న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడుల తగ్గుదల, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ‘‘హిందూ వృద్ధి రేటుకు ప్రమాదకర స్థాయిలో చాలా దగ్గరగా’’ ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. సీక్వెన్షియల్‌గా త్రైమాసికాలవారీ వృద్ధి నెమ్మదిస్తుండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1950ల నుంచి 1980ల దాకా అత్యంత తక్కువ స్థాయిలో నమోదైన వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా వ్యవహరిస్తారు.
ఇది సగటున 4 శాతంగా ఉండేది. 1978లో భారతీయ ఆర్థికవేత్త రాజ్ కృష్ణ ఉపయోగించిన ఈ పదం ఆ తర్వాత నుంచి అత్యంత నెమ్మదైన వృద్ధి రేటుకు పర్యాయపదంగా మారింది. జాతీయ గణాంకాల కార్యాలయం గత నెల విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 13.2 శాతంగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, రెండో క్వార్టర్‌లో 6.3 శాతానికి, తర్వాత మూడో త్రైమాసికంలో 4.4 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘‘గత జీడీపీ గణాంకాలను తిరిగి ఎగువముఖంగా సవరించే అవకాశం ఉందని ఆశావహులు ఆశిస్తుండవచ్చు. కానీ సీక్వెన్షియల్ మందగమనం ఆందోళనకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడటం లేదు .. ఆర్‌బీఐ ఇప్పటికీ వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది .. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి మందగించే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు వృద్ధికి అవసరమైన తోడ్పాటు ఎక్కణ్నుంచి లభిస్తుందన్నది తెలియడం లేదు’’ అని రాజన్ పేర్కొన్నారు.
తన ఆందోళనకు బలమైన కారణాలే ఉన్నాయని ఆయన చెప్పారు. నాలుగో త్రైమాసికంలో వృద్ధి మరింత నెమ్మదించి 4.2 శాతానికే పరిమితం కావచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక వృద్ధి రేటు దాదాపు మూడేళ్ల క్రితం నాటి కరోనా పూర్వపు 3.7 శాతం స్థాయికి దగ్గర్లో నమోదైందని పేర్కొన్నారు. ‘‘హిందూ వృద్ధి రేటుకు ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో, అత్యంత దగ్గరగా ఉంది!! మనం ఇంకా మెరుగ్గా వృద్ధి సాధించాలి’’ అని ఆయన చెప్పారు.
ఆశావహంగా సర్వీసులు..
ప్రభుత్వం తన వంతుగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోందని రాజన్ చెప్పారు. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వీసుల రంగం ఆశావహంగా కనిపిస్తోందని రాజన్ చెప్పారు. చాలా మటుకు సంపన్న దేశాలు సేవల ఆధారితమైనవే ఉంటున్నాయని.. భారీ ఎకానమీగా ఎదగాలంటే తయారీపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
సర్వీసులతో .. నిర్మాణ, రవాణా, టూరిజం, రిటైల్, ఆతిథ్యం తదితర రంగాల్లో ఒక మోస్తరు నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాలను భారీగా కల్పించేందుకు వీలవుతుందని రాజన్ తెలిపారు. అదానీ గ్రూప్–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదంపై స్పందిస్తూ ప్రైవేట్ కంపెనీలపై నిఘాను తీవ్రంగా పెంచాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుందని తాను భావించడం లేదన్నారు. తమ పని తాము చేసేలా నియంత్రణ సంస్థలను ప్రోత్సహిస్తూనే అటు వ్యాపార సంస్థలు .. ప్రభుత్వాల మధ్య లోపాయికారీ సంబంధాలను తగ్గించుకుంటే ఇలాంటివి తలెత్తడం తగ్గుతుందని ఆయన చెప్పారు. ఖాతాల్లో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment