బిజూ జనతాదళ్ జోరు | Orissa polls will see triangular battle of Congress, BJP and BJD | Sakshi
Sakshi News home page

బిజూ జనతాదళ్ జోరు

Published Fri, Apr 4 2014 1:41 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

బిజూ జనతాదళ్ జోరు - Sakshi

బిజూ జనతాదళ్ జోరు

బీజేడీకి ఉపకరించనున్న నవీన్ పట్నాయక్ క్లీన్ ఇమేజ్
సమర్ధ నాయకత్వ లేమితో కష్టాల్లో కాంగ్రెస్, బీజేపీలు
కేడర్‌పై నమ్మకంతో కాంగ్రెస్
మోడీ ప్రభావంపైనే బీజేపీ ఆశలు

 
వడ్డాణం సుదర్శన్, ఎలక్షన్ సెల్: ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఎల్లవేళలా అండగా నిలిచిన రాష్ట్రం ఒడిశా. ఆ పార్టీకి మద్దతుదారులు, సానుభూతిపరుల సంఖ్య ఇప్పటికీ తక్కువేం లేదు. అయితే, తండ్రి బిజూ పట్నాయక్ మరణానంతరం 17 ఏళ్ల క్రితం నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీ బిజూ జనతాదళ్(బీజేడీ) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. అనాసక్తితోనే రాజకీయం రంగప్రవేశం చేసిన నవీన్ పట్నాయక్.. 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీని విజయపథాన నిలిపారు.
 
 అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి ఒడిశాలో విజయవంతమైన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1998 నుంచి 2009 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు భాగస్వామిగా వ్యవహరించినప్పటికీ.. తన లౌకిక ముద్రను నిలుపుకోగలగడం నవీన్ ప్రత్యేకత. ఒడిశాలో ఖనిజ సంపదకు, ప్రకృతి వనరులకు కొదవలేదు. 2000 కన్నా ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనావైఫల్యం కారణంగా అదే స్థాయిలో అక్కడ పేదరికం కూడా తాండవించేది. ఆ పరిస్థితుల్లో పాలనాపగ్గాలు స్వీకరించిన నవీన్ పట్నాయక్ అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజాకర్షక పథకాలను సమస్థాయిలో అమలుపరుస్తూ విజయవంతమైన సీఎంగా  పేరు తెచ్చుకున్నారు.
 
అంతర్గత సర్వేలతో అంచనా
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో బీజేడీ తన ఆధిపత్యం కొనసాగించే అవకాశాలే అధికంగా ఉన్నాయి. తక్కువ ధరకు బియ్యం, విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు, గర్భిణులకు ఆర్థికసాయం.. తదితర పథకాలతో ప్రజాబాహుళ్యానికి నవీన్ పట్నాయక్ బాగా దగ్గరయ్యారు. కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్న పశ్చిమ ప్రాంతాల్లోనూ పట్టు సాధించగలిగారు.  పార్టీకి చెందిన ప్రస్తుత ప్రజాప్రతినిధులపై నియోజకవర్గాలవారీగా అంతర్గత సర్వేలు నిర్వహించారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వారికి టిక్కెట్లు ఇవ్వకూడదన్న ఆలోచనతో శాస్త్రీయ పద్ధతిలో ఆయన ఆ సర్వేలు నిర్వహించారు. మొత్తంమీద 15 నుంచి 17 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో నవీన్ పట్నాయక్ ఉన్నారు. అయితే, ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్ కుంభకోణం, దానికి సంబంధించి షా కమిషన్ పార్లమెంటుకు సమర్పించిన నివేదిక.. నవీన్ పాలనపై అవినీతి మరకలను మిగిల్చాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఆ ప్రభావం కూడా రానున్న ఎన్నికల్లో బీజేడీకి ప్రతికూలంగా పరిణమించవచ్చు.
 
