
మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: సీనియర్ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పద్మశ్రీ అవార్డు వివాదం కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేయనని, సినిమా టైటిల్స్ లో తన పేరు ముందు పెట్టుకున్న పద్మశ్రీని తొలగిస్తానని ఆయన అఫిడవిట్ చేశారు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రదానం చేసిన పద్మశ్రీ అవార్డు కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్టైంది.
పద్మశ్రీ అవార్డును దుర్వినియోగ పరిచారంటూ మోహన్ బాబుపై హైకోర్టులో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన ప్రమేయం లేకుండానే 'దేనికైనా రెడీ' చిత్రంలో నిర్మాత పద్మశ్రీని వాడుకున్నాడని మోహన్ బాబు ఇచ్చిన వివరణను హైకోర్టు తోసిపుచ్చింది. ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును మోహన్ బాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గత ఏప్రిల్ లో హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసును కొట్టేసింది.