ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమార్తె గీతా మెహతా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరస్కరించడంతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. సీనియర్ కాంగ్రెస్సేతర నేతగా, కేంద్ర మంత్రిగా కూడా దేశ ప్రజలందరికీ తెలిసిన బిజూ, పంజాబీ మహిళ జ్ఞాన్ ఏకైక కూతురు, ప్రస్తుత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అక్క అయిన గీత తన తమ్ముడికి ఉన్న పదవి, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర వల్ల పద్మ అవార్డును తిరస్కరించారు. ఆమె అన్న ప్రేమ్ పట్నాయక్ ఢిల్లీలో పెద్ద పారిశ్రామికవేత్త. లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు అవార్డు తీసుకోవడం అపార్థాలు, అపోహలకు దారితీస్తుందనే కారణంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న గీత.. 1979లో ‘కర్మా కోలా–మార్కెటింగ్ ది మిస్టిక్ ఈస్ట్’ అనే పుస్తకం రాయడం ద్వారా తొలిసారి ప్రాచుర్యంలోకి వచ్చారు.
ఆమె ఇంకా కొన్ని గ్రంథాలు రాయడమేగాక డాక్యుమెంటరీ సినిమాలు కూడా తీశారు. ఆమె భర్త సోనీ (అజయ్‌సింగ్)మెహతా పెంగ్విన్ వంటి ప్రఖ్యాత ప్రచురణ సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన నాఫ్ డబుల్‌డే పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్నారు. భర్త సోనీ మెహతాతో కలిసి లండన్‌లో ఆమె నివసిస్తున్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక దేశంలో అసహనం పెరిగిందనే కారణంగా 2015 సెప్టెంబర్ నుంచి అనేక మంది రచయితలు, మేధావులు తాము గతంలో తీసుకున్న అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ప్రసిద్ధ జర్నలిస్ట్, రచయిత కుష్వంత్‌సింగ్ కూడా 1984లో స్వర్ణదేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట ఇందిరాగాంధీ సర్కారు జరిపించిన సైనిక చర్యకు నిరసనగా తనకు 1974లో ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చారు.
మోదీతో నవీన్‌ను పోల్చిన రాహుల్
గీతకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన రోజున ఒడిశాలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈమె తమ్ముడు నవీన్ పట్నాయక్‌ను ‘నరేంద్రమోదీ తరహా నేత’అని, రిమోట్ కంట్రోల్ మోదీ చేతిలో ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఇచ్చిన అవార్డు స్వీకరిస్తే తనకు, నవీన్‌కు ఇబ్బందికరమని గీత భావించారు. నవీన్ దాదాపు 19 ఏళ్లుగా రాష్ట్ర సీఎంగా కొనసాగుతున్నారు. ఏప్రిల్–మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆయన రాజకీయ జీవితంలో కీలకమైనవిగా భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలపలేదు. గీత అవార్డు స్వీకరిస్తే కాషాయపక్షంతో నవీన్‌కు లోపాయికారీ సంబంధాలున్నాయనే అనుమానం జనంలో రాకుండా, ఆయనకు ఇబ్బంది కలగకుండా ఉండటానికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2017 పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్‌ను రెండో స్థానంలోకి నెట్టి గణనీయంగా సీట్లు, ఓట్లు సంపాదించింది. అప్పటి నుంచీ గీత ఒడిశాకు తరచూ వస్తూ పాలకపక్షమైన బిజూజనతాదళ్(బీజేడీ) వ్యవçహారాల్లో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారని వార్తలొచ్చాయి. ఒక దశలో గీతను బీజేడీ టికెట్‌పై రాజ్యసభకు పంపుతారని అనుకున్నా చివరి నిమిషంలో నవీన్ మనసు మార్చుకున్నారు. తల్లి పంజాబీ కావడం, బాల్యం ఒడిశాలో గడపకపోవడంతో ఒడియాలో అనర్గళంగా ప్రసంగించలేని నవీన్ జనంతో పెద్దగా కలిసిపోయే నేత కాదు. అయితే, గీత సలహా మేరకే ఆయన ఇటీవల పుస్తకాల షాపులు, కాలేజీలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలతో కలసి మాట్లాడటమేగాక వారితో సెల్ఫీలు కూడా దిగుతున్నారు.
ఎవరీ గీతా మెహతా?
Published Sun, Jan 27 2019 3:18 AM | Last Updated on Sun, Jan 27 2019 9:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment