టీ కొట్టు యజమాని తర్సెమ్ లాల్ శర్మ
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రపంచ శక్తుల ముందు లొంగని వ్యక్తి, ఆర్థిక సాయం కోసం వారి ముందు చేతులు చాచని వ్యక్తినే నేను ప్రధాన మంత్రిగా కోరుకుంటున్నాను. బలహీనులు ప్రధాని కావడానికి వీల్లేదు. ప్రపంచ శక్తుల ముందు బలంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడే వ్యక్తి కావాలి. స్థానికంగా ఎవరు నిలబడుతున్నారో, గతంలో ఆయన ఏం చేశారో నాకు తెలియదు. ప్రధాన మంత్రిగా మాత్రం బలమైన వ్యక్తిని కోరుకుంటున్నాను’ అని వినియోగదారులకు వేడి వేడి టీని సరఫరా చేస్తున్న ఓ చిన్న టీకొట్టు యజమాని తర్సెమ్ లాల్ శర్మ (42) వ్యాఖ్యానించారు. ఆయన ఇచ్చిన టీ తాగుతున్న వినియోగదారులు అవునన్నట్టుగా తలలు ఊపారు. జమ్మూలోని రఘునాథ్ బజార్‌లో మీడియాకు కనిపించిన దశ్యం ఇది.
దేశప్రధానిగా లాల్ శర్మ ఎవరిని ప్రధానిగా కోరుకుంటున్నారో వేరుగా చెప్పక్కర్లేదు. అర్థం అవుతుంది. లాల్ శర్మ పక్కనే ఉన్న అఖ్కూర్ పట్టణానికి చెందిన వ్యక్తి. ఆ పట్టణం పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉండడం వల్ల అక్కడ పాక్ వైపు నుంచి తరచుగా కాల్పులు జరగడం సాధారణం. జమ్మూ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో జమ్మూ, సాంబ, పూంచ్, రాజౌరి అనే నాలుగు జిల్లాలు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం జనాభాలో 65 శాతం మంది ముస్లింలు ఉండగా, 30 శాతం మంది ముస్లింలు ఉన్నారు. జమ్మూ, సాంబలో హిందువులు ఎక్కువగా మిగతా రెండు జిల్లాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు వర్గాల ప్రజలు విడిపోయే బతుకుతున్నారు. 2014 ఎన్నికల్లో హిందువులంతా ఐక్యం కావడంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
2008లో కశ్మీర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని అమర్‌నాథ్ ఆలయం బోర్డుకు అప్పగించడంతో అక్కడ హిందూ, ముస్లింల మధ్య వైషమ్యాలు పెరిగాయి. ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. వారి ఆందోళనలు వెంటనే వారికి కలిసి రాలేదు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్‌లాల్ శర్మ విజయం సాధించారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలోని రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో జమ్మూ నుంచి మదన్‌లాల్ శర్మపై బీజేపీ అభ్యర్థి జుగల్ కిషోర్ ఏకంగా రెండున్నర లక్షల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలో 37 సీట్లకుగాను 25 సీట్లను బీజేపీ గెలుచుకుంది. తద్వారా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి తొలిసారిగా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
ఈసారి జమ్మూ నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ జుగల్ కిషోర్ పోటీ చేస్తుండగా, ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యుడు రామన్‌భల్లా పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర మంత్రి చౌదరిలాల్ సింగ్ త్రిముఖ పోటీలోకి దిగారు. పాకిస్థాన్ వైపు నుంచి తరచుగా కాల్పులు జరుగుతుండడం, వాటి నుంచి సరైన భద్రత లేకపోవడంతోపాటు ఇక్కడ ఎక్కువగా ఉన్న డోగ్రా జాతి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం పట్ల ఇక్కడ హిందువులంతా ఏకమయ్యారు. బీజేపీ ప్రభుత్వం కూడా డోగ్రా కమ్యూనిటీని పట్టించుకోకపోవడంతో వారికి బీజేపీ పట్ల కూడా కోపం పెరిగింది. పుల్వామా ఉగ్ర ఆత్మాహుతి దాడితో మళ్లీ డోగ్రా కమ్యూనిటీ బీజేపీవైపే మొగ్గు చూపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment