దామోదర రాజనర్సింహను తప్పుబట్టిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తనకు సంబంధం లేని శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఇలా జోక్యం చేసుకునే అధికారం ఆయనకు లేదని తేల్చి చెప్పింది. ఉప ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాల మేరకు అధికారులు తీసుకున్న నిర్ణయం సరైందని కాదని పేర్కొంటూ సదరు నిర్ణయాన్ని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల రద్దు చేశారు. దామోదర్ ఆదేశించక ముందున్న పరిస్థితులనే కొనసాగించాలని తీర్పులో పేర్కొన్నారు.
ఇదీ వివాదం..
సమీకృత చేనేత అభివృద్ధి పథకం కింద నేత క్లస్టర్లకు ఆర్థిక సాయం చేసి కార్మికులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద మెదక్ జిల్లాలోని జోగిపేట హ్యాండ్‌లూమ్ క్లస్టర్‌ను ఎంపిక చేసింది. క్లస్టర్ వ్యవహారాలను పరిశీలించేందుకు కన్సార్టియంను ఏర్పాటు చేయాలని భావించి, ఈ అధికారాన్ని జిల్లా హ్యాండ్‌లూమ్ అసిస్టెంట్ డెరైక్టర్‌కు అప్పగించింది. దీంతో జోగిపేట హ్యాండ్‌లూమ్ క్లస్టర్‌కు 8 మంది సభ్యులు గల కన్సార్టియంను సంబంధిత అసిస్టెంట్ డెరైక్టర్ గత ఏడాదిలో ఏర్పాటు చేశారు.
ఈ 8 మందిలో ఆరుగురు ఈ ఏడాది జనవరిలో రాజీనామాలు చేశారు. దీంతో అసిస్టెంట్ డెరైక్టర్ మరో నూతన కన్సార్టియంను పులగం శ్రీనివాస్ చైర్మన్‌గా 9 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. ఇక్కడే డిప్యూటీ సీఎం దామోదర్ జోక్యం చేసుకున్నారు. కన్సార్టియం ఏర్పాటైన నెలన్నర తర్వాత దీనిని రద్దు చేసి మరో కన్సార్టియంను ఏర్పాటు చేయాలంటూ సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఫలితంగా పులగం శ్రీనివాస్ కన్సార్టియం రద్దయి, చిట్యాల పెంటయ్య చైర్మన్‌గా 11 మంది సభ్యులతో కొత్త కన్సార్టియం ఏర్పాటైంది. దీనిని సవాలు చేస్తూ పులగం శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.