పేదరాశి వైద్యమ్మ | No one should die because they are poor: Subhasini Mistry | Sakshi
Sakshi News home page

పేదరాశి వైద్యమ్మ

Published Thu, Feb 8 2018 12:05 AM | Last Updated on Sat, Feb 10 2018 3:12 PM

No one should die because they are poor: Subhasini Mistry - Sakshi

సుభాషిణీ మిస్త్రీ, ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు గ్రహీత  

చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది.
కూరగాయలు అమ్మి, కొడుకును డాక్టర్‌ని చేసింది. 
ఊళ్లోని పేదలకు ఉచితంగా వైద్యం చేయించింది.
ఊరి కోసం పెద్ద ఆసుపత్రినే కట్టించింది.
ఇప్పుడీ పేదరాశి ‘వైద్యమ్మ’ ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది!

కూరగాయలు అమ్మి ఆసుపత్రి కట్టించింది!
రాత్రీ పగలూ లేకుండా ఏ సమయంలో ఎవరు అనారోగ్యంతో వచ్చినా వెంటనే వారికి వైద్య సదుపాయం అందించే ఆసుపత్రి అది. మానవత్వానికి ఎప్పుడూ ద్వారాలు తెరిచి వుంచే ఆ వైద్యాలయం పశ్చిమ బెంగాల్‌లోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హన్స్‌పుకూర్‌ గ్రామంలో పాతికేళ్ల క్రితం వెదురు గుడిసెలో ప్రారంభమైంది. నాటి నుంచీ పేదలకు ఉచితంగా వైద్యసేవలు, సదుపాయాలు అందిస్తూ ఇప్పుడు ఒకటిన్నర ఎకరం స్థలంలో 45 పడకలతో కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా విస్తరించింది. ఈ ఆసుపత్రిలో పది ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు ఉండగా 17 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. రోజూ 300 మంది ఇక్కడ ఉచితంగా వైద్యం పొందుతున్నారు.  ‘హ్యుమానిటీ’ పేరుతో పేదలకు ఉదారంగా వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి నిర్వహణ వెనకాల ఓ వృద్ధురాలైన ఒక స్త్రీమూర్తి ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకనాడు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించిన ఆ మహిళ.. సుభాషిణీ మిస్త్రీ. ప్రస్తుతం 78 ఏళ్ల వయసున్న సుభాషిణిని పేదలకు అందిస్తున్న సేవలకు గాను భారతప్రభుత్వం ఈ యేడు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 

కళ్ల ముందే భర్త మరణం కొడుకుతో తీరిన రుణం
ఆసుపత్రి దగ్గరలో లేకపోవడం మూలాన సరైన వైద్యం అందక రోగులు దారి మధ్యలోనే ప్రాణాలు విడవడం సుభాషిణి మనసును కలిచివేసేది. అలాగే ఆమె భర్త సాధన్‌ చంద్ర మిస్త్రీ కూడా ఉదరకోశ సమస్యతో తగిన వైద్యం అందక తన కళ్ల ముందే ప్రాణాలు విడవడం ఆమె గుండెను ఛిద్రం చేసింది. భర్త అలా కన్ను మూస్తున్నప్పుడు నిస్సహాయంగా ఉండిపోయిన సుభాషిణి నాటి పరిస్థితులను తలుచుకుంటూ కంట తడి పెట్టుకున్నారు. ‘‘అప్పుడు నా వయసు 23 ఏళ్లు. నలుగురు చిన్న పిల్లలు. కూరగాయలు అమ్ముకుంటూ నా పిల్లలను పోషించుకున్నా. నా భర్తలా ఎవరూ వైద్యం అందక చనిపోకూడదని నిర్ణయించుకున్నాను. మా జీవనానికి పోను కొద్ది కొద్దిగా పొదుపు చేసేదాన్ని. ఆ డబ్బుతో నా పెద్ద కొడుకును డాక్టర్ని చదివించాను. నా కొడుకు డాక్టర్‌ అజయ్‌ మిస్త్రీ నా మాటపై ఉన్న ఊరిలోనే వైద్యం ప్రారంభించాడు. 

కూరగాయలు అమ్మే ఆ వెదురు గుడిసెలోనే రోగులను పరీక్షించేవాడు. ఆసుపత్రి అంటే సకల సదుపాయాలు ఉండాలి. అందుకు చాలా డబ్బు కావాలి. రేయింబవళ్లు ఒకటే ధ్యాస.. మంచి ఆసుపత్రి కట్టాలి. డబ్బులు కావాలి ఎలా అని. తెలిసిన డాక్టర్లతో మాట్లాడాను. అంతా లెక్క వేస్తే పేదలకు ఉచితంగా వైద్యం అందించాలంటే నెలకు కనీసం 16 లక్షల రూపాయలు కావాలని స్పష్టమైంది. నిధుల కోసం ఊరూ వాడా, పల్లె పట్నం అని తేడా లేకుండా అందరినీ కలుస్తూనే ఉన్నాను. ఇందుకు నా పిల్లల సాయం తీసుకున్నాను. ప్రకటనలు ఇచ్చాను. దక్షిణ భారతం నుంచి ఎక్కువ మంది దాతలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఏడాది ప్రయత్నం తర్వాత ప్రభుత్వం నుంచి సాయం అందడానికి అంగీకారం లభించింది. చెప్పలేనంత ఆనందం. ఆ క్షణం నుంచి దాతల నుంచి డబ్బు తీసుకోవడం ఆపేశాను. ఆసుపత్రి ప్రారంభమైంది. రోగుల ప్రాణాలు నిలబడ్డాయి’’ అని ఆసుపత్రి ఆవిర్భావ పరిస్థితులను, తను ఎదుర్కొన్న ఒత్తిడులను వివరించారు సుభాషిణీ మిస్త్రీ. 

ఆసుపత్రి పక్కనే ఓ కాలేజీ ద్వీపంలోనూ ఒక ఆసుపత్రి
ఆ తర్వాత ‘‘ఈ ఆసుపత్రికి దగ్గర్లోనే నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది’’ అని స్థానిక డాక్టర్లు సుభాషిణికి చెప్పారు. ఆమె అలాగే ఏర్పాటు చేసింది. ఓసారి.. సుందర్‌ బన్స్‌లోని సజ్జలీయా ద్వీపంలో సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే పడవ మీద రెండు గంటలు పడుతుందని, రోగులు నానా ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోందని సుభాషిణి దృష్టికి వచ్చింది. అక్కడా ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ఆమె నడక సాగించారు. 25 మంచాల ఆసుపత్రిని ఆ ఊళ్లో ఏర్పాటు చేశారు. ఇక్కడితో ఆమె ప్రయాణం ఆగిపోలేదు. ఝర్గామ్‌ జిల్లాలోని మానికపరాలో హెల్త్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు.‘‘సుభాషిణీ మిస్త్రీ వారంలో ఒక్కో రోజు ఒక్కో ఆసుపత్రిలో రోగులకు సరైన సేవలు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తుంటారు. అలాంటి మనిషి చాలా అరుదు’’ అని ఆమె గురించి తెలిసిన డాక్టర్‌ ఎ.పాల్‌ అంటారు. ఆసుపత్రుల నిర్వహణకే కాదు అనా«థ పిల్లలకు చక్కని భవిష్యత్తును ఇవ్వడానికి ఆశ్రమాల ఏర్పాటుకు ఈ వయసులోనూ ఆమె అడుగులు పరుగులు తీస్తూనే ఉన్నాయి. 
– ఎన్‌.ఆర్‌


కూరగాయలు అమ్ముతున్న సుభాషిణి (ఫైల్‌ ఫొటో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement