
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది కన్నుమూశారు. వారిలో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ నర్వాల్ ఒకరు. ఏప్రిల్ 16న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ నేవీ అధికారి.. హనీమూన్ కోసం ఏప్రిల్ 21న కశ్మీర్ వెళ్లారు. భార్యతో కలిసి కొత్త లైఫ్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ఆ మరుసటి రోజు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ నేలకొరిగారు.
పెళ్లయిన ఆరు రోజులకే..
కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడం చూసి గుండెలు పగిలేలా రోదించింది భార్య హిమాన్షి. అందుకు సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. బిగ్‌బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) అయితే ఆ వీడియోలు చూసి మరింత షాక్‌కు గురయ్యాడు. హిమాన్షి కాలేజీలో రోజుల్లో తన క్లాస్‌మేట్ అని గుర్తు చేసుకున్నాడు.
ఇంకా షాక్‌లోనే ఉన్నా..
ఎల్విష్ మాట్లాడుతూ.. నేను హన్సరాజ్ కాలేజీలో చదువుకున్నాను. 2018లో నా చదువు పూర్తయింది. హిమాన్షిది కూడా అదే కాలేజ్.. ఆ రోజుల్లో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. మెట్రో స్టేషన్‌కు కూడా కలిసి వెళ్లేవాళ్లం. కాలేజ్ అయిపోయాక మళ్లీ మేము మాట్లాడుకోలేదు. కాకపోతే తన నెంబర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. కానీ, ఇప్పుడామె ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితిలో లేదనుకుంటున్నాను. పైగా నేనే ఇంకా షాక్‌లో ఉన్నా.. అలాంటిది తన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుంది!
31వ సారి ఫోన్ ఎత్తింది
అందుకే ఇది సరైన సమయం కాదేమో అనిపించి తనకు ఫోన్ చేసి మాట్లాడలేదు. నా ఫ్రెండ్ ఒకరు తనకు 30 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. 31వ సారి ఫోన్ ఎత్తింది. మీడియాలో వస్తున్నట్లుగానే మతం అడిగి తెలుసుకుని మరీ హిందువులను చంపేశారన్నది నిజం అని చెప్పుకొచ్చాడు. కాగా ఎల్విష్ యాదవ్.. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ రెండో సీజన్ విజేతగా నిలిచాడు.
చదవండి: పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్ కింగ్ నేనే: నాని