హిందూ ధర్మంపై దాడి చేస్తే..
హిందూ ధర్మంపై దాడి చేస్తే..
Published Mon, May 22 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM
పరిపూర్ణానందస్వామి
ఆదోని : హిందూ ధర్మంపై దాడులు చేస్తే వారికి నామరూపాలుండవని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానందస్వామి అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన ‘ఓ హిందు మేలుకో.. నీ ధర్మం తెలుసుకో’ అనే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హిందుత్వం మతం కాదని మానవ ధర్మమని పేర్కొన్నారు. హిందూ ధర్మంపై 2200 ఏళ్లపాటు దాడులు జరిగాయన్నారు. అయితే దాడులు చేసిన మహ్మదీయులు, డచ్‌లు, మొగలాయిలు ఇలా ఎందరో.. తమ నామరూపాలు కోల్పోయినా హిందూ ధర్మం నేటికీ పటిష్టంగా ఉందని తెలిపారు. మానవ ధర్మాన్ని కాపాడేవారు దళితులైనా హిందూ ధర్మం దేవతగా పూజిస్తుందని, ఇందుకు మహాయోగి లక్ష్మమ్మవ్వే నిదర్శనమన్నారు. శ్రీ రాముడు దేవుడైతే, ఆంజనేయుడు ఆయన సేవకుడని, అయితే శ్రీరాముడి ఆలయాలు కొన్ని ప్రాంతాల్లో కనిపించకపోయినా ఆంజనేయుడి ఆలయాలు మాత్రం ప్రతి వీధిలోనూ దర్శనమిస్తాయన్నారు.
సేవకుడిని దేవుడిగా పూజించే గొప్ప గుణం హిందూ ధర్మానికి ఉందని వివరించారు. నేటి పాలకులు సమాజాన్ని కులాలతో ముక్కలు చేసి హిందూ ధర్మాన్ని కాలరాస్తున్నారని, ఏదో ఒక రోజు ఇలాంటి వారంతా నామరూపాలు కోల్పోక తప్పదని హెచ్చరించారు. హిందూ ధర్మ పరిరక్షణకు వేదికలుగా ఉన్న ఆలయాలు మన రాష్ట్రంలో దాదాపు 13000 మూత పడ్డాయని, వాటికి పాలకులు పూర్వ వైభవం కల్పించాలని కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ క్రిష్ణరావు హిందూ ధర్మ పరిరక్షణపై మాట్లాడగా కార్యక్రమం ఆహ్వాన సమితి అధ్యక్ష, ఉపాధ్యక్షులు విట్టారమేష్, బసవన్న గౌడు, శ్రీకాంత్‌రెడ్డి, ప్రకాష్‌జైన్, టీజీ పాండురంగశెట్టి ఆర్గనైజింగ్ కార్యదర్శి రామాంజినేయులు, పట్టణ ప్రముఖులు బుగ్గారమేష్, మాలేకర్ శ్రీనివాసులు, హరియాదవ్, చెన్నబసప్ప, అశోక్, శ్రీనివాస ఆచారి, పీఎస్‌మూర్తి పాల్గొన్నారు.
Advertisement
Advertisement