మా మధ్య ఉండడానికి వీల్లేదు..
మొరాదాబాద్: ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యల్ని సహించం, విధ్యంసకర చర్యల్ని క్షమించమంటూ ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంటే... మరోవైపు బీజేపీ శ్రేణులు, పలువురు పార్టీ నాయకులు మాత్రం మత విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో బీజేపీ ఇలాంటి వివాదంలోనే చిక్కుకొంది. పార్టీ కౌన్సిలర్ విద్యాశరన్ శర్మ అలియాస్ బిట్టూ ఒక ముస్లిం కుటుంబాన్ని ఇంట్లోంచి గెంటివేసిన కేసులో కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే... కౌన్సిలర్ శర్మ బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే తమ ప్రాంతంలో ముస్లింలు ఉండడానికి వీల్లేదంటూ హూంకరించాడు. ఉన్మాదిలా మారి ఓ ముస్లిం కుటుంబాన్ని వేధిస్తూ వచ్చాడు. తమ ఇల్లు అమ్ముకున్న తర్వాత వెళ్లిపోతామని ఆ కుటుంబం వేడుకున్నా వినిపించుకోలేదు. చివరికి సొంత ఇంట్లో ఉంటున్న మహిళను బయటికి గెంటేసి, ఇంటికి తాళం వేశాడు. అంతేకాదు ఆ ఇంటిని ఎవరికీ అద్దెకు కూడా ఇవ్వడానికి వీల్లేదని బెదిరించాడు. దీంతో వివాదం రగిలింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
తమ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలు ఉండడానికి వీల్లేదని ఏది ఏమైనా సరే తాము అనుమతించమని విద్యాశరన్ శర్మ ఈ సందర్భంగా పోలీసులతో వాదించినట్టు తెలుస్తోంది. బ్రాహ్మణులు ఎక్కువగా ఉండే తమ మధ్య ముస్లింలు ఎలా ఉంటారంటూ పోలీసు అధికారి అనిల్ కుమార్ తో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. దీంతో విసిగి వేసారిన ఆ ముస్లిం కుటుంబం తమ ఇల్లును కొనుక్కునే నాధుడి కోసం ఎదురు చూస్తోందట.