former RBI governor Raghuram Rajan
-
ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ ఫెయిల్యూర్ పథకం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే భారతదేశంలో పెరుగుతున్న మొబైల్ ఫోన్ ఎగుమతులపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా రాజన్ పీఎల్ఐ పథకంలోని లొసుగులను ఎత్తి చూపిన సంగతి గమనార్హం. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?) దీనికి సంబంధించి ‘ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా?’ అనే పేరుతో వెల్లడైన పరిశోధనా నోట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ్ రాజన్ షేర్ చేశారు. దేశంలో నిజమైన తయారీ కంటే దిగుమతి అయిన విడిభాగాల అసెబ్లింగ్ ద్వారా వృద్ధి సాగుతోందని విమర్శించారు. మొబైల్ ఫోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతూ దేశీ తయారీ ఉత్పత్తులకు సబ్సిడీ ఇస్తు న్న ఈ స్కీమ్ సమర్థతను ప్రశ్నించారు. భారతదేశంలో ఫోన్‌ను పూర్తి చేయడానికి మాత్రమే సబ్సిడీ ఇస్తోంది తప్ప, భారతదేశంలో తయారీ విలువ జోడింపునకు కాదనీ, ఇదే ఈ పథకంలోని ప్రధాన లోపమన్నారు. (Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! జూన్ 1 తర్వాత పెరగనున్న ధరలు) భారతదేశంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో మొత్తం మొబైల్ ఫోన్ దిగుమతిపై సుంకాలను పెంచింది. అలాగే 2020లో మొబైల్ ఫోన్ల స్థానిక ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం పీఏల్‌ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. 4 శాతం నుండి 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ ప్రోత్సాహకం ఐదేళ్లపాటు వర్తిస్తుంది.దేశంలో తయారీ సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పన ఉద్దేశ్యంగా వివిధ రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల పీఎల్ఐ స్కీమ్‌లను కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ స్కీమ్‌ల అమలుతీరును వివరిస్తూ రాజన్‌తో పాటు మరో ఇరువురు ఆర్థికవేత్తలు రాహుల్ చౌహాన్, రోహిత్ లంబాలు ఈ రీసెర్చ్ నోట్‌ను రూపొందించారు. భారతదేశం నిజంగా మొబైల్ తయారీ దిగ్గజం కాలేదని వీరు వాదించారు. చౌహాన్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లోని ఫామా-మిల్లర్ సెంటర్లో పరిశోధనా నిపుణుడు, లాంబా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. (IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ ఎవరిదో తెలుసా?) పీఎల్ఐ స్కీంతో పెరిగిన ఎగుమతులు సీఈఏ ప్రకటన ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) గత నెలలో భారతదేశంలో మొబైల్ ఫోన్ ఎగుమతులను ప్రకటించింది. 2022లోని నమోదైన 45,000 కోట్ల నుండి 2023లో 90,000 కోట్లను అధిగమించాయని తెలిపింది. దీనికి పీఎల్ఐ స్కీం ప్రధానమని ప్రకటించింది. కాగా గతంలోనే పథకంలోని లొసుగులను ఎత్తి చూపిన రాజన్ స్మార్ట్ఫోన్ల, ఉత్పత్తి ధరలపై కొన్ని ఉదాహరణలుకూడా ఇచ్చారు. ఏప్రిల్ 2018లో మొబైల్ దిగుమతులపై కస్టమ్ సుంకాలు 20 శాతంగా పెంచారనీ, ఇది తక్షణమే దేశీయ ధరలపెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు. తయారీదారులు ఇండియన్ కస్టమర్లపైనే భారాన్ని మోపు తారని కూడా చెప్పారు. ఉదాహరణకు, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ అమెరికాలో చికాగోలో పన్నులతో సహా రూ. 92,500లోపు అందుబాటులో ఉంటే ఇదే ఫోన్ ఇండియాలో దాదాపు 40 శాతం పెరిగి రూ.1,29,000గా ఉంటుందని లెక్కలు చెప్పిన సంగతి తెలిసిందే. -
హిందూ వృద్ధి రేటుకు దగ్గర్లో భారత్
న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడుల తగ్గుదల, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ‘‘హిందూ వృద్ధి రేటుకు ప్రమాదకర స్థాయిలో చాలా దగ్గరగా’’ ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. సీక్వెన్షియల్‌గా త్రైమాసికాలవారీ వృద్ధి నెమ్మదిస్తుండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1950ల నుంచి 1980ల దాకా అత్యంత తక్కువ స్థాయిలో నమోదైన వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా వ్యవహరిస్తారు. ఇది సగటున 4 శాతంగా ఉండేది. 1978లో భారతీయ ఆర్థికవేత్త రాజ్ కృష్ణ ఉపయోగించిన ఈ పదం ఆ తర్వాత నుంచి అత్యంత నెమ్మదైన వృద్ధి రేటుకు పర్యాయపదంగా మారింది. జాతీయ గణాంకాల కార్యాలయం గత నెల విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 13.2 శాతంగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, రెండో క్వార్టర్లో 6.3 శాతానికి, తర్వాత మూడో త్రైమాసికంలో 4.4 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘గత జీడీపీ గణాంకాలను తిరిగి ఎగువముఖంగా సవరించే అవకాశం ఉందని ఆశావహులు ఆశిస్తుండవచ్చు. కానీ సీక్వెన్షియల్ మందగమనం ఆందోళనకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడటం లేదు .. ఆర్బీఐ ఇప్పటికీ వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది .. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి మందగించే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు వృద్ధికి అవసరమైన తోడ్పాటు ఎక్కణ్నుంచి లభిస్తుందన్నది తెలియడం లేదు’’ అని రాజన్ పేర్కొన్నారు. తన ఆందోళనకు బలమైన కారణాలే ఉన్నాయని ఆయన చెప్పారు. నాలుగో త్రైమాసికంలో వృద్ధి మరింత నెమ్మదించి 4.2 శాతానికే పరిమితం కావచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక వృద్ధి రేటు దాదాపు మూడేళ్ల క్రితం నాటి కరోనా పూర్వపు 3.7 శాతం స్థాయికి దగ్గర్లో నమోదైందని పేర్కొన్నారు. ‘‘హిందూ వృద్ధి రేటుకు ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో, అత్యంత దగ్గరగా ఉంది!! మనం ఇంకా మెరుగ్గా వృద్ధి సాధించాలి’’ అని ఆయన చెప్పారు. ఆశావహంగా సర్వీసులు.. ప్రభుత్వం తన వంతుగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోందని రాజన్ చెప్పారు. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వీసుల రంగం ఆశావహంగా కనిపిస్తోందని రాజన్ చెప్పారు. చాలా మటుకు సంపన్న దేశాలు సేవల ఆధారితమైనవే ఉంటున్నాయని.. భారీ ఎకానమీగా ఎదగాలంటే తయారీపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సర్వీసులతో .. నిర్మాణ, రవాణా, టూరిజం, రిటైల్, ఆతిథ్యం తదితర రంగాల్లో ఒక మోస్తరు నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాలను భారీగా కల్పించేందుకు వీలవుతుందని రాజన్ తెలిపారు. అదానీ గ్రూప్–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదంపై స్పందిస్తూ ప్రైవేట్ కంపెనీలపై నిఘాను తీవ్రంగా పెంచాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుందని తాను భావించడం లేదన్నారు. తమ పని తాము చేసేలా నియంత్రణ సంస్థలను ప్రోత్సహిస్తూనే అటు వ్యాపార సంస్థలు .. ప్రభుత్వాల మధ్య లోపాయికారీ సంబంధాలను తగ్గించుకుంటే ఇలాంటివి తలెత్తడం తగ్గుతుందని ఆయన చెప్పారు. ఖాతాల్లో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దు వద్దని అప్పుడే చెప్పా...
♦ ప్రత్యామ్నాయాలనూ వివరించా.. ♦ ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) వల్ల స్వల్ప కాలంలో ఎదురయ్యే ఖర్చులు దీర్ఘకాలంలో వచ్చే ప్రయోజనాలకంటే ఎక్కువగా ఉంటాయని తాను కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనే హెచ్చరించినట్టు రఘురామ్ రాజన్ తెలిపారు. ‘‘నా హయాంలో ఏ సందర్భంలోనూ డీమోనిటైజేషన్‌పై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం కోరలేదు. డీమోనిటైజేషన్‌పై 2016 ఫిబ్రవరిలోనే ప్రభుత్వం నా అభిప్రాయాలను అడిగింది. దీంతో నేను మౌఖిక రూపంలో తెలియజేశాను. ప్రభుత్వ తన లక్ష్యాలను చేరుకునేందుకు డీమోనిటైజేషన్‌కు ప్రత్యామ్నాయాల గురించి కూడా వివరించాను’’ అని రాజన్ స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం ఓ నివేదిక కోరగా ఆర్బీఐ రూపొందించి సమర్పించిందని, ఇందులో తన పాత్ర లేదని, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్(కరెన్సీ ఇన్చార్జ్) ప్రాతి నిధ్యం వహించినట్టు తెలిపారు. ‘‘ఐ డు వాట్ ఐ డు: ఆన్ రీఫార్మ్స్, రెటోరిక్ అండ్ రీసాల్వ్’’ పేరుతో రాసిన పుస్తకంలో రాజన్ ఈ విషయాలను ప్రస్తావిం చారు. ఈ పుస్తకం వచ్చే వారం విడుదల కానుంది. ‘‘డీమోనిటైజేషన్‌కు సంబంధించి భారీ వ్యయాలు ఒక అంశం. జీడీపీ తగ్గుముఖం పట్డడం మరొకటి. ఈ ప్రభావం జీడీపీలో 1–2%గా (దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు)అంచనాలు చెబుతున్నాయి. ప్రజలు బ్యాంకుల ముందు వెచ్చించిన సమయం, ఆర్బీఐ నోట్ల ముద్రణకు అయిన రూ.8,000 కోట్లు, నగదును వెనక్కి తీసుకునేందుకు బ్యాంకులకు అయిన వ్యయం, ఉద్యోగులు వెచ్చించిన సమయం, బ్యాంకుల్లోకి వచ్చిన డిపాజిట్లపై వడ్డీ చెల్లింపులు ఇవన్నీ చూడాలి. 99% నగదు డిపాజిట్ అయినందున ప్రభుత్వ లక్ష్యం నెరవేరనట్టే. అయితే ప్రభుత్వం ఈ డిపాజిట్లపై దర్యాప్తు చేయించగలిగితే కొన్ని నల్లధనంగా బయటపడొచ్చు. ఇందుకు ఎంతో కృషి కావాలి. డీమోనిటైజేషన్ వల్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు పెరిగిపోయాయి. ఇది ఆర్థికవ్యవస్థకు మేలే. మరో అంశం పన్ను ఆదాయం పెరగడం. ఇది రూ.10,000 కోట్లుగా ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే, ఇది డీమోనిటైజేషన్ వల్లనా లేక సహజంగా పెరిగిందా అన్నది స్పష్టత లేదు. డీమోనిటైజేషన్ ఉద్దేశం మంచిదే. కానీ ఆర్థికంగా ఇది విజయం సాధించిందని ఇప్పుడు ఎవరూ చెప్పలేరు. కాలమే సమాధానం చెబుతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. బ్యాంకుల ప్రక్షాళనకు ముందు నుంచే వృద్ధి క్షీణత ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఖాతాల్లోని మొండి బకాయిలను(ఎన్పీఏ) ప్రక్షాళించే చర్యలు చేపట్టడం కారణం కాదని రాజన్ పేర్కొన్నారు. వృద్ధి క్షీణత అన్నది బ్యాంకు ఖాతాల ప్రక్షాళనకు ముందు నుంచే మొదలైందని స్పష్టం చేశారు. ‘‘మొండి బకాయిల ప్రక్షాళన చర్యల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల రుణాల వృద్ధి తగ్గుముఖం పట్టిందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, వీరు గణాంకాలను ఓ సారి పరిశీలించాలి. బ్యాంకు ఖాతాల ప్రక్షాళన చేపట్టడానికి ముందు నుంచే వృద్ధి తగ్గుముఖం మొదలైందని తెలుస్తుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ఎన్పీఏల విషయంలో తగిన పరిష్కారానికి ఆర్బీఐ పదే పదే ప్రయత్నాలు చేసినప్పటికీ బ్యాంకుల నుంచి వచ్చిన స్పందన తక్కువగానే ఉన్నట్టు రాజన్ వెల్లడించారు. ‘‘బ్యాంకులు సమస్యలను గుర్తించేందుకు విముఖంగా ఉన్నాయని గమనించాం. దీంతో ఖాతాల ప్రక్షాళనకు వాటిపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాం. ఆస్తుల నాణ్యత సమీక్ష కార్యక్రమం 2015లో ప్రారంభం అయింది. భారత్‌లో ఈ తరహా అతిపెద్ద కార్యక్రమం ఇదే’’ అని రాజన్ తన పుస్తకంలో వివరించారు.