-ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)
మంగళగిరి: చేనేత రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మంగళగిరి పట్టణంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కోరారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు క్లస్టర్లలో ఒకటి ధర్మవరం, మరొకటి ఎమ్మిగనూరుకు కేటాయించగా మూడోది ఎక్కడ కేటాయించేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని సంబంధిత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం శోచనీయమన్నారు. గురువారం ఆర్కే ఫోన్‌లో మాట్లాడుతూ మంగళగిరిలో 15వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.
రాజకీయాలకు అతీతంగా మంగళగిరికి చేనేత క్లస్టర్‌ను కేటాయించి ఆ రంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ తాను మంత్రికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వున్న చోట మాత్రమే ప్రభుత్వం పనులు చేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వున్న చోట ప్రజలను విస్మరించడం సరికాదన్నారు. క్లస్టర్ ఏర్పాటు కోరుతూ తాను ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించాగా ఏర్పాటుకు హామీ ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఇప్పటికే పట్టణంలో చేనేత రంగంలోకి వచ్చేందుకు యువకులు వెనుకాడుతున్నారని, ఆ రంగాన్ని అభివృద్ధి పరచి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మంగళగిరిలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలి
Published Fri, Sep 26 2014 1:55 AM | Last Updated on Tue, Oct 30 2018 4:08 PM
Advertisement