బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం!
బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దేశ అధికార మతంగా ఇస్లాంను బంగ్లాదేశ్ తొలగించే అవకాశముంది. ఇటీవల దేశంలోని ఇతర విశ్వాసాలు గల ప్రజలపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
దేశంలోని మైనారిటీలైన క్రైస్తవులు, హిందువులు, ముస్లింలోని షియా వర్గాలు లక్ష్యంగా ఇటీవల దాడులు జరిగాయి. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఈ దాడులు చేసినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అధికార మతంగా ఇస్లాంను తొలగించాలని అంశానికి అనుకూలంగా ఆ దేశ సుప్రీంకోర్టు వాదనలు వింటోందని 'డైలీ మెయిల్' ఓ కథనంలో తెలిపింది. 1988 నుంచి బంగ్లాదేశ్ అధికార మతంగా ఇస్లాం కొనసాగుతోంది. దీనిని వివిధ మైనారిటీ మతాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. దేశ అధికార మతంగా ఇస్లాంను కొనసాగించడం చట్టవ్యతిరేకమని వారు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
అయితే ఈ నిర్ణయానికి ప్రజామద్దతు లభిస్తుందా అనేదానిపై అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్‌లో 90శాతం మంది ముస్లింలు ఉండగా 8శాతం మంది హిందువులు, రెండు శాతంమంది ఇతర మైనారిటీ మతాల వారు ఉన్నారు. ఇటీవల బంగ్లాదేశ్ పంచగఢ్ జిల్లాలో ఓ హిందూ పూజారిని దేవాలయంలోనే కొట్టిచంపగా, కొన్ని సంవత్సరాలుగా మైనారిటీ బ్లాగర్స్‌ను దారుణంగా హతమారుస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇస్లామిక్ గ్రూపులైన జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్, అన్సరుల్లా బంగ్లా టీంలు ఈ దారుణాల వెనుక ఉన్నట్టు భావిస్తున్నారు. మరోవైపు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద గ్రూపు ఉనికి కూడా దేశంలో పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రాముఖ్యం సంతరించుకుంది.