పాకిస్థాన్ నటుడికి బాలీవుడ్ హీరో మద్దతు
ముంబై: పాకిస్థాన్ నటుడు ఫవద్ ఖాన్ కు బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా బాసటగా నిలిచాడు. సృజనకు సరిహద్దులు లేవని, ఎవరు ఎవరితోనైనా నటించే స్వేచ్ఛ నటులకు ఉందని మల్హోత్రా అన్నాడు. ప్రస్తుతం తమతో ఫవద్ ఖాన్ నటిస్తున్నాడని తెలిపాడు. 17వ జియో మామి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి మల్హోత్రా హాజరయ్యాడు.
పాకిస్థాన్ నటులు, క్రికెటర్లను మహారాష్ట్ర గడ్డపై అడుగుపెట్టనీయబోమని శివసేన ప్రకటించిన నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. ఫవద్ ఖాన్, మహిర ఖాన్ లాంటి పాకిస్థాన్ నటులు బాలీవుడ్ లో నటించకుండా నిషేధించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ జంటగా నటిస్తున్న 'కపూర్ అండ్ సన్స్' సినిమాలో ఫవద్ ఖాన్ నటిస్తున్నాడు.
తన గాల్ ఫ్రెండ్ అలియా భట్ నటించిన 'షాన్ దార్' సినిమా చూశానని, తనకు బాగా నచ్చిందని మల్హోత్రా తెలిపాడు. ఇది గొప్ప సినిమా అని కితాబిచ్చాడు. రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా నటించాడు.