ప్యార్ కీ కహానీ | Pyar Ki Kahani | Sakshi
Sakshi News home page

ప్యార్ కీ కహానీ

Published Sat, Feb 14 2015 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

ప్యార్ కీ కహానీ

ప్యార్ కీ కహానీ

you don't need someone to complete you.. you only need someone to accept you completely.. అన్నట్టే ఉంటుంది. ఇక్కడ పరిచయం చేస్తున్న ఈ జంట! షౌకత్ అలీఖాన్, శిరీష.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్‌లో హ్యాండీక్రాఫ్ట్స్ షోరూమ్ రన్ చేస్తుంటారిద్దరూ!
 ..:: సరస్వతి రమ

షౌకత్ అలీ కశ్మీరీ... శిరీష హైదరాబాదీ. ఎలా కలిశారు మరి? షౌకత్ వాళ్లు నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు. షౌకత్ అందరికన్నా చిన్నవాడు. 1990ల్లో కశ్మీర్‌లో పరిస్థితులు బాగా లేకపోవడంతో షౌకత్‌ను రాజస్థాన్‌లోని అన్నయ్య దగ్గరికి పంపించారు అతడి తల్లిదండ్రులు. కొన్నాళ్లకు అన్నయ్యతో పాటు చెన్నై వెళ్లాడు. 1995లో మరో అన్నయ్య కుటుంబంతో హైదరాబాద్ చేరాడు. శిరీష వాళ్లున్న కాంప్లెక్స్‌లోనే ఇల్లు తీసుకున్నాడు. వాళ్ల పిల్లలు ఇంచుమించు శిరీష వయస్కులే. దాంతో వాళ్లతో ఆమెకు ఇట్టే స్నేహం కుదిరింది. షౌకత్ అప్పుడప్పుడు హైదరాబాద్‌లోఉన్న అన్నవాళ్ల దగ్గరకి వస్తూండడంతో  షౌకత్ కూడా శిరీషకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. అలా ఆ స్నేహం తెలియకుండానే ఓ కమిట్‌మెంట్ అయింది శిరీషకు.

2000లో..

షౌకత్ మీద ఇంట్లోవాళ్ల ఒత్తిడి మొదలైంది పెళ్లి చేసుకొమ్మని. కానీ అప్పటికే అతని మనసులో శిరీష ఉంది. అప్పుడు శిరీష డిగ్రీ చదువుతోంది. షౌకత్ వ్యాపారంలో ఉన్నాడు. ఒకవేళ ఇంట్లో వాళ్లు వద్దన్నా శిరీషను పోషించుకునే మార్గమైతే ఉందన్న ధైర్యంతో ఆమె చేయి పట్టుకున్నాడు. జీవితభాగస్వామి అయ్యాడు. ఈ పెళ్లి షౌకత్ తల్లిదండ్రులకు కొంత జీర్ణంకాకపోయినా అన్నయ్యలు మాత్రం సంబరపడ్డారు. కారణం అడిగితే ‘మా అన్నయ్య పిల్లలతో శిరీషకున్న ఫ్రెండ్‌షిప్ ఆటోమెటిగ్గా అన్నయ్య వాళ్ల కుటుంబానికీ ఆమెను దగ్గర చేసింది. అప్పుడు అమ్మానాన్నలు కొంత ఫీలయినా మిగతా మా కుటుంబమంతా హ్యాపీగానే ఉంది’ అంటాడు షౌకత్. మరి మీ ఇంట్లో అని శిరీషని అడిగితే ‘మా ఇంట్లో ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకంటే కాస్త లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న కుటుంబం మాది. మా సర్కిల్లో ఇలాంటి పెళ్లిళ్లు చాలానే జరిగాయి. కాబట్టి పెద్దగా పట్టింపుల్లేకపోవడమే కాదు సపోర్ట్ కూడా దొరికింది’ అని ఆమె చెప్పేలోపే ‘పెళ్లయ్యాక కొన్నాళ్లు శ్రీనగర్‌లో ఉన్నాం. అక్కడ మాకు ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీ ఉండేది. దాన్ని చూసుకున్నాను. తర్వాత ఫుడ్ మార్కెటింగ్ సెక్టార్‌లోకి వెళ్లా. చాలా నష్టమొచ్చింది. పెళ్లిలో శిరీషకు పెట్టిన జ్యువెలరీ అంతా తీసేశాను. ఆ టైమ్‌లో శిరీష పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికీ అదే సపోర్ట్ కంటిన్యూ అవుతోంది’అంటాడు షౌకత్
 
కల్చరల్ డిఫ్రెన్సెస్..

‘ఏమీ ఫేస్ చేయలేదు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం మాత్రం తప్పలేదు. షౌకత్ వాళ్ల పేరెంట్స్ కశ్మీరీ మాట్లాడేవాళ్లు. నాకర్థమయ్యేది కాదు. ఒకే కాంపౌండ్‌లో వీళ్ల ఇద్దరన్నయ్యలు, పేరెంట్స్ విడివిడిగా ఉండేవారు. కిచెన్, డైనింగ్ ఏరియా మాత్రం కామన్. నాకు వంటే కాదు మిగిలిన పనులూ పెద్దగా వచ్చేవి కావు. అక్కడ కూడా ఎక్కువగా వాళ్ల అన్నయ్యల పిల్లలతోనే కలిసుండేదాన్ని. ఏదన్నా పని రాక, చేయకపోతే అత్తగారు కశ్మీరీలో ఏదో అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు’ అని శిరీష చెప్తుంటే ‘అమ్మ ఏమంటుందో అప్పుడప్పుడు నేను ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్‌చేసి చెప్పేవాడిని. తిట్టిన తిట్టును కూడా పాలిష్ చేసి సాఫ్ట్‌గా చెప్పేవాడిని. తను తిట్టినా పెద్దవాళ్లు కదా అని శిరీష లైట్‌గా తీసుకునేది’ అని భార్య పెద్దమనసును వివరించాడు షౌకత్. ‘అందుకే  కశ్మీరి నాకు రాకపోవడాన్ని లాంగ్వేజ్‌ప్రాబ్లం అని అనుకోకుండా అడ్వాంటేజ్ అనుకునేదాన్ని’
 
హిందూ, ముస్లిం..

..అనే తేడా మామధ్య ఎప్పుడూ రాలేదంటారిద్దరూ ముక్త కంఠంతో. ‘నేను నాస్తికురాలినే. తను నమాజ్ చేసుకుంటాడు. మసీద్‌కి వెళ్తాడు. మా పెళ్లయి 15 ఏళ్లవుతుంది.
 
మా మధ్య గొడవలకు మతం, కల్చర్ లాంటివెప్పుడూ కారణాలు కాలేదు’ శిరీష. ‘టూర్స్‌కి వెళ్లినప్పుడు అక్కడి దేవాలయాలకు వెళ్తాం. ఒకరి నమ్మకాలను, అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటాం అంతే!’ అంటాడు. ‘అలాగని మిగిలిన విషయాల్లో అప్ అండ్ డౌన్స్ లేవని కాదు.. చాలా ఉన్నాయి. కానీ వాటినే పట్టుకొని కూర్చోలేదు. మా  కామన్ ఫోకస్ అంతా మంచి జీవితం, మా పిల్లలు మనాన్, ఆల మీదే!’ శిరీష.
 
‘ఆ లక్ష్యం కోసం ఇద్దరం కష్టపడ్తాం. ఫ్యామిలీ, బిజినెస్ రెండిటికీ ఇద్దరం టూ పిల్లర్స్‌మి. నాది ఫిజికల్ స్ట్రెన్త్ అయితే తనది ఎమోషనల్ బ్యాలెన్స్’ షౌకత్. ‘మా మధ్య వచ్చిన ఏ గొడవైనా మా  రిలేషన్‌ని స్ట్రాంగ్‌చేసిందే తప్ప బలహీనపర్చలేదు’ శిరీష. ‘ఓపెన్‌మైండెడ్.. ట్రస్ట్, రెస్పెక్ట్’ఈ మూడే తమ అనుబంధానికి మూడు ముళ్లు అంటూ తమ లవ్ స్టోరీకి ఎండ్ టచ్ ఇచ్చారు షౌకత్ అండ్ శిరీష!
 
ఫొటోలు: జి.రాజేష్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement