
సాక్షి, అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని ప్రధాన దేవాలయాలను హిందూ ఓట్లకోసమే రాహుల్ సందర్శిస్తున్నారని ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఆలయాలను రాహుల్ గాంధీ సందర్శించడం వెనుక ఓట్లు.. సీట్లే ప్రధాన కారణమని ఆమె అన్నారు.
‘భగవంతుడి అద్భుతాలు చూడాలనుకునేవారికి.. ఇదే పెద్ద నిదర్శనం’ రాహుల్ గాంధీ సోమనాథ్ ఆలయాన్ని దర్శించడంపై ఇరానీ వ్యంగ్యంగా స్పందించారు. అంతేకాక రాహుల్ గాంధీ జంధ్యెం ధరించిన ఫొటోపైనా ఆమె వ్యంగ్య బాణాలు సంధించారు. హిందువుగా జీవించేవాడు.. ఆవును గౌరవిస్తాడు.. ఆవుని పూజిస్తాడు..అంతేకానీ గోహత్యలను సమర్థించరంటూ రాహుల్ గాంధీని ఉద్దేశిచి ఇరానీ వ్యాఖ్యానించారు.