 'ప్రేమ' అయితే, ఎవర్ గ్రీన్ ఎలిమెంట్ 'కుటుంబం'. అలాంటి ఫ్యామిలీ డ్రామాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'కపూర్ అండ్ సన్స్'. అన్నదమ్ముల చిల్లర గొడవలతో మొదలై బంధాల మధ్య ఉండే భావోద్వేగాలతో ముగిసే ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
రాహుల్ (ఫవాద్ ఖాన్), అర్జున్ (సిద్ధార్థ్ మల్హోత్రా)లు అన్నదమ్ములు. రాహుల్ ఇంట్లో పెద్దవాడు అవడంతో అందరి అంచనాలకు తగ్గట్టు బాధ్యతగా వ్యవహరిస్తుంటాడు.. కానీ 'పెద్దరికం' అనే చట్రంలో జీవితాన్ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్లో ఉంటాడు. ఇక చిన్నవాడైన అర్జున్.. అన్న పేరు చెప్పుకుంటూ ఆకతాయి పనులు చేస్తుండే కుర్రాడు. అన్నదమ్ములిద్దరూ ఏదో ఒక విషయంలో తరచూ గొడవలు పడుతూ బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న తాతయ్యను(రిషీ కపూర్) కలిసేందుకు అన్నదమ్ములిద్దరూ కలిసి సొంత ఊరికి బయలుదేరాల్సి వస్తుంది. ఈ ప్రయాణమే సినిమాలోని ములుపు. తాతగారిని కలిసి, ఆయన కోరిక విన్న తరువాత ఇన్నాళ్లూ గొడవలతో అల్లరి చిల్లరగా సాగిన ఈ అన్నదమ్ముల వ్యవహారం గాడిన పడుతుంది.
అక్కడి నుంచి కథ ఊపందుకుంటుంది. తలో దిక్కుగా ఉన్న కుటుంబాన్ని ఒక్క చోట చేర్చాలన్నదే అవసాన దశలో ఉన్న తాతగారి బలమైన కోరిక. ఆయన కోరికను దిగ్విజయంగా పూర్తి చేసి చూపిస్తారు సోదరులు. అలాగే తాతగారి ఊరిలో టియా (అలియా భట్)ను చూసిన అన్నదమ్ములిద్దరూ ఆమె ప్రేమలో పడిపోతారు. అయితే టియా మనసు ఎవరు గెలుచుకున్నారనే లవ్ ఎపిసోడ్ ప్రేక్షకులను అలరిస్తుంది. కుటుంబంలో తలెత్తే మనస్పర్థలు, మనసులోనే దాచుకునే కొన్ని సున్నిత భావోద్వేగాలను చూపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేశాడు దర్శకుడు. ఇక అలియా, సిద్ధార్థ్ల కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్లో అన్నదమ్ముల మధ్య చోటుచేసుకునే సంఘటనలన్నీ అందరి ఇళ్లల్లో జరిగేంత సహజంగా ఉండటంతో ప్రేక్షకుడు తేలికగానే కథలో లీనమవుతాడు.
సినిమాలో 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపించిన రిషీ కపూర్ సినిమాకు హైలెట్గా నిలిచారు. రాహుల్గా నటించిన పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ ఆకట్టుకున్నాడు. అలియా అందంతోపాటు ఈసారి అభినయం కూడా మెప్పించింది. ఆమాల్ మాలిక్ సంగీతం వినసొంపుగా ఉంది. మొత్తంగా దర్శకుడు షకూన్ బత్రా 'కపూర్ అండ్ సన్స్'ను విజయవంతంగా ఇంట్రడ్యూస్ చేశారు.
బలాలు
కథనం
అలియా, సిద్ధార్ట్ ల జంట
సంగీతం
బలహీనతలు
స్లో నేరేషన్