
హిందువైనందుకే నా కొడుకును తగలబెట్టారు
తన కుమారుడు కేవలం హిందువు కావడం వల్లే పెట్రోల్ పోసి దారుణంగా కాల్చి చంపారని సావన్ రాథోడ్ తండ్రి ధర్మ ఆరోపించారు.
ముంబై: తన కుమారుడు కేవలం హిందువు కావడం వల్లే పెట్రోల్ పోసి దారుణంగా కాల్చి చంపారని సావన్ రాథోడ్ తండ్రి ధర్మ ఆరోపించారు. చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే సావన్ రాథోడ్(17) జనవరి 13న కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి, రెండు రోజుల తర్వాత మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ సంఘటనతో ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహిం షేక్, జుబేర్ తంబోలీ, ఇమ్రాన్ తంబోలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సావన్ కారు బ్యాటరీలను చోరీ చేయడం వల్లే అతని పై పెట్రోల్ పోసి నిప్పంటించామని వీరు చెబుతున్నారు. అయితే ఈ హత్య వెనక మత ప్రమేయమైన కోణం లేదని పోలీసు అధికారి తుషార్ దోషి తెలిపారు.
హిందువు అవునా కాదా అని అడిగిమరీ నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించారని బంజారా క్రాంతి దళ్ అధ్యక్షుడు రమేష్ రాథోడ్ ఆరోపించారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్న సావన్ మాట్లాడిన వీడియోను.. పోలీసులకు సమర్పించామని తెలిపారు. దీన్ని మరణ వాంగ్మూలంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మత పరమైన కోణంలో కూడా ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. పోలీసులు బాధితుడి వాంగ్మూలాన్ని రికార్డు చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఈ కేసును పోలీసులు తప్పుదోవపట్టిస్తున్నారని ఆందోళనకారులు మండిపడుతున్నారు.
ఆ వీడియోలో ఏముందంటే: బాదితుడు సావన్ తన తండ్రి, అక్కడున్నవారితో మాట్లాడుతూ...ముగ్గురు నా దగ్గరుకు వచ్చి నువ్వు ఏం చేస్తూంటావ్, నీ పేరేంటీ అని అడిగారు. నా పేరు సావన్ రాథోడ్ అని చెప్పాను. నువ్వు హిందువువా ? అని ప్రశ్నించారు. అవును నేను హిందువును అని చెప్పా. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేవలం హిందువు కావడం వల్లే నాకు నిప్పంటించారు అని మరోసారి బాధితుడు స్పష్టం చేశాడు.