సాక్షి, చెన్నై: తమిళనాడు నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికైన వారిని గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ గురువారం అభినందించారు. వివరాలు.. 2023 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్రానికి చెందిన ఆరుగురికి పురస్కారాలు లభించాయి.
వీరిలో గాయని వాణీ జయరాంకు పద్మ విభూషణ్ దక్కింది. మిగిలిన ఐదుగురిని పద్మశ్రీ వరించింది. అలాగే, కల్యాణ సుందరం పిళ్‌లై (కళ) వడివేల్ గోపాల్, మాసి సడయన్ (సామాజిక సేవ), పాలం కల్యాణ సుందరం (సామాజిక సేవ), గోపాల్ స్వామి వేలుస్వామి (వైద్యం) ఉన్నారు. ప్రస్తుతం పద్మశ్రీతో ఇద్దరు వ్యక్తులు తమిళనాడు ప్రముఖులుగా తెర మీదకు వచ్చారు. ఆ ఇద్దరు పాములు పట్టడంలో దిట్టగా ఉండటం విశేషం.
పాములను పట్టే ఇద్దరిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం
చెంగల్పట్టు నుంచి అమెరికా వరకు విషపూరిత పాములను పట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వెనుక బడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని పద్మశ్రీ వరించింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాలు.. చెంగల్పట్టు జిల్లా సెందురి గ్రామానికి చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన వడివేల్ గోపాల్, మాసి సడయన్ పాములు పట్టాడాన్నే వృత్తిగా కొనసాగిస్తున్నారు. వంశ పారంపర్యగా వస్తున్న నేర్చుకున్న విద్యతో ఈ ఇద్దరు అమెరికా వరకు తమ సేవలను అందించారు. ప్రస్తుతం పద్మశ్రీ పురస్కారానికి సైతం ఎంపికై ఉండడం విశేషం.
అంతర్జాతీయ స్థాయిలో పాములు పట్టే శిక్షణ ఇచ్చే స్థాయికి వీరు ఎదిగి ఉన్నారు. అమెరికా ఫ్లోరిడాలో కొండ చిలువలను పట్టే ప్రముఖ నిపుణుడు రోమ్లస్ విక్టోరికర్ బృందంలో ఈ ఇద్దరు సభ్యులుగా ఉండడం వెలుగులోకి వచ్చింది. కాగా తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై వడివేల్ గోపాల్ మాట్లాడుతూ ఈ ఘనత అందుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. అమెరికా, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలలో తాము పాములు పట్టామని, అధిక విషం కలిగిన పాములు ఎన్ని పట్టామో తనకే తెలియదని పేర్కొన్నారు. మాసి సడయన్ మాట్లాడుతూ పద్మశ్రీ రావడం గొప్ప ఘతన అని ఈ ఆనందానికి మాటలు లేవని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: వైద్యంలో అతడి సేవలు అమోఘం.. వరించిన పద్మశ్రీ
Comments
Please login to add a commentAdd a comment