పేదింటి అమ్మ కట్టించిన పెద్ద ఆసుపత్రి!
స్ఫూర్తి
సుభాషిణీ మిస్త్రీ ఆసుపత్రి కట్టాలనుకున్నారు.
కాని మనసులో ఆరాటం తప్ప, చేతిలో కానీ లేదు.
అయితేనేం...గుండెలనిండా ఆత్మవిశ్వాసం ఉంది...
పేదలకు సేవ చేయాలన్న తపన ఉంది...
అహరహం శ్రమించింది... అందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహకారం తోడైంది... అందరి కృషి ఫలించింది...
‘హ్యూమానిటీ హాస్పిటల్’ పేరుతో ఆసుపత్రి వెలసింది.
ఎందరో పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తోంది.
సుభాషిణిలో చుట్టు పక్కల వారిని నవ్వించే హాస్యచతురత అంతగా ఏమీ లేదు. ఎప్పుడూ కాస్త గంభీరంగానే ఉంటుంది ఆవిడ. కానీ, ఆమె ఒక మాట అంటున్నప్పుడు మాత్రం...వినేవాళ్లు నవ్వినంత పని చేసేవారు. కొందరు వెటకారం కూడా చేసేవారు. అయినా ఆమె వాటికి పెద్దగా స్పందించేది కాదు. ఇంతకీ, కోల్‌కతాకు సమీపంలోని హన్సుపుకుర్ గ్రామానికి చెందిన సుభాషిణీ మిస్త్రీ ఏమనేవారు? ‘‘పేదవాళ్ల కోసం ఆసుపత్రి కడతాను. వాళ్లకు ఏ కష్టం లేకుండా ఉచితంగా వైద్యం చేయిస్తాను’’
పేదవాళ్లకు ఉచిత వైద్యసేవ చేయాలనుకున్న సుభాషిణి పెద్దింటావిడ ఏమీ కాదు. ఊళ్లో పలుకుబడి ఉన్న మహిళ అంతకంటే కాదు. ఆమె ఒక సాధారణమైన పేద మహిళ.
ఎర్రటి ఎండల్లో కూలీ పని చేసేది.
పెద్దవాళ్ల ఇంట్లో ఇంటి పని చేసేది.
వీధి వీధి తిరుగుతూ కూరగాయలు అమ్మేది. ఏ రోజుకు ఆరోజు అన్నట్లుగానే ఉండేది ఆమె ఆర్థిక పరిస్థితి. ఇంతకీ ఆమె ఆసుపత్రి ఎందుకు కట్టాలనుకున్నారు?
23 ఏళ్ల వయసులోనే సరియైన వైద్యసదుపాయాలు లేని స్థితిలో సుభాషిణి భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఎన్ని కష్టాలు పడిందో ఆ దేవుడికే తెలుసు. కడుపు నిండా తిన్న రోజుల కంటే పస్తులు ఉన్న రోజులే ఎక్కువ. భర్త మాత్రమే కాదు...ఆమె బంధువులలో కొద్దిమంది సరైన వైద్యం లేక చిన్నవయసులోనే చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఆసుపత్రి కట్టాలనేది ఆమె కల, ఆశయం. ఒక పేదరాలికి ఆసుపత్రి కట్టించేంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
ఎవరో సుభాషిణితో అన్నారట-
‘‘ఇదేమన్నా సినిమా అనుకున్నావా? జీవితం’’ అని. అలా అంటారు గానీ, నిజానికి చాలా సినిమాలకు జీవితమే ప్రేరణ. జీవితంలోని ఎగుడుదిగుళ్ల నుంచే ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి. సుభాషిణిది కూడా అలాంటి కథే. ఇప్పుడు మళ్లీ ఒకసారి వెనక్కి వెళదాం... సకాలంలో వైద్యం అందక, నిస్సహాయస్థితిలో తన భర్తలాగా ఇకముందు ఎవరూ చనిపోకూడదనుకుంది సుభాషిణీ. భవిష్యత్తు కలను దృష్టిలో పెట్టుకొని తనకు వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదువు చేయడం ప్రారంభించింది. కొన్నిసార్లయితే ఓవర్‌టైమ్ కూడా చేసేది. ఒక భూస్వామి కొంత భూమిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసి అతడిని కలిసింది. అతడి కాళ్ల మీద పడి తన ఆశయం గురించి చెప్పింది. తాను పొదుపు చేసిన డబ్బుతో మార్కెట్ రేటుతో పోల్చితే కాస్త తక్కువ ధరకే ఆ భూమిని కొన్నది.
‘‘తొలి విజయం సాధించాను’’ ఆమె తనలో తాను గర్వంగా అనుకుంది. ఇల్లలకగానే పండగ కాదు కదా! ఆ విషయం...ఆమెకు స్పష్టంగా తెలుసు. ‘పండగ’ వచ్చే రోజు కోసం మరింత ఎక్కువ కష్టపడాలనే విషయం కూడా తెలుసు. ఆసుపత్రి కోసం పైసా, పైసా కూడబెడుతున్న తనకు పిల్లల్ని చదివించడం కష్టమైపోతుందనే విషయం అర్థమై ముగ్గురు పిల్లలలో ఇద్దరిని అనాథాశ్రమంలో చేర్పించింది. ‘హవ్వా’ అనుకున్నారు చుట్టాలు పక్కాలు. ‘‘మీ ఆయన చనిపోవచ్చు. నువ్వు బతికే ఉన్నావు కదా! అలా పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించవచ్చా?’’ అన్నాడు ఒక సన్నిహిత బంధువు.
ఎవరేమన్నా ఆమె మౌనంగా ఉండేది. తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని వైద్యశాస్త్రం చదివించాలని కూడా ఆమె బలంగా అనుకునేది. అనుకున్నట్లే రెండో కొడుకు అజయ్ మెడిసిన్ చదివాడు. రెండో విజయం!
తన తల్లి కల నెరవేర్చడానికి తన వంతు పాత్ర పోషించాడు అజయ్. 1993లో గ్రామస్థుల సహకారంతో ఒకే ఒక్క గదిలో ‘హ్యూమానిటీ హాస్పిటల్’ పేరుతో చిన్నగా మొదలైంది ఆసుపత్రి. ప్రజలు తమకు తోచిన రీతిలో సహాయం అందించారు. కొందరు డబ్బు ఇచ్చారు. కొందరు తమ దగ్గర ఉన్న కలప ఇచ్చారు. కొందరు శ్రమదానం చేశారు. కొందరు ఏమీ ఇవ్వక పోయినా ధైర్యాన్ని మాత్రం ఇచ్చారు. మూడు సంవత్సరాల తరువాత శాశ్వత ఆసుపత్రి నిర్మాణానికి అప్పటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కె.వి.రఘునాథరెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో పేదలు ఈ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యచికిత్స పొందారు. పొందుతున్నారు.
‘‘చూడడానికి పొట్టిగా కనిపించే సుభాషిణి ఈ ఆసుపత్రి నిర్మాణంతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది’’ అంటారు గ్రామస్థులు. దేశవిదేశాల నుంచి ఎన్నో పురస్కారాలు సుభాషిణిని వరించాయి. అయితే ఇవేవీ కాదు... వైద్యసేవలు పొందిన తరువాత పేదరోగుల కళ్లలో కనిపించే సంతృప్తినే అతి పెద్ద పురస్కారంగా భావిస్తుంటుంది డెబ్బై సంవత్సరాల సుభాషిణీ మిస్త్రీ.
నేను చదువుకోలేదు. గడియారం చూసి టైమ్ చెప్పడం కూడా నాకు రాదు. అయినప్పటికీ ఏదో ఒకరోజు నా కోరిక నెరవేరుతుందనే నమ్మకం బలంగా ఉండేది.
- సుభాషిణి