‘‘నేను హిందువుని అని చెప్పుకోవడానికి గర్వపడతాను’’ అని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించారు. ఎంత ఎదిగినా తన మూలాలను ఆయన ఎన్నడూ మరచిపోలేదు. రిషి బ్రిటన్‌లో పుట్టి పెరిగినప్పటికీ చిన్నప్పట్నుంచి భారత సంస్కృతి సంప్రదాయలను వంటపట్టించుకున్నారు. తరచూ దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. సోమవారం ఉపవాసం చేస్తారు. గోమాంసం ముట్టరు. యూకే రాజకీయాల్లో హిందువునని చెప్పుకునే రిషి పైకి ఎదిగారు. అదే ఆయన ప్రత్యేకత.
హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీతపైన అపారమైన నమ్మకం. 2015లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేశారు. జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు కూడా గీతపైనే ప్రమాణం చేశారు .ప్రధానిగా లిజ్ ట్రస్‌తో పోటీ పడే సమయంలో ప్రచారంలోనూ శ్రీకృష్ణ జయంతి రోజున గోపూజ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ఆయన ట్వీట్లు చేశారు.రిషి ఇంగ్లీషుతో పాటు హిందీ, పంజాబీ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. సునాక్‌కు భారత్ పాస్‌పోర్టు కూడా ఉంది.
బెంగుళూరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబమైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను పెళ్లి చేసుకున్న సునాక్ ఇంట్లో కూడా భారతీయ సంప్రదాయాలనే పాటిస్తారు. వారి ఇద్దరి ఆడపిల్లలు అనౌష్క, కృష్ణని కూడా భారతీయతనే నేర్పిస్తున్నారు. కుటుంబానికి అత్యంత విలువ ఇస్తారు. తన అత్తమామలు ఎప్పటికీ గర్వకారణమని చెప్పుకుంటారు. వారిని కలవడానికి తరచూ బెంగుళూరు వచ్చి వెళుతుంటారు. ప్రతీ ఏటా దీపావళిని ఘనంగా జరుపుకునే సునాక్ ప్రధానిగా దీపావళి రోజే ప్రమాణం చేయడం విశేషం. ఒక హిందువును ప్రధానిగా అంగీకరించడం ద్వారా బహుళ విశ్వాసాలు, వైవిధ్యాలను అంగీకరించగలిగే సహనం యూకే ప్రజలకు బాగా ఉందని అర్థమవుతోంది.
కుటుంబ నేపథ్యం ఇదీ
రిషి సునాక్ తాత రామదాస్ సునాక్ అవిభాజ్య భారత్‌లో పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రనవాలాకు చెందినవారు. 1935 సంవత్సరంలోనే రామదాస్ తూర్పు ఆఫ్రికాలోని నైరోబియాకి వలస వెళ్లిపోయారు. నాన్నమ్మ రాణి సునాక్ ఓ రెండేళ్లు ఢిల్లీలో ఉండి తర్వాత భర్త దగ్గరకి వెళ్లారు. రామదాస్ దంపతులకి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రిషి సునాక్ తండ్రి యశ్‌వీర్ 1949లో కెన్యాలో జన్మించారు. 1960లో ఆఫ్రికాలో భారతీయులపై జరిగే దాడులకు భయపడి యశ్‌వీర్ యువకుడిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. పంజాబ్ నుంచి టాంజానియా వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందిన ఉషా బెర్రీని యశ్‌వీర్ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల మొదటి సంతానమే రిషి సునాక్. రిషి తాత ముత్తాతలు ఉంటే గుజ్రనవాలా ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉండడంతో ఆ దేశం కూడా రిషి మా వాడే అని అంటోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment