
తిరువనంతపురం: కఠినమైన అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, చర్చి కొలనులో స్నానాలు చేయడాన్ని ఎవరైనా విశ్వసిస్తారా? ఇది మత సామరస్యానికి సంబంధించిన కల్పిత కథ అనుకుంటే పొరబడినట్లే. శబరిమల అయ్యప్పస్వామి కొలువైన కేరళలో చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మండాలం–మకరవిలక్కు యాత్రకు వచ్చే స్వాములు శబరిమలకు 60 కిలోమీటర్ల దూరంలో కొట్టాయం జిల్లాలో ఉన్న ఎరుమేలి నాయనార్ జుమా మసీదు(వావర్‌పల్లి మసీదు) చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తిరుగు ప్రయాణంలో ఆ పక్కనే అలప్పుజలో ఉన్న ఆర్థంకల్ సెయింట్ అండ్రూస్ బాసిలికా చర్చి ఆవరణలోని చెరువులో స్నానాలాచరిస్తారు. నవంబర్–జనవరి నెలల మధ్య ఎన్నో ఏళ్లుగా ఇదొక ఆనవాయితీగా కొనసాగుతోంది. దీని వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది.
నమాజ్.. ప్రదక్షిణలు
పండాలం రాజు దత్తపుత్రుడైన స్వామి అయ్యప్పకు హజ్రత్ వావర్ షా అనే ముస్లిం, ఆర్థంకల్ వెలుథచన్ అనే క్రైస్తవ బోధకులు మంచి స్నేహితులుగా ఉండేవారని ఇక్కడి వారు చెప్పుకుంటుంటారు. వారి మధ్య స్నేహానికి, మత సామరస్యానికి గుర్తుగా అయ్యప్ప దీక్షాపరులు వావర్ పేరుతో ఉన్న మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. కేరళతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా స్వాములు వస్తుంటారని వావర్ మసీదు జాయింట్ సెక్రటరీ హకీం తెలిపారు. ‘స్వాములు మసీదు ప్రార్థన మందిరం లోపలికి మాత్రం ప్రవేశించరు. మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేసి, టెంకాయ కొట్టి, కానుకలు సమర్పించి శబరిమల సందర్శనకు బయల్దేరుతారు.
మసీదు లోపల నమాజ్ జరుగుతుండగా వెలుపల అయ్యప్ప భక్తులు శరణం అయ్యప్ప అంటూ ప్రదక్షిణలు చేయడం ఓ అరుదైన దృశ్యం. అయ్యç ప్ప, వావర్‌ల మధ్య స్నేహగాథ కేరళలో మత సామరస్యం, లౌకికత ఎంతగా ఉందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ’ అని హకీం అన్నారు. ఈ మసీదు వద్దే వావర్ స్వామి అనే ఆలయం కూడా ఉంది. యాత్ర ముగించుకున్న భక్తులు అర్థంకల్ బాసిలికా చర్చి వద్దకు చేరుకుంటారు. ‘చర్చి ఆవరణలోని చెరువులో లేక సమీపంలోనే ఉన్న సముద్రంలో స్నానాలు చేసి, స్వాములు దీక్షను విరమిస్తారు. చర్చిలోని సెయింట్ సెబాస్టియన్ విగ్రహం వద్ద పూజలు చేస్తారు’ అని ఫాదర్ క్రిస్టోఫర్ ఎం.అర్థస్సెరిల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment