biju patnaik
-
నా తండ్రి సమాధిని తొలగించండి: సీఎం
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ సమాధిని తొలగించాని నిర్ణయించారు. సీఎం నిర్ణయం వెలువడిన గంటల వ్యవధిలోనే ఆదేశాలను జారీ చేశారు. బిజూ పట్నాయక్ సమాధి సహా, ఆయన జ్ఞాపకార్థం కోసం ఏర్పాటు చేసిన స్మారక కేంద్రాన్ని కూడా తొలగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పూరి పుణ్యక్షేత్రంలో బిజూ పట్నాయక్ సమాధి ఉంది. స్వర్గద్వార్ అనే పేరుతో బిజూ స్మారక కేంద్రం, శ్మశాన వాటికను అక్కడ ఏర్పాటు చేశారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలంటూ గత కొంత కాలంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బిజూ పట్నాయక్ సమాధి ఉండటం వల్ల దాన్ని తొలగించడం అసాధ్యమని, శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం దాదాపు అసాధ్యమంటూ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశమైన సీఎం.. సమస్య పరిష్కారం కోసం ఏమైనా చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా తన తండ్రి సమాధిని, స్మారక కేంద్రాన్ని తొలగించాలని ఆదేశించారు. పట్నాయక్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎవరీ గీతా మెహతా?
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమార్తె గీతా మెహతా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరస్కరించడంతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. సీనియర్ కాంగ్రెస్సేతర నేతగా, కేంద్ర మంత్రిగా కూడా దేశ ప్రజలందరికీ తెలిసిన బిజూ, పంజాబీ మహిళ జ్ఞాన్ ఏకైక కూతురు, ప్రస్తుత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అక్క అయిన గీత తన తమ్ముడికి ఉన్న పదవి, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర వల్ల పద్మ అవార్డును తిరస్కరించారు. ఆమె అన్న ప్రేమ్ పట్నాయక్ ఢిల్లీలో పెద్ద పారిశ్రామికవేత్త. లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు అవార్డు తీసుకోవడం అపార్థాలు, అపోహలకు దారితీస్తుందనే కారణంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న గీత.. 1979లో ‘కర్మా కోలా–మార్కెటింగ్ ది మిస్టిక్ ఈస్ట్’ అనే పుస్తకం రాయడం ద్వారా తొలిసారి ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆమె ఇంకా కొన్ని గ్రంథాలు రాయడమేగాక డాక్యుమెంటరీ సినిమాలు కూడా తీశారు. ఆమె భర్త సోనీ (అజయ్‌సింగ్)మెహతా పెంగ్విన్ వంటి ప్రఖ్యాత ప్రచురణ సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన నాఫ్ డబుల్డే పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్నారు. భర్త సోనీ మెహతాతో కలిసి లండన్‌లో ఆమె నివసిస్తున్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక దేశంలో అసహనం పెరిగిందనే కారణంగా 2015 సెప్టెంబర్ నుంచి అనేక మంది రచయితలు, మేధావులు తాము గతంలో తీసుకున్న అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ప్రసిద్ధ జర్నలిస్ట్, రచయిత కుష్వంత్‌సింగ్ కూడా 1984లో స్వర్ణదేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట ఇందిరాగాంధీ సర్కారు జరిపించిన సైనిక చర్యకు నిరసనగా తనకు 1974లో ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చారు. మోదీతో నవీన్‌ను పోల్చిన రాహుల్ గీతకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన రోజున ఒడిశాలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈమె తమ్ముడు నవీన్ పట్నాయక్‌ను ‘నరేంద్రమోదీ తరహా నేత’అని, రిమోట్ కంట్రోల్ మోదీ చేతిలో ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఇచ్చిన అవార్డు స్వీకరిస్తే తనకు, నవీన్‌కు ఇబ్బందికరమని గీత భావించారు. నవీన్ దాదాపు 19 ఏళ్లుగా రాష్ట్ర సీఎంగా కొనసాగుతున్నారు. ఏప్రిల్–మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆయన రాజకీయ జీవితంలో కీలకమైనవిగా భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలపలేదు. గీత అవార్డు స్వీకరిస్తే కాషాయపక్షంతో నవీన్‌కు లోపాయికారీ సంబంధాలున్నాయనే అనుమానం జనంలో రాకుండా, ఆయనకు ఇబ్బంది కలగకుండా ఉండటానికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2017 పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్‌ను రెండో స్థానంలోకి నెట్టి గణనీయంగా సీట్లు, ఓట్లు సంపాదించింది. అప్పటి నుంచీ గీత ఒడిశాకు తరచూ వస్తూ పాలకపక్షమైన బిజూజనతాదళ్(బీజేడీ) వ్యవçహారాల్లో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారని వార్తలొచ్చాయి. ఒక దశలో గీతను బీజేడీ టికెట్‌పై రాజ్యసభకు పంపుతారని అనుకున్నా చివరి నిమిషంలో నవీన్ మనసు మార్చుకున్నారు. తల్లి పంజాబీ కావడం, బాల్యం ఒడిశాలో గడపకపోవడంతో ఒడియాలో అనర్గళంగా ప్రసంగించలేని నవీన్ జనంతో పెద్దగా కలిసిపోయే నేత కాదు. అయితే, గీత సలహా మేరకే ఆయన ఇటీవల పుస్తకాల షాపులు, కాలేజీలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలతో కలసి మాట్లాడటమేగాక వారితో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. -
శిథిలావస్థలో ‘డకోటా’
భువనేశ్వర్: రాష్ట్ర చరిత్రలో బిజూ పట్నాయక్ ధీరునిగా స్థానం సాధించారు. ధీరత్వ కార్యశైలిలో అడుగడుగునా అనుక్షణం డకోటా విమానం తోడుగా ఉండడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఇదో స్మారక చిహ్నంగా వెలుగొందాల్సిన అద్భుత నమూనా. మౌలిక ఆదరణకు దూరమై కోల్కత్తా విమానాశ్రయంలో మరుగున పడి ఉంది. ఈ అపురూప డకోటా విమానాన్ని అపురూపంగా పదిలపరచుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం దీని వైపు దృష్టి సారించకపోవడం విచారకరం. భారత విమానాశ్రయాల విభాగం రాష్ట్రానికి మేల్కొలిపింది. దివంగత ముఖ్యమంత్రి ధీరత్వానికి ప్రతీకగా ప్రతిబింబించాల్సిన డకోటా విమానం ఆదరణపట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అభ్యర్థించింది. ఈ అభ్యర్థనతో రాష్ట్ర ప్రభుత్వం చైతన్యవంతమైంది. రాష్ట్రానికి తక్షణమే తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అనుబంధ విభాగాలు, వర్గాలతో సంప్రదింపులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో బిజూ పట్నాయక్ డకోటా విమానం రాష్ట్రానికి తరలివస్తుంది. ఆశ్రయం ఎక్కడ? అపురూపమైన డకోటా విమానం దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ ప్రతీకగా రాష్ట్రానికి తరలివస్తుంది. రాష్ట్ర ప్రజలతో పాటు పర్యాటకులు, సందర్శకులు తిలకించేందుకు అనుకూలమైన ప్రాంతంలో దీనిని ప్రదర్శించడం అనివార్యంగా భావిస్తున్నారు. అటువంటి అనుకూల ప్రాంతంపట్ల తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో దీనిని పదిల పరిచే యోచనతో బిజూ జనతా దళ్ వర్గాలు యోచిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జన్మ స్థలం, సొంత భవనం కటక్ నగరంలో ఆనంద భవన్ మ్యూజియంగా వెలుగొందుతోంది. ఈ ప్రాంగణంలో డకోటా విమానాన్ని ప్రదర్శించాలనే యోచన పార్టీ శ్రేణుల్లో బలంగా కనిపిస్తోంది. అయితే అందుకు అవసరమైనంత స్థలం ఈ ప్రాంగణంలో అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. అంతర్జాతీయ పర్యాటకుల కోసం ప్రియతమ నాయకుని అద్భుత విహంగ విన్యాసాల్ని ప్రతిబింబించే డకోటా విమానం స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఉండాలనే ఆకాంక్ష పలువురి హృదయాల్లో ఉంది. నిత్యం దేశ, విదేశాల నుంచి విచ్చేసే జాతీయ, అంతర్జాతీయ విమాన యాన పర్యాటకుల దృష్టిని ఆకట్టుకుంటుందని ఈ వర్గం అభిప్రాయం. నిర్వహణ శైలి కూడా ఉన్నతంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. బిజూ పట్నాయక్‌కు చేదోడు వాదోడుగా ఉపయోగపడిన డకోటా విమానం భద్రపరిచేందుకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికార వర్గాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోల్కత్తా విమానాశ్రయంలో మరుగున పడిన బిజూ పట్నాయక్ డకోటా విమానంపట్ల శ్రద్ధ వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురు ప్రసాద్ మహాపాత్రో తెలిపారు. ఈ లేఖపట్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రవాణా చేసేందుకు అనుబంధ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు త్వరలోనే ప్రభుత్వ అధికారి కోల్కత్తా సందర్శించి డకోటా తరలింపు వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారని రాష్ట్ర ప్రభుత్వం బదులు లేఖ రాసినట్లు వివరించారు. పరిశోధకుల మాట పెడ చెవిన రాష్ట్ర కీర్తి చిహ్నంగా నిలవాల్సిన బిజూ పట్నాయక్ మిత్రుని లాంటి డకోటా విమానం మరుగున పడి ఉండడంపట్ల పరిశోధకుల వర్గం హృదయాల్ని కలిచి వేస్తోంది. బిజూ పట్నాయక్ చారిత్రాత్మక విజయాలకు ఈ విమానం సారథిగా నిలిచింది. అటువంటి అపురూప విమానం నేడు పొరుగు రాష్ట్రం విమానాశ్రయంలో శిథిలమవుతోంది. తక్షణమే సంరక్షించి రాష్ట్రంలో సురక్షిత ప్రాంతంలో పదిల పరచాలి. ప్రధానంగా స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో దీనికి స్థానం కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు యుద్ధ పరిశోధకుడు అనిల్ ధీర్ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ 5 ఏళ్ల నుంచి నిరవధికంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆయన అభ్యర్థనలపట్ల ముఖ్యమంత్రి పెడచెవి ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఘనం దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జీవిత చరిత్రలో డకోటా విమానం పాత్ర ఎంతో ఘనం. చరిత్రకారులు దీని పాత్రను అనన్యంగా పేర్కొంటున్నారు. శత్రు వర్గాలతో తలపడిన, వైరి వర్గాల స్థావరాల నుంచి స్వాతంత్ర సమర యోధుల్ని మాతృ భూమికి తరలించాల్సిన అపురూప సందర్భాల్లో డకోటా విమానమే బిజూ పట్నాయక్ వ్యూహాత్మక కార్యశైలికి సారథిగా నిలిచింది. ఇండోనేషియా స్వాతంత్ర సమరం, శ్రీనగర్ ఎదురు కాల్పులు, భారత సేనకు ఆహార సరఫరా వగైరా క్లిష్ట పరిస్థితుల్లో డకోటా సహాయంతో బిజూ పట్నాయక్ సాహస కృత్యాల్ని విజయవంతంగా నిర్వహించి జాతికి వన్నె తెచ్చిన చరిత్రని ఆవిష్కరించారు. ఈ ఘన చరిత్రకు డకోటా విమానమే వారధిగా చరిత్రకారులు పేర్కొంటారు. బిజూ బాబు సాహసానికి ఇదే ప్రేరణగా పేర్కొంటారు. బిజూ పట్నాయక్ వీర గాథ గుర్తు వస్తే డకోటా విమానం పాత్ర విస్మరించడం ఎవరి తరం కాదు. ఇది బిజూ పట్నాయక్ కళింగ ఎయిర్ లైన్స్‌లో ఒకటి. పాకిస్థాన్ శత్రువలయాన్ని ఛేదించి శ్రీనగర్‌లో బందీలుగా ఉన్న భారత సైన్యాన్ని విమానం గుండా దేశానికి తరలించిన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో డకోటా విమానం బిజూ పట్నాయక్‌కు సహకరించింది. సేనకు అవసరమైన ఔషధాలు, గుర్రాలు వగైరా రవాణా, ఇండోనేషియా ప్రధాన మంత్రిని డచ్ కబ్జా నుంచి విముక్తి కలిగించి ఆ దేశానికి అప్పగించడంలో డకోటా సేవలు అనన్యం. కోల్కత్తా నేతాజీ విమానాశ్రయం డంపింగ్ యార్డులో శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ధైర్య సాహసాలు ఆయన సొత్తు ధైర్య సాహసాలతో సంక్లిష్ట పరిస్థితుల్ని అవలీలగా ఎదురీదిన ధీరునిగా దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ మిగిలారు. బిజూ జీవితం పలు సాహస కృత్యాలకు ప్రతీకగా ప్రతిబింబిస్తుంది. పైలెట్‌గా ఆకాశ వీధుల్లో ఆయన సాధించిన ఘన విజయాలు అత్యద్భుతం. ఆయన సాహస కృత్యాలకు ప్రతీకగా ఇండోనేషియా భూమి పుత్రునిగా స్వీకరించింది. నేటికి ఆయన కుటుంబీకుల ఆత్మీయ, అనురాగాల్ని పంచుకుంటోంది. -
బిజూ జనతాదళ్ జోరు
బీజేడీకి ఉపకరించనున్న నవీన్ పట్నాయక్ క్లీన్ ఇమేజ్ సమర్ధ నాయకత్వ లేమితో కష్టాల్లో కాంగ్రెస్, బీజేపీలు కేడర్‌పై నమ్మకంతో కాంగ్రెస్ మోడీ ప్రభావంపైనే బీజేపీ ఆశలు వడ్డాణం సుదర్శన్, ఎలక్షన్ సెల్: ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఎల్లవేళలా అండగా నిలిచిన రాష్ట్రం ఒడిశా. ఆ పార్టీకి మద్దతుదారులు, సానుభూతిపరుల సంఖ్య ఇప్పటికీ తక్కువేం లేదు. అయితే, తండ్రి బిజూ పట్నాయక్ మరణానంతరం 17 ఏళ్ల క్రితం నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీ బిజూ జనతాదళ్(బీజేడీ) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. అనాసక్తితోనే రాజకీయం రంగప్రవేశం చేసిన నవీన్ పట్నాయక్.. 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీని విజయపథాన నిలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి ఒడిశాలో విజయవంతమైన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1998 నుంచి 2009 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు భాగస్వామిగా వ్యవహరించినప్పటికీ.. తన లౌకిక ముద్రను నిలుపుకోగలగడం నవీన్ ప్రత్యేకత. ఒడిశాలో ఖనిజ సంపదకు, ప్రకృతి వనరులకు కొదవలేదు. 2000 కన్నా ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనావైఫల్యం కారణంగా అదే స్థాయిలో అక్కడ పేదరికం కూడా తాండవించేది. ఆ పరిస్థితుల్లో పాలనాపగ్గాలు స్వీకరించిన నవీన్ పట్నాయక్ అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజాకర్షక పథకాలను సమస్థాయిలో అమలుపరుస్తూ విజయవంతమైన సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అంతర్గత సర్వేలతో అంచనా 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో బీజేడీ తన ఆధిపత్యం కొనసాగించే అవకాశాలే అధికంగా ఉన్నాయి. తక్కువ ధరకు బియ్యం, విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు, గర్భిణులకు ఆర్థికసాయం.. తదితర పథకాలతో ప్రజాబాహుళ్యానికి నవీన్ పట్నాయక్ బాగా దగ్గరయ్యారు. కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్న పశ్చిమ ప్రాంతాల్లోనూ పట్టు సాధించగలిగారు. పార్టీకి చెందిన ప్రస్తుత ప్రజాప్రతినిధులపై నియోజకవర్గాలవారీగా అంతర్గత సర్వేలు నిర్వహించారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వారికి టిక్కెట్లు ఇవ్వకూడదన్న ఆలోచనతో శాస్త్రీయ పద్ధతిలో ఆయన ఆ సర్వేలు నిర్వహించారు. మొత్తంమీద 15 నుంచి 17 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో నవీన్ పట్నాయక్ ఉన్నారు. అయితే, ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్ కుంభకోణం, దానికి సంబంధించి షా కమిషన్ పార్లమెంటుకు సమర్పించిన నివేదిక.. నవీన్ పాలనపై అవినీతి మరకలను మిగిల్చాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఆ ప్రభావం కూడా రానున్న ఎన్నికల్లో బీజేడీకి ప్రతికూలంగా పరిణమించవచ్చు. కాంగ్రెస్, బీజేపీలు అంతంతే.. బీజేడీ ఎన్నికల వ్యూహాలను అమల్లో పెడుతూ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమవుతుండగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అంతర్గత కుమ్ములాటలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నాయి. కాంగ్రెస్‌కు కొన్ని ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది. సంప్రదాయ ఓటుబ్యాంక్ మద్దతు ఉంది. అయితే, అంతర్గత రాజకీయాలు పార్టీని దెబ్బతీస్తు న్నాయి. మరోవైపు బీజేపీ మోడీ ప్రభావంపైనే నమ్మకం పెట్టుకుని ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల బలం ఉన్నప్పటికీ.. సమర్థమైన నాయకత్వ లోపం ఆ పార్టీని వేధిస్తోంది. 2004లో ఏడు స్థానాల్లో గెలిచి.. 2009లో బోణీ కొట్టని స్థాయికి పడిపోయిందంటేనే రాష్ట్రంలో బీజేపీ ప్రభావాన్ని అంచనా వేయొచ్చు. అయితే, ఈసారి మోడీ ప్రభావంతో కనీసం 4-6 స్థానాలు నెగ్గుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేడీ అనుకూలం: నవీన్ పట్నాయక్ ఇమేజ్, సంక్షేమ పథకాలు, బలంగా లేని ప్రతిపక్షం ప్రతికూలం: మైనింగ్, చిట్‌ఫండ్ రంగాల్లో బయటపడ్డ స్కాంలు, ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ అనుకూలం: గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఓటుబ్యాంక్, ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలం: పార్టీలో ముఠా తగాదాలు, టిక్కెట్ల పంపిణీలో ఆశ్రీత పక్షపాతం, అధికారంలో లేకపోవడంతో చెల్లాచెదురైన శ్రేణులు బీజేపీ అనుకూలం: మోడీ ప్రభావం, వ్యవస్థీకృత పార్టీ నిర్మాణం, నిబద్ధులైన కార్యకర్తల బలం ప్రతికూలం: సమర్ధ నాయకత్వ లేమి, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకునే కార్యక్రమాలను చేపట్టకపోవడం అసెంబ్లీకి కూడా.. ఒడిశాలో లోక్‌సభతో పాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌కు ఇప్పటికే మూడుసార్లు అధికారం అప్పగించిన ఒడిశా ఓటర్లు ఈ సారి కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు. సీఎంగా నవీన్ పనితీరు, ఆయన వ్యక్తిత్వం, చేపట్టిన సంక్షేమ పథకాలు బీజేడీని ప్రజలకు దగ్గర చేశాయి. ఇటీవలి ఫైలీన్ తుపానును ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్న తీరు, చేపట్టిన సహాయక చర్యలు ఒడిశా తీరప్రాంత ప్రజలను ఆకట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ పూర్తి మెజారిటీ రానుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. ఓ సర్వేలో బీజేడీకి అసెంబ్లీ ఎన్నికల్లో 49% ఓట్లు వస్తాయని తేలింది. ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాలున్నాయి. వారసుల ‘రాచ’స్థాన్ రాజస్థాన్ నుంచి ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైతం రాచ కుటుంబాల వారసులు పోటీ చేస్తున్నారు. ‘రాచ’ వారసుల్లో కాంగ్రెస్ ముగ్గురిని, బీజేపీ ఒకరిని బరిలోకి దించాయి. కాంగ్రెస్ తరఫున జోధ్‌పూర్ నుంచి మహారాజా హన్వంత్ సింగ్ కుమార్తె, కేంద్ర మంత్రి చంద్రేశ్‌కుమారీ కతోచ్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి రాజపుత్ వర్గానికి చెందిన గజేంద్రసింగ్ షెకావత్‌ను బీజేపీ బరిలోకి దించింది. అల్వార్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కోటా నుంచి కోటా రాచ కుటుంబ వారసుడు ఇజెయరాజ్ సింగ్ కూడా కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి వసుంధరా రాజె తనయుడు, ధోల్పూర్ ‘రాచ’ వారసుడు దుష్యంత్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా ఝాలావర్-బరన్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ‘ఆప్’ కా క్రిమినల్! క్లీన్ పాలిటిక్స్ అంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి.. తన అభ్యర్థుల క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం కనిపించడం లేదు. క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న పలువురిని ఆప్ అభ్యర్థులుగా నిలిపింది. ఒడిశాలోని కొంధొమాల్ లోక్‌సభ స్థానం నుంచి ఆప్ తరఫున పోటీ చేస్తున్న నరేంద్ర మొహంతీపై 28 క్రిమినల్ కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో మూడు హత్య కేసులు, ఒక హత్యాయత్నం కేసు, ఒక హత్య+ దోపిడీ కేసు ఉన్నాయి. క్రిమినల్ కేసులకు సంబంధించి ఏప్రిల్ 10న ఒడిశాలో ఎన్నికలు జరగనున్న 10 లోక్‌సభ స్థానాల మొత్తం అభ్యర్థుల్లో ఆయనదే టాప్ ర్యాంక్. ఒడిశాలోని ఆప్ లోక్‌సభ అభ్యర్థుల్లో మొహంతీ కాకుండా మరో ఇద్దరిపై కూడా క్రిమినల్ కేసులున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఒకరిపై, బీజేపీ అభ్యర్థుల్లో నలుగురిపై కూడా కేసులున్నాయి. కాంగ్రెస్ నుంచి నామినేషన్... బీజేపీలో చేరిక మోడీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్న ఈయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కాదు.. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ నగర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఆల్రెడీ నామినేషన్ వేసిన అభ్యర్థి! పేరు రమేశ్ చంద్ తోమర్. ఈయన మార్చి 21నే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని బుధవారం రాత్రి కూడా చెప్పారు. తెల్లారేసరికే ఏమైందో ఏమో... గురువారం ఘజియాబాద్‌లో జరిగిన సభలో కాంగ్రెస్ చెవిలో కమలం పూవు పెట్టి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఓటేస్తే ‘దోడా పొస్తా’ రాజస్థాన్‌లోని బర్మేర్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నల్లమందుతో ఓట్లకు గాలం వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో నల్లమందు భాయిలు వేల సంఖ్యలోనే ఉన్నారు. స్థానికంగా ‘దోడా పొస్తా’ అని పిలుచుకునే నల్లమందు ముద్దను ఈ ప్రాంతంలో లెసైన్సులు గల దుకాణాల ద్వారా పర్మిట్లు ఉన్న వినియోగదారులకు కోటా పద్ధతిలో అమ్ముతుంటారు. నల్లమందు కోసం ఈ దుకాణాల వద్ద నిత్యం పొడవాటి క్యూలు కనిపిస్తుంటాయి. దీంతో ఈ ‘సమస్య’పై స్పం దించిన బీజేపీ అభ్యర్థి కల్నల్ సోనారామ్ చౌధరీ.. నల్లమందు సరఫరాను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా సీఎం వసుంధరను కోరడం విశేషం! ‘నోటా’కే మా ఓటు! దేశవ్యాప్తంగా దాదాపు అరకోటికి పైగా జనాభా గల సెక్స్‌వర్కర్లు ఈ ఎన్నికల్లో ‘నోటా’కు ఓటేయాలని భావిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు దాటినా ఏ రాజకీయ పార్టీ తమను పట్టించుకోలేదని, అలాంటప్పుడు ఏ పార్టీకి ఓటేస్తే ఏం లాభమని వారు ప్రశ్నిస్తున్నారు. సెక్స్ వర్కర్లను ఉద్ధరిస్తామంటూ రాజకీయ పార్టీలన్నీ హామీలు గుప్పిస్తున్నాయే తప్ప ఇప్పటి వరకు అవి తమకు ఒరగబెట్టిందేమీ లేదని ఆలిండియా నెట్వర్క్ ఫర్ సెక్స్ వర్కర్స్ (ఏఐఎన్ఎస్డబ్ల్యూ) అధ్యక్షురాలు భారతీ డే ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 80 శాతం మందికి పైగా సెక్స్‌వర్కర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ఆమె చెప్పారు. -
భువనేశ్వర్ చేరుకున్న వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నారు. భువనేశ్వర్ లోని విమానాశ్రయంలో వైఎస్ జగన్ కు స్థానిక తెలుగువారు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్‌తో ఆయన క్యాంప్ కార్యాలయంలో జగన్ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజభనపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ మద్దతు కూడగడుతున్నారు. అందులోభాగంగా బీజు జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయిక్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల రాష్ట్రానికి జరగుతున్న అన్యాయాన్ని జగన్ ఈ సందర్బంగా నవీన్ పట్నాయిక్‌కు వివరించనున్నారు. అంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏర్పడే నష్టాలను వైఎస్ జగన్ శనివారం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, శరద్ యాదవ్‌కు న్యూఢిల్లీలో విశదీకరించిన సంగతి తెలిసిందే.