ఢిల్లీ:బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తితో కలిసి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. దాదాపు గంటపాటు దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హిందువుగా గర్విస్తున్నానని అన్నారు.
'నేను హిందువునని గర్విస్తున్నాను. అదే వాతావరణంలో పెరిగాను. ఇప్పటికీ అలానే ఉన్నాను. ఢిల్లీలో ఉండే ఈ రెండు రోజుల్లో ఒక మందిరాన్ని దర్శించాలని అనుకున్నాను.' అని రిషి సునాక్ అన్నారు. రిషి సునాక్ రాకతో దేవాలయంతో సహా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
జీ20 సమావేశాలకు హాజరుకావడానికి శుక్రవారం ఢిల్లీకి వచ్చారు రిషి సునాక్ దంపతులు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే 'జై శ్రీరాం' అని పలకరిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వారికి స్వాగతం పలికారు. రుద్రాక్ష, భగవద్గీత, హనుమాన్ చాలీసాను రిషి సునాక్ దంపతులకు అందించారు.
శనివారం జీ20 సదస్సు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు రిషి సునాక్. వాణిజ్య, పెట్టుబడుల అంశంలో మరిన్ని ఒప్పందాలు చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: G20 Summit: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్..
Comments
Please login to add a commentAdd a comment