
సాక్షి, అమరావతి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు.. తండ్రి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి వాటి నిర్మాణాలకి శ్రీకారం చుట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.
ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఉండకూడదని సీఎం జగన్ సంకల్పించారని.. అందుకే రాష్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల నెరవేరబోతోందన్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో 53 వేల మంది నిరుపేదలకి సీఎఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకి ఈ నెల 24 న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయబోతున్నారని వెల్లడించారు.
రాజధాని ప్రాంతంలో పేదలకి ఇళ్ల స్ధలాలు ఇవ్వకుండా టీడీపీ న్యాయస్ధానాలను ఆశ్రయించింది.. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి మాత్రం రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణాలకి శ్రీకారం చుడుతున్నారన్నారు. డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి రాజధానిలో పేదల సొంతిళ్ల గృహప్రవేశాలు జరగాలని భావిస్తున్నామన్నారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడనే కక్షతోనే పేదల ఇళ్ల నిర్మాణాలని టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment