'అవార్డు తీసుకోనని అనలేదు'
రాంచి: కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తానని జార్ఖండ్ 'వాటర్ మేన్' సిమొన్ ఒరయన్ తెలిపారు. తనకు అవార్డు వచ్చినట్టు కేంద్రం నుంచి లేఖ లేదా వర్తమానం వస్తే తప్పకుండా తీసుకుంటానని చెప్పారు. తాను అవార్డు స్వీకరించబోనని ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. 'వాటర్ మేన్'గా సుపరిచితుడైన సిమొన్ ఒరయన్ కు పర్యావరణ పరిరక్షణ విభాగంలో పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు.
బెడో జిల్లాకు చెందిన 83 ఏళ్ల ఒరయన్ చిన్ననాటి నుంచే కరువుపై యుద్ధం చేస్తున్నారు. నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి పొలం బాట పట్టారు. నీటి సంరక్షణ కోసం చెట్లు నాటడడం, అడవులను పెంచడం చేశారు. ఇప్పటికీ ఏడాదికి 1000 మొక్కలు నాటతారు. ఆయన అనుమతి లేకుండా చెట్ల కొమ్మలు నరడానికి కూడా అక్కడివారు వెనుకాడతారు. ఆయన నాటిన మొక్కలతో బెడో ప్రాంతం అగ్రికల్చర్ హబ్ గా మారింది. దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు జార్ఖండ్ లోని వివిధ జిల్లాలతో పాటు బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.