పైశాచిక వివాహం అంటే ఏంటో తెలుసా​? | Marriage Kinds And Importance Of Hindu Mythology In Telugu | Sakshi
Sakshi News home page

పైశాచిక వివాహం అంటే ఏంటో తెలుసా​?

Published Wed, Feb 24 2021 7:26 AM | Last Updated on Wed, Feb 24 2021 8:00 AM

Marriage Kinds And Importance Of Hindu Mythology In Telugu - Sakshi

బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని వివాహాన్ని ఎనిమిది విధాలుగా శాస్త్రాలు సూచిస్తున్నాయని గతవారంలోనే చెప్పుకున్నాం కదా... ఇప్పుడు ఆయా వివాహాల గురించి క్లుప్తంగా... 

► బ్రాహ్మం: బ్రాహ్మమనగా ధర్మబద్ధమైనది. ఈ పద్ధతి, ఎనిమిది రకాల వివాహాలలో శ్రేష్ఠమైనదని శాస్త్రకారుల నిర్ణయం. ఈ పద్ధతిలో, వధువు తండ్రి, యోగ్యుడు, గుణవంతుడు మరియు విద్యావంతుడైన వరుణ్ణి వెతికి, అతడినుండి ఎటువంటి కన్యాశుల్కం తీసుకోకుండా, తన కూతుర్నిచ్చి అనగా ‘కన్యాదానం‘ చేసి వేదమంత్రాలతో విధిపూర్వకంగా, దేవతలసాక్షిగా,  బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిపిస్తాడు. 

► దైవం: ఈ పద్ధతిలో, తనకు యాగం నిర్వహించిన ఋత్విక్కుకు, వధువు తండ్రి, యాగ దక్షిణలో భాగంగా తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. దీనిని కొందరు స్మతికారులు విమర్శించారు, మరికొందరు సమర్థించారు. ఈ విధానంలో వర్ణంతో నిమిత్తంలేకుండా వివాహాలు జరిగేవి. అంటే ఋత్విక్కులు యాగదక్షిణగా రాజులనుండి కూడా కన్యలను గ్రహించేవారు. ఈ విధానంలో జరిగే వివాహంలో పెండ్లికుమార్తెను ‘వధువు‘ అనేవారు. ప్రస్తుతం ఈ పద్ధతి పాటించుటలేదు. 

► ఆర్షం: ఈ విధానంలో, కన్య తండ్రి, వరుడినుండి యజ‘ నిమిత్తమై రెండు గోవులను తీసుకుని తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఈ గోవులను కట్నంగా భావించరాదు. ఇది కేవలం యాగధర్మంకోసమే. కానీ దీనినికూడా కొందరు స్మతికర్తలు విమర్శించారు. యాగార్థం తీసుకున్నా అది కట్నమే అని దీనిని తిరస్కరించారు. 

► ప్రాజాపత్యం: ఈ పద్ధతిలో, కన్య తండ్రి గుణవంతుడైన ఒక వరుణ్ణి నిర్ణయించి, తన కుమార్తెను వివాహమాడవలసిందిగా అతణ్ణి ప్రార్థించి, అంగీకరించిన తర్వాత, తన కుమార్తెనిచ్చి వివాహంచేస్తాడు. ఈ వివాహం ఏకపత్నీవ్రతులకు మాత్రమే విహితం. ఎందుకంటే, ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే, మరో స్త్రీని వివాహం చేసుకోకూడదు.  గృహస్థుగానే జీవించాలి.

► ఆసురం: ఈ పద్ధతిలో, తాను ఇష్టపడిన కన్యని వివాహమాడడానికిగాను, ఆ కన్య తండ్రికి కొంత ధనమిచ్చి ఆ తర్వాత ఆమెను వివాహమాడతాడు. ఇది అధమమైనదని దీనిని శాస్త్రకారులు తిరస్కరించారు. అలా ధనమిచ్చి కొనుక్కున్న కన్య దాసియే అవుతుందికానీ ధర్మపత్ని కాజాలదు. కనుక ధర్మకార్యాలలో తనకు ప్రవేశం నిషిద్ధం. 

► గాంధర్వం: స్త్రీపురుషులిద్దరూ ప్రేమించుకున్నప్పుడు, లేదా మోహవశులై ఒకరిని విడిచి ఒకరు వుండలేని పరిస్థితులలో, ఎవ్వరి అనుమతులూ తీసుకోకుండా స్వతంత్రించి చేసుకునే వివాహమే గాంధర్వం. 

► రాక్షసం: కన్యను బలవంతంగా అంటే, ఆ కన్యకు ఆ వరునిపై ఇష్టంలేకపొయినా, అవసరమైతే ఆ కన్య తండ్రినికానీ, బంధువులనుకానీ చంపి అయినాసరే వివాహం చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు. 

► పైశాచం: కన్యను మోసగించి, లేక నిద్రించుచుండాగా, లేక స్పహలో లేకుండగా, తీసుకెళ్ళి లేక బలవంతంగా తీసుకెళ్ళి వివాహమాడడాన్ని పైశాచం అంటారు. ఇది భరతఖండంలో పశ్చిమోత్తరప్రాంతంలో (అనగా ప్రస్తుత పాకిస్తాన్‌) కొందరు పిశాచజాతులు వుండేవని, వారిలో ఈ ఆచారం వుండేదని అందుకే దీనికి పైశాచమని పేరువచ్చిందని చరిత్రకారుల నిర్ణయం.

– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement