Handloom Cluster
-
తేలియా రుమాల్... కియా కమాల్
సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకలోని చేనేత హ్యాండ్లూమ్ క్లస్టర్ పరిధిలో తయారయ్యే తేలియా రుమాల్ వస్త్రానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఇది దాదాపు పేటెంట్ హక్కుతో సమానం. ఈ నెల 10న చెన్నైలోని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కార్యాలయం ఆమోదం తెలపగా, ఈ విషయాన్ని జీఐ అధికారులు గురువారం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధనాకు ఫోన్ ద్వారా తెలిపారు. తేలియా రుమాల్ అనే వస్త్రం ప్రాచీన కళకు సంబంధించింది. ఈ వస్త్రాన్ని సహజ రంగులు, ముడిపదార్థాలతో తయారు చేస్తారు. వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది. పుట్టపాకలోని చేనేత కళాకారులు ఈ వస్త్రాన్ని అభివృద్ధి చేసి చీరలు, దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్ రూపాల్లో తయారు చేస్తున్నారు. 2017లో హ్యాండ్లూమ్ క్లస్టర్ పేరు మీద జీఐ కోసం దరఖాస్తు చేశారు. జీఐ అధికారులు పలుమార్లు ఇక్కడికి వచ్చి వస్త్రం తయారీని పరిశీలించారు. చివరికి పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యం గుర్తించి భౌగోళిక గుర్తింపు (జీఐ) ఇచ్చారు. ఇప్పుడు తేలియా రుమాల్ అనే వస్త్రం ఎక్కడ ఉన్నా, పుట్టపాకకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. జీఐ ఆధారంగా విదేశీయులు కూడా పుట్టపాకకు వచ్చే అవకాశం ఉంది. ఈ వస్త్రం తయారీ ద్వారానే పుట్టపాకలోని గజం గోవర్ధనా, గజం అంజయ్యతోపాటు ఎంతోమంది చేనేత కళాకారులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు పత్రాలు అందుకున్నారు. శ్రమకు గుర్తింపు వచ్చింది పుట్టపాక చేనేత కళాకారుల శ్రమకు జీఐతో గుర్తింపు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ పటంలో పుట్టపాకకు గుర్తింపు ఉంటుంది. మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. – గజం గోవర్ధనా, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
మంగళగిరిలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలి
-ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి: చేనేత రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మంగళగిరి పట్టణంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కోరారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు క్లస్టర్లలో ఒకటి ధర్మవరం, మరొకటి ఎమ్మిగనూరుకు కేటాయించగా మూడోది ఎక్కడ కేటాయించేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని సంబంధిత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం శోచనీయమన్నారు. గురువారం ఆర్కే ఫోన్లో మాట్లాడుతూ మంగళగిరిలో 15వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా మంగళగిరికి చేనేత క్లస్టర్‌ను కేటాయించి ఆ రంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ తాను మంత్రికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వున్న చోట మాత్రమే ప్రభుత్వం పనులు చేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వున్న చోట ప్రజలను విస్మరించడం సరికాదన్నారు. క్లస్టర్ ఏర్పాటు కోరుతూ తాను ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించాగా ఏర్పాటుకు హామీ ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఇప్పటికే పట్టణంలో చేనేత రంగంలోకి వచ్చేందుకు యువకులు వెనుకాడుతున్నారని, ఆ రంగాన్ని అభివృద్ధి పరచి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
దామోదర రాజనర్సింహను తప్పుబట్టిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తనకు సంబంధం లేని శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఇలా జోక్యం చేసుకునే అధికారం ఆయనకు లేదని తేల్చి చెప్పింది. ఉప ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాల మేరకు అధికారులు తీసుకున్న నిర్ణయం సరైందని కాదని పేర్కొంటూ సదరు నిర్ణయాన్ని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల రద్దు చేశారు. దామోదర్ ఆదేశించక ముందున్న పరిస్థితులనే కొనసాగించాలని తీర్పులో పేర్కొన్నారు. ఇదీ వివాదం.. సమీకృత చేనేత అభివృద్ధి పథకం కింద నేత క్లస్టర్లకు ఆర్థిక సాయం చేసి కార్మికులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద మెదక్ జిల్లాలోని జోగిపేట హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను ఎంపిక చేసింది. క్లస్టర్ వ్యవహారాలను పరిశీలించేందుకు కన్సార్టియంను ఏర్పాటు చేయాలని భావించి, ఈ అధికారాన్ని జిల్లా హ్యాండ్లూమ్ అసిస్టెంట్ డెరైక్టర్‌కు అప్పగించింది. దీంతో జోగిపేట హ్యాండ్లూమ్ క్లస్టర్‌కు 8 మంది సభ్యులు గల కన్సార్టియంను సంబంధిత అసిస్టెంట్ డెరైక్టర్ గత ఏడాదిలో ఏర్పాటు చేశారు. ఈ 8 మందిలో ఆరుగురు ఈ ఏడాది జనవరిలో రాజీనామాలు చేశారు. దీంతో అసిస్టెంట్ డెరైక్టర్ మరో నూతన కన్సార్టియంను పులగం శ్రీనివాస్ చైర్మన్‌గా 9 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. ఇక్కడే డిప్యూటీ సీఎం దామోదర్ జోక్యం చేసుకున్నారు. కన్సార్టియం ఏర్పాటైన నెలన్నర తర్వాత దీనిని రద్దు చేసి మరో కన్సార్టియంను ఏర్పాటు చేయాలంటూ సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఫలితంగా పులగం శ్రీనివాస్ కన్సార్టియం రద్దయి, చిట్యాల పెంటయ్య చైర్మన్‌గా 11 మంది సభ్యులతో కొత్త కన్సార్టియం ఏర్పాటైంది. దీనిని సవాలు చేస్తూ పులగం శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.