
పాకిస్థాన్‌లో తొలిసారి హిందువుకు..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రి షాహిద్ ఖాకన్ అబ్బాసీ శుక్రవారం తన మంత్రిమండలిని ఏర్పాటుచేశారు. ఇటీవల ప్రధాని పదవి నుంచి దిగిపోయిన నవాజ్ షరీఫ్ అనుచరులు, మిత్రపక్షాలకు తన కేబినెట్‌లో పెద్దపీట చేశారు. అలాగే తొలిసారి ఓ హిందువుకు మంత్రిమండలిలో అవకాశం కల్పించారు. గడిచిన 20 ఏళ్లలో ఓ హిందువు పాకిస్థాన్ కేబినెట్‌లో చోటు సంపాదించడం ఇదే తొలిసారి.
పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ శుక్రవారం 47మంది కేబినెట్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో 28మంది ఫెడరల్ మంత్రులు, 19మంది సహాయమంత్రులు ఉన్నారు. హిందువు అయిన దర్శన్ లాల్ కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. పాకిస్థాన్‌లోని నాలుగు ప్రావిన్సులను సమన్వయం చేసే బాధ్యతను ఆయన తీసుకుంటారని పాక్ వర్గాలు తెలిపాయి. 65 ఏళ్ల దర్శన్ లాల్ సింధ్ ప్రావిన్స్ ఘోట్కి జిల్లాలోని మీర్‌పూర్ మథెలో పట్టణానికి చెందిన వారు. వృత్తిరీత్య డాక్టర్ అయిన ఆయన 2013లో పాక్ పార్లమెంటుకు పీఎంఎల్-ఎన్ టికెట్‌పై వరుసగా రెండోసారి గెలుపొందారు. మైనారిటీలకు రిజర్వు చేసిన సీటు నుంచి ఆయన పాక్ జాతీయ అసెసంబ్లీ (పార్లమెంటు)లో అడుగుపెట్టారు. 2018లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార పీఎంఎల్-ఎన్ విజయమే లక్ష్యంగా తన కేబినెట్‌ను ప్రధాని అబ్బాసీ ఏర్పాటుచేసుకున్నారు.