ఆచార్య ఇనాక్ ఇంట ‘పద్మ’ పరిమళం
Published Sun, Jan 26 2014 1:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్: సాహిత్యరంగంలో సమున్నత శిఖరాలు అధిరోహించిన మన జిల్లావాసి డాక్టర్ కొలకలూరి ఇనాక్‌ను పద్మశ్రీ అవార్డు వరించింది. చేబ్రోలు మండలం, వేజండ్ల గ్రామంలోని రామయ్య, విశ్రాంతమ్మ దంపతుల కుమారుడైన ఇనాక్ 1939, జులై ఒకటో తేదీన జన్మించారు. సామాజిక ఆవేదనే సాహిత్య సంవేదనగా భిన్నప్రక్రియల్లో తన సాహిత్య రచనలు కొనసాగించారు. ఇప్పటికి 72 గ్రంథాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.
ఊరబావి, సూర్యుడు తలెత్తాడు, కట్టడి, కొలుపులు, కాకి వంటి కథా సంపుటాలు ముని వాహనుడు, దిక్కులేనివాడు, ఇడిగో క్రీస్తు తదితర నాటికలను అందించారు. ఆది ఆంధ్రుడు, త్రిద్రవ పతాకం, చెప్పులు వంటి కవితా సంపుటులు ఆయన కలం నుంచి జాలువారాయి. నిబిడిత సిద్ధాంతం పేరిట ఆధునిక సాహిత్య విమర్శన సూత్రాన్ని ప్రతిపాదించారు. ఆయన గొప్ప సాహిత్య సేవ చేశారు. దళిత బహుజన చైతన్యంతో వెలువడిన ఆయన మొదటి తెలుగు కథా సంపుటిగా ఊరబావి గుర్తింపు పొందింది. ఇనాక్ సాహిత్యం పలు జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన సాహిత్యంలో గుంటూరు ప్రాంతీయ మాండలికం ప్రస్ఫుటంగా కనబడుతుంది.
ఆయన చెప్పినట్లుగానే ఇనాక్ క్రైస్తవుడుగా పుట్టి, హిందువుగా పెరిగి, భారతీయుడుగా జీవిస్తోన్న గొప్ప లౌకికవాది. గుంటూరులోని ఏసీ కళాశాలలో విద్యనభ్యసించి, అధ్యాపకునిగా, ఆచార్యునిగా, ఉపకులపతిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఏసీ కళాశాల అధ్యాపకులుగా, అనంతపురం శ్రీకృష్ణదేవరాయలు యూనివర్సిటీలో తెలుగు శాఖాధ్యక్షునిగా, తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన చేసిన సాహిత్య కృషికి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు. కులవాస్తవికత మీద రాసిన కథల ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. తెలుగు కథను దళితవాడ దృ క్పథం నుంచి సుసంపన్నం చేసిన ఇనాక్ తొలిసారి ప్రత్యామ్నాయ కథా సాహిత్యాన్ని ఆవిష్కరించారు.
పురస్కారాలు : తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, తెలుగుభారతి పురస్కారం, విశాలసాహితీ పురస్కారం, అజోవిభో జీవిత సాఫల్య పురస్కారం, ఈనెల 18న గుంటూరు నగరంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ స్ఫూర్తి ఫౌండేషన్ వంటివి ఎన్నో అందుకున్నారు. తన తల్లి, భార్య జ్ఞాపకార్థం ఏటేటా సాహిత్య పురస్కారాలు ఇస్తూ యువసాహితీ వేత్తలను ప్రోత్సహించారు. ఇనాక్ సాహిత్యంపై ఎందరో పరిశోధనలు చేశారు. అసంఖ్యాక వ్యాసాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి వెనిశెట్టి సింగారావు, జిల్లా అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ, ప్రముఖ సాహిత్యవేత్త పాపినేని శివశంకర్ తదితర సాహిత్య వేత్తలు ఇనాక్‌కు అభినందనలు తెలిపారు.
ఇలాగే రాస్తూ ఉండాలి
ఆచార్య ఇనాక్ విశిష్ట రచయిత. అరసానికి, నాకు హితులు సన్నిహితులు. ఆయన గురించి చెప్పాలంటే ఎంతో కష్టం. ఎందుకంటే చెంచాతో సముద్రాన్ని కొలవలేం. ఆయన నూరేళ్లు ఇలాగే రాస్తూ ఉండాలి.
-పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం రాష్ట్ర అధ్యక్షుడు
చాలా ఆనందపడ్డాను
చాలా ఆనంద పడుతున్నాను. ఉద్వేగంగాను, ఉత్సాహంగాను ఉన్నాను. నేను చేసిన సాహిత్య కృషి అందరి అభిమానంతో పెద్దలకు చేరింది. పద్మశ్రీ రావడానికి సహాయ సహకారాలు అందించిన పెద్దలకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-కొలకలూరి ఇనాక్
Advertisement
Advertisement