ఇస్లామాబాద్ : పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్‌పై లాహోర్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. యాంటి- పోలియో టీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివరాలు... ఫవాద్ ఖాన్ కూతురికి పోలియో డ్రాప్స్ వేసేందుకు పోలియో వర్కర్లు ఫైజల్ టౌన్‌లోని అతడి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న ఫవాద్ భార్య సదాఫ్ ఖాన్.. తమ కూతురికి పోలియో డ్రాప్స్ వేసేందుకు నిరాకరించారు. అంతేకాకుండా కారు డ్రైవర్‌తో కలిసి సంబంధిత వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వారు ఫవాద్ ఖాన్ సహా అతడి భార్య, డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫవాద్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఈవెంట్ నిమిత్తం దుబాయ్‌లో ఉన్నాడు.
కాగా పోలియో కేసులు అత్యధికంగా నమోదయ్యే దేశాల్లో ఒకటైన పాకిస్తాన్‌లో.. అక్కడి చట్టాల ప్రకారం పిల్లలకు పోలియో చుక్కలు వేయించని తల్లిదండ్రులకు జరిమానా విధించడంతో పాటు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇక సోనమ్ కపూర్ ఖూబ్‌సూరత్ సినిమాలో హీరోగా నటించిన ఫవాద్.. యే దిల్ హై ముష్కిల్ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్ర పోషించాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ నటులపై బాలీవుడ్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు బాలీవుడ్ తెరకు దూరం కానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment