బిజినేపల్లి(నాగర్‌కర్నూల్): మారుమూల పల్లె పాలేనికి ప్రపంచ పటంలో గొప్ప స్థానాన్ని కల్పించిన దివంగత తోటపల్లి సుబ్రమణ్యానికి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు కోరారు. ఆదివారం గ్రామంలో ఆయన జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. సుబ్బయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం దయానంద్ మాట్లాడుతూ విద్యా సంస్థలు, హాస్టళ్లను స్థాపించి ఎందరో నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు.
1963లోనే డిగ్రీ కళాశాలను స్థాపించి ఎందరికో ఉన్నత విద్యను అందించడమేగాక గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు సరస్వతమ్మ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని 60ఏళ్ల క్రితమే పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన స్థాపించిన విద్యాసంస్థల్లో చదువు నేర్చుకున్న ఎందరో విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాలతోపాటు దేశ, విదేశాల్లో ఉన్నారన్నారు. అనంతరం సుబ్బయ్య సేవల్ని గుర్తించి పాఠ్యాంశాల్లో ఆయన జీవిత చరిత్రను చేర్చాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సొప్పరి బాలస్వామి, అమరేందర్, పాండు, ఆంజనేయులు, ఉపాధ్యాయులు గోపాలస్వామి, లక్ష్మీనారాయణరెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఉమ, శ్రీలక్ష్మి, తుక్కాదేవి, మధు తదితరులు పాల్గొన్నారు.