కాంగ్రెస్, బీజేపీలు అంతంతే..
 బీజేడీ ఎన్నికల వ్యూహాలను అమల్లో పెడుతూ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమవుతుండగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అంతర్గత కుమ్ములాటలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నాయి. కాంగ్రెస్‌కు కొన్ని ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది. సంప్రదాయ ఓటుబ్యాంక్ మద్దతు ఉంది. అయితే, అంతర్గత రాజకీయాలు పార్టీని దెబ్బతీస్తు న్నాయి. మరోవైపు బీజేపీ మోడీ ప్రభావంపైనే నమ్మకం పెట్టుకుని ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల బలం ఉన్నప్పటికీ.. సమర్థమైన నాయకత్వ లోపం ఆ పార్టీని వేధిస్తోంది. 2004లో ఏడు స్థానాల్లో గెలిచి.. 2009లో బోణీ కొట్టని స్థాయికి పడిపోయిందంటేనే రాష్ట్రంలో బీజేపీ ప్రభావాన్ని అంచనా వేయొచ్చు. అయితే, ఈసారి మోడీ ప్రభావంతో కనీసం 4-6 స్థానాలు నెగ్గుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
 
 బీజేడీ
 అనుకూలం: నవీన్ పట్నాయక్ ఇమేజ్, సంక్షేమ పథకాలు, బలంగా లేని ప్రతిపక్షం
 ప్రతికూలం: మైనింగ్, చిట్‌ఫండ్ రంగాల్లో బయటపడ్డ స్కాంలు, ప్రభుత్వ వ్యతిరేకత
 కాంగ్రెస్
 అనుకూలం: గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఓటుబ్యాంక్, ప్రభుత్వ వ్యతిరేకత
 ప్రతికూలం: పార్టీలో ముఠా తగాదాలు, టిక్కెట్ల పంపిణీలో ఆశ్రీత పక్షపాతం, అధికారంలో లేకపోవడంతో చెల్లాచెదురైన శ్రేణులు
 బీజేపీ
 అనుకూలం: మోడీ ప్రభావం, వ్యవస్థీకృత పార్టీ నిర్మాణం, నిబద్ధులైన కార్యకర్తల బలం
 ప్రతికూలం: సమర్ధ నాయకత్వ లేమి, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకునే కార్యక్రమాలను చేపట్టకపోవడం
 
 అసెంబ్లీకి కూడా..
 ఒడిశాలో లోక్‌సభతో పాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌కు ఇప్పటికే మూడుసార్లు అధికారం అప్పగించిన ఒడిశా ఓటర్లు ఈ సారి కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు.  సీఎంగా నవీన్ పనితీరు, ఆయన వ్యక్తిత్వం, చేపట్టిన సంక్షేమ పథకాలు బీజేడీని ప్రజలకు దగ్గర చేశాయి. ఇటీవలి ఫైలీన్ తుపానును ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్న తీరు, చేపట్టిన సహాయక చర్యలు ఒడిశా తీరప్రాంత ప్రజలను ఆకట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ పూర్తి మెజారిటీ రానుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. ఓ సర్వేలో బీజేడీకి అసెంబ్లీ ఎన్నికల్లో 49% ఓట్లు వస్తాయని తేలింది. ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాలున్నాయి.
 
 వారసుల ‘రాచ’స్థాన్
రాజస్థాన్ నుంచి ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైతం రాచ కుటుంబాల వారసులు పోటీ చేస్తున్నారు. ‘రాచ’ వారసుల్లో కాంగ్రెస్ ముగ్గురిని, బీజేపీ ఒకరిని బరిలోకి దించాయి. కాంగ్రెస్ తరఫున జోధ్‌పూర్ నుంచి మహారాజా హన్వంత్ సింగ్ కుమార్తె, కేంద్ర మంత్రి చంద్రేశ్‌కుమారీ కతోచ్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి రాజపుత్ వర్గానికి చెందిన గజేంద్రసింగ్ షెకావత్‌ను బీజేపీ బరిలోకి దించింది. అల్వార్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కోటా నుంచి కోటా రాచ కుటుంబ వారసుడు ఇజెయరాజ్ సింగ్ కూడా కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి వసుంధరా రాజె తనయుడు, ధోల్‌పూర్ ‘రాచ’ వారసుడు దుష్యంత్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా ఝాలావర్-బరన్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
 
 ‘ఆప్’ కా క్రిమినల్!
 క్లీన్ పాలిటిక్స్ అంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి.. తన అభ్యర్థుల క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం కనిపించడం లేదు. క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న పలువురిని ఆప్ అభ్యర్థులుగా నిలిపింది. ఒడిశాలోని కొంధొమాల్ లోక్‌సభ స్థానం నుంచి ఆప్ తరఫున పోటీ చేస్తున్న నరేంద్ర మొహంతీపై 28 క్రిమినల్ కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో మూడు హత్య కేసులు, ఒక హత్యాయత్నం కేసు, ఒక హత్య+ దోపిడీ కేసు ఉన్నాయి. క్రిమినల్ కేసులకు సంబంధించి ఏప్రిల్ 10న ఒడిశాలో ఎన్నికలు జరగనున్న 10 లోక్‌సభ స్థానాల మొత్తం అభ్యర్థుల్లో ఆయనదే టాప్ ర్యాంక్.  ఒడిశాలోని ఆప్ లోక్‌సభ అభ్యర్థుల్లో మొహంతీ కాకుండా మరో ఇద్దరిపై కూడా క్రిమినల్ కేసులున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఒకరిపై, బీజేపీ అభ్యర్థుల్లో నలుగురిపై కూడా కేసులున్నాయి.
 
 కాంగ్రెస్ నుంచి నామినేషన్... బీజేపీలో చేరిక
 మోడీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్న ఈయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కాదు.. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ నగర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఆల్రెడీ నామినేషన్ వేసిన అభ్యర్థి! పేరు రమేశ్ చంద్ తోమర్.  ఈయన మార్చి 21నే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని బుధవారం రాత్రి కూడా చెప్పారు. తెల్లారేసరికే ఏమైందో ఏమో... గురువారం ఘజియాబాద్‌లో జరిగిన సభలో కాంగ్రెస్ చెవిలో  కమలం పూవు పెట్టి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
 
 ఓటేస్తే ‘దోడా పొస్తా’
 రాజస్థాన్‌లోని బర్మేర్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నల్లమందుతో ఓట్లకు గాలం వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో నల్లమందు భాయిలు వేల సంఖ్యలోనే ఉన్నారు. స్థానికంగా ‘దోడా పొస్తా’ అని పిలుచుకునే నల్లమందు ముద్దను ఈ ప్రాంతంలో లెసైన్సులు గల దుకాణాల ద్వారా పర్మిట్లు ఉన్న వినియోగదారులకు కోటా పద్ధతిలో అమ్ముతుంటారు. నల్లమందు కోసం ఈ దుకాణాల వద్ద నిత్యం పొడవాటి క్యూలు కనిపిస్తుంటాయి. దీంతో ఈ ‘సమస్య’పై స్పం దించిన బీజేపీ అభ్యర్థి కల్నల్ సోనారామ్ చౌధరీ.. నల్లమందు సరఫరాను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా సీఎం వసుంధరను కోరడం విశేషం!
 
 ‘నోటా’కే మా ఓటు!
 దేశవ్యాప్తంగా దాదాపు అరకోటికి పైగా జనాభా గల సెక్స్‌వర్కర్లు ఈ ఎన్నికల్లో ‘నోటా’కు ఓటేయాలని భావిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు దాటినా ఏ రాజకీయ పార్టీ తమను పట్టించుకోలేదని, అలాంటప్పుడు ఏ పార్టీకి ఓటేస్తే ఏం లాభమని వారు ప్రశ్నిస్తున్నారు. సెక్స్ వర్కర్లను ఉద్ధరిస్తామంటూ రాజకీయ పార్టీలన్నీ హామీలు గుప్పిస్తున్నాయే తప్ప ఇప్పటి వరకు అవి తమకు ఒరగబెట్టిందేమీ లేదని ఆలిండియా నెట్‌వర్క్ ఫర్ సెక్స్ వర్కర్స్ (ఏఐఎన్‌ఎస్‌డబ్ల్యూ) అధ్యక్షురాలు భారతీ డే ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 80 శాతం మందికి పైగా సెక్స్‌వర్కర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement