ఆయన కేవలం నాదస్వర విద్వాంసుడే కాదు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. మారుమూల జన్మించి, సంగీతాన్నే దైవంగా భావించి, చివరివరకు సంగీత ప్రపంచంలోనే జీవించా రాయన. ఎన్ని సత్కారాలు అందుకున్నా, సామాన్య జీవితాన్ని గడిపారు. ఆయనే ‘పద్మశ్రీ’ పురస్కారం వచ్చిన షేక్ హసన్ సాహెబ్. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గంపల గూడెం మండలం గోసవీడులో 1928 జనవరి 1న మీరా సాహెబ్, హసన్ బీ దంపతులకు చివరి సంతానంగా ఆయన జన్మించారు. ఎనిమిదవ ఏట నుంచే సంగీత సాధన ప్రారంభించారు. 14వ ఏటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జైలు పాలయ్యారు.ౖ జెలులో కూడా గీతాలాపన చేసేవారు. ఆయన స్వర మాధుర్యాన్ని అధికారులు మెచ్చుకొని జైలు నుంచి విడుదల చేశారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రముఖ సంగీత విద్వాంసుడు చిన మౌలా సాహెబ్ వద్ద వాద్య సంగీతాన్ని, ప్రముఖ గాయకుడు బాల మురళీకృష్ణ తండ్రి పట్టాభిరామయ్య వద్ద గాత్రం నేర్చుకున్నారు. 1950 నుండి 1996 వరకు భద్రాచలం రామాలయంలో ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారు. 1983లో తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ నాదస్వరం వినిపించారు. స్వయంగా విద్వాంసుడే కాక ఎంతోమందికి నాద స్వరంలో శిక్షణనిచ్చారు. హిందూ, ముస్లింల ఐక్యత కోసం కృషి చేశారు. రాముడు, అల్లా ఒక్కరేనని ఎప్పుడూ చెబుతుండేవారు. తీవ్ర అనారోగ్యంతో 2021 జూన్ 23న తిరువూరులో తుదిశ్వాస విడిచారు. కేంద్రప్రభుత్వం ఇటీవలే ఆయనకు మరణానంతరం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. మంచి మాటే ప్రతి మనిషికి ఆభరణమని, ఇచ్చిన మాట తప్పడం అంటే ఆ మనిషి మరణించడంతో సమానమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన ధన్యజీవి.
– యం. రాం ప్రదీప్, తిరువూరు
Comments
Please login to add a commentAdd a comment