దారుణ విద్వేష క్రీడ! | Sakshi Editorial On Bangladesh minorities and Hindu Issues | Sakshi
Sakshi News home page

దారుణ విద్వేష క్రీడ!

Published Thu, Nov 28 2024 4:52 AM | Last Updated on Thu, Nov 28 2024 4:52 AM

Sakshi Editorial On Bangladesh minorities and Hindu Issues

అయిదు నెలలుగా బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాకులపై అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. హిందూ సాధువు చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌ ఆ దేశంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళకు తాజా ఉదాహరణ. మైనారిటీల హక్కుల కోసం బలంగా గళం విప్పే దాస్‌ బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ రాజద్రోహ నేరం మోపడం విడ్డూరం. ఆయనను మంగళవారం అరెస్ట్‌ చేసి, బెయిలివ్వకుండా, పది రోజుల కస్టడీకి పంపడంతో నిరసనలు చెలరేగాయి. 

సందట్లో సడేమియాగా దుష్టశక్తులు అల్లర్లు రేపి, పొరపాటున ఓ ముస్లిమ్‌ లాయర్‌ మరణానికి కారణమై, ఆ పాపం మైనా రిటీల నెత్తిన వేయడంతో ఢాకా మరోసారి భగ్గుమంది. ఆలయాలపై దాడులు, ప్రాణనష్టంతో... మైనారిటీలనూ, భావప్రకటనాస్వేచ్ఛనూ కాపాడాలంటూ బంగ్లాను భారత్‌ అభ్యర్థించాల్సొచ్చింది.

ఇస్లామ్‌ అధికారిక మతమైనా, లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వానికి రాజ్యాంగ బద్ధులమని చెప్పుకొనే బంగ్లా ఆ మాటకు తగ్గట్టు వ్యవహరించడం మానేసి, చాలాకాలమైంది.

అందుకు తగ్గట్టే తాజాగా ‘ఇస్కాన్‌’ను ర్యాడికల్, మత ఛాందసవాద సంస్థ అని బంగ్లా అటార్నీ జనరల్‌ బుధవారం అభివర్ణించడం ఆందోళనకరం. ‘ఇస్కాన్‌’ను నిషేధించాలని బంగ్లా యోచిస్తు న్నట్టు వార్త. ఆధ్యాత్మిక చైతన్యం, పీడిత జన సముద్ధరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో పనిచేస్తున్న ఒక సంస్థపై అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడం అక్షరాలా బుద్ధిహీనతే. దేశంలోని విభిన్న వర్గాల మధ్య సౌహార్దం పెంపొందించి, బాధితులకు న్యాయం చేసి, మానవ హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏ శక్తుల ప్రోద్బలంతో ఇలా మాట్లాడుతోందన్నది ఆశ్చర్యకరం. 

జూలై నాటి ప్రజా ఉద్యమంతో ఢాకాలో ప్రభుత్వ మార్పు జరిగిపోయింది కానీ, అల్పసంఖ్యాక వర్గాలపై సాగుతున్న దాడులు మాత్రం అప్పటి నుంచి ఆగడం లేదు. మైనారిటీలను పూర్తిగా తరిమేసి, బంగ్లాను హిందూ రహిత దేశంగా మార్చాలనే పన్నాగం దీనికి వెనక ఉందని స్థానిక స్వతంత్ర విశ్లేషకుల మాట. ఈ అల్లర్లు, అల్పసంఖ్యాక హిందువులపై దాడుల వెనుక మత ఛాందస జమాతే ఇస్లామీ ఉందనేది స్పష్టం. 

హసీనా సర్కారు కాలంలో నిషేధానికి గురైన ఈ ర్యాడికల్‌ గ్రూపు, అలాగే బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ)లు యూనస్‌ యంత్రాంగంలో భాగమే. అసలు ఈ ప్రయత్నమంతా ఇస్లామిక్‌ షరియత్‌ను ప్రవేశపెట్టి, బంగ్లాదేశ్‌ను ప్రజాస్వామ్య ఎన్నికలు, పార్ల మెంట్‌తో పని లేని దేశంగా మార్చాలనే వ్యూహంలో భాగమని ఒక వాదన వినిపిస్తోంది. అదే గనక నిజమైతే, అత్యంత ప్రమాదకర పరిణామం. పౌరసమాజం, రాజకీయ నేతలు, ప్రజలు కలసి కట్టుగా అలాంటి వ్యూహాలను భగ్నం చేసి, కష్టించి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. 

అసలు అఫ్‌ఘన్‌ లాగానే బంగ్లాను తమ ప్రయోగశాలగా చేసుకోవాలని పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్నట్టుంది. అప్పుడిక బంగ్లా మరో తీవ్రవాద కేంద్రంగా మారే ప్రమాదముంది. అది భారత్‌కే కాదు... యావత్‌ ప్రపంచానికి నష్టం. నిజానికి, ఆసియా – పసిఫిక్‌ కూటమిలో బంగ్లాను భాగం చేసుకొని, లబ్ధి పొందాలని అమెరికా భావించింది. నిరుటి హసీనా సర్కార్‌ నో చెప్పడంతో అది కుదరలేదు. 

మొన్నటి అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్‌ గెలిచి ఉంటే ఏమో కానీ, ట్రంప్‌ గెలవడంతో బంగ్లా మధ్యంతర సర్కార్‌ సారథి – ట్రంప్‌ ద్వేషి ప్రొఫెసర్‌ మహమ్మద్‌ యూనస్‌ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ట్రంప్‌ పగ్గాలు చేపట్టాక బంగ్లాపై కఠినవైఖరి అవలంబిస్తారని యూనస్‌కు తెలుసు. అందుకే, ఆలోగా మైనారిటీలపై అల్లర్లను ఆఖరి అస్త్రంగా చేసుకున్నారట. 

బంగ్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, స్వతంత్ర బంగ్లాదేశ్‌ అవతరణకు అయిదు దశాబ్దాల పైచిలుకు క్రితం భారత్‌ అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు అదే గడ్డపై భారత వ్యతిరేకత, మైనారిటీలపై ద్వేషాలను స్వార్థపరులు పెంచిపోషించడం విషాదం. దాదాపు 14 ఏళ్ళ పైగా షేక్‌ హసీనా ఏలుబడిలో నియంత పోకడల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత సాగిందని ఆరోపణలొస్తే, కొత్త హయాం కూడా తక్కువేమీ తినలేదు. 

విజృంభిస్తున్న విద్వేషం, విధ్వంసం ఢాకాలో పత్రికా స్వాతంత్య్రానికి సైతం ముప్పుగా మారాయి. ‘ప్రథమ్‌ ఆలో’, ‘ది డైలీ స్టార్‌’లాంటి స్వతంత్ర పత్రికా రచనకు పేరుపడ్డ పత్రికలపై దాడులు అందుకు ఓ మచ్చుతునక. బాధితు లకు సత్వర న్యాయం కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్ళ ఏర్పాటు సహా మైనారిటీల కనీసపాటి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి బంగ్లా సర్కార్‌కు ఉన్న కష్టమేమిటి? 

హసీనా సర్కార్‌ను గద్దె దింపినప్పటి నుంచి ఇప్పటికి బంగ్లాలో మైనారిటీలపై 2 వేలకు పైగా దాడులు జరిగాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ సోదరులపై జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను మతపరంగా కాక మానవ హక్కుల పరంగా చూడాలి. అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది. 

1930లో బంగ్లాలో 30 శాతం పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం 8 శాతం చిల్లరకు పడిపోయారన్న నిష్ఠుర సత్యం అక్కడ జరుగుతున్నదేమిటో ఎరుకపరుస్తుంది. విద్యుత్‌ సహా, బియ్యం, పత్తి, చమురు లాంటి అనేక సరుకుల విషయంలోనూ మనపై భారీగా ఆధారపడ్డ బంగ్లా సర్కార్‌పై ఇకనైనా భారత్‌ కఠినవైఖరిని అవలంబించాలి. పొరుగు దేశంలో బతుకు భయంలో ఉన్న హిందువులను కాపాడేందుకు క్రియాశీలంగా వ్యవహరించాలి. 

కేవలం మాటలకు పరిమితం కాకుండా, దౌత్య, వాణిజ్య రంగాల్లో చేయగలిగినదంతా చేయాలి. పేరుకు మాత్రం లౌకికవాదం ముసుగు వేసుకొని, మైనారిటీలకు వ్యతిరేకంగా, తెర వెనుక శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిన అసమర్థ యూనస్‌ సర్కార్‌పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి తేవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement