Sirisa
-
ప్యార్ కీ కహానీ
you don't need someone to complete you.. you only need someone to accept you completely.. అన్నట్టే ఉంటుంది. ఇక్కడ పరిచయం చేస్తున్న ఈ జంట! షౌకత్ అలీఖాన్, శిరీష.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్‌లో హ్యాండీక్రాఫ్ట్స్ షోరూమ్ రన్ చేస్తుంటారిద్దరూ! ..:: సరస్వతి రమ షౌకత్ అలీ కశ్మీరీ... శిరీష హైదరాబాదీ. ఎలా కలిశారు మరి? షౌకత్ వాళ్లు నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు. షౌకత్ అందరికన్నా చిన్నవాడు. 1990ల్లో కశ్మీర్లో పరిస్థితులు బాగా లేకపోవడంతో షౌకత్‌ను రాజస్థాన్‌లోని అన్నయ్య దగ్గరికి పంపించారు అతడి తల్లిదండ్రులు. కొన్నాళ్లకు అన్నయ్యతో పాటు చెన్నై వెళ్లాడు. 1995లో మరో అన్నయ్య కుటుంబంతో హైదరాబాద్ చేరాడు. శిరీష వాళ్లున్న కాంప్లెక్స్‌లోనే ఇల్లు తీసుకున్నాడు. వాళ్ల పిల్లలు ఇంచుమించు శిరీష వయస్కులే. దాంతో వాళ్లతో ఆమెకు ఇట్టే స్నేహం కుదిరింది. షౌకత్ అప్పుడప్పుడు హైదరాబాద్‌లోఉన్న అన్నవాళ్ల దగ్గరకి వస్తూండడంతో షౌకత్ కూడా శిరీషకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. అలా ఆ స్నేహం తెలియకుండానే ఓ కమిట్మెంట్ అయింది శిరీషకు. 2000లో.. షౌకత్ మీద ఇంట్లోవాళ్ల ఒత్తిడి మొదలైంది పెళ్లి చేసుకొమ్మని. కానీ అప్పటికే అతని మనసులో శిరీష ఉంది. అప్పుడు శిరీష డిగ్రీ చదువుతోంది. షౌకత్ వ్యాపారంలో ఉన్నాడు. ఒకవేళ ఇంట్లో వాళ్లు వద్దన్నా శిరీషను పోషించుకునే మార్గమైతే ఉందన్న ధైర్యంతో ఆమె చేయి పట్టుకున్నాడు. జీవితభాగస్వామి అయ్యాడు. ఈ పెళ్లి షౌకత్ తల్లిదండ్రులకు కొంత జీర్ణంకాకపోయినా అన్నయ్యలు మాత్రం సంబరపడ్డారు. కారణం అడిగితే ‘మా అన్నయ్య పిల్లలతో శిరీషకున్న ఫ్రెండ్షిప్ ఆటోమెటిగ్గా అన్నయ్య వాళ్ల కుటుంబానికీ ఆమెను దగ్గర చేసింది. అప్పుడు అమ్మానాన్నలు కొంత ఫీలయినా మిగతా మా కుటుంబమంతా హ్యాపీగానే ఉంది’ అంటాడు షౌకత్. మరి మీ ఇంట్లో అని శిరీషని అడిగితే ‘మా ఇంట్లో ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకంటే కాస్త లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న కుటుంబం మాది. మా సర్కిల్లో ఇలాంటి పెళ్లిళ్లు చాలానే జరిగాయి. కాబట్టి పెద్దగా పట్టింపుల్లేకపోవడమే కాదు సపోర్ట్ కూడా దొరికింది’ అని ఆమె చెప్పేలోపే ‘పెళ్లయ్యాక కొన్నాళ్లు శ్రీనగర్‌లో ఉన్నాం. అక్కడ మాకు ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీ ఉండేది. దాన్ని చూసుకున్నాను. తర్వాత ఫుడ్ మార్కెటింగ్ సెక్టార్‌లోకి వెళ్లా. చాలా నష్టమొచ్చింది. పెళ్లిలో శిరీషకు పెట్టిన జ్యువెలరీ అంతా తీసేశాను. ఆ టైమ్‌లో శిరీష పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికీ అదే సపోర్ట్ కంటిన్యూ అవుతోంది’అంటాడు షౌకత్ కల్చరల్ డిఫ్రెన్సెస్.. ‘ఏమీ ఫేస్ చేయలేదు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం మాత్రం తప్పలేదు. షౌకత్ వాళ్ల పేరెంట్స్ కశ్మీరీ మాట్లాడేవాళ్లు. నాకర్థమయ్యేది కాదు. ఒకే కాంపౌండ్‌లో వీళ్ల ఇద్దరన్నయ్యలు, పేరెంట్స్ విడివిడిగా ఉండేవారు. కిచెన్, డైనింగ్ ఏరియా మాత్రం కామన్. నాకు వంటే కాదు మిగిలిన పనులూ పెద్దగా వచ్చేవి కావు. అక్కడ కూడా ఎక్కువగా వాళ్ల అన్నయ్యల పిల్లలతోనే కలిసుండేదాన్ని. ఏదన్నా పని రాక, చేయకపోతే అత్తగారు కశ్మీరీలో ఏదో అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు’ అని శిరీష చెప్తుంటే ‘అమ్మ ఏమంటుందో అప్పుడప్పుడు నేను ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్లేట్చేసి చెప్పేవాడిని. తిట్టిన తిట్టును కూడా పాలిష్ చేసి సాఫ్ట్‌గా చెప్పేవాడిని. తను తిట్టినా పెద్దవాళ్లు కదా అని శిరీష లైట్‌గా తీసుకునేది’ అని భార్య పెద్దమనసును వివరించాడు షౌకత్. ‘అందుకే కశ్మీరి నాకు రాకపోవడాన్ని లాంగ్వేజ్ప్రాబ్లం అని అనుకోకుండా అడ్వాంటేజ్ అనుకునేదాన్ని’ హిందూ, ముస్లిం.. ..అనే తేడా మామధ్య ఎప్పుడూ రాలేదంటారిద్దరూ ముక్త కంఠంతో. ‘నేను నాస్తికురాలినే. తను నమాజ్ చేసుకుంటాడు. మసీద్కి వెళ్తాడు. మా పెళ్లయి 15 ఏళ్లవుతుంది. మా మధ్య గొడవలకు మతం, కల్చర్ లాంటివెప్పుడూ కారణాలు కాలేదు’ శిరీష. ‘టూర్స్‌కి వెళ్లినప్పుడు అక్కడి దేవాలయాలకు వెళ్తాం. ఒకరి నమ్మకాలను, అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటాం అంతే!’ అంటాడు. ‘అలాగని మిగిలిన విషయాల్లో అప్ అండ్ డౌన్స్ లేవని కాదు.. చాలా ఉన్నాయి. కానీ వాటినే పట్టుకొని కూర్చోలేదు. మా కామన్ ఫోకస్ అంతా మంచి జీవితం, మా పిల్లలు మనాన్, ఆల మీదే!’ శిరీష. ‘ఆ లక్ష్యం కోసం ఇద్దరం కష్టపడ్తాం. ఫ్యామిలీ, బిజినెస్ రెండిటికీ ఇద్దరం టూ పిల్లర్స్మి. నాది ఫిజికల్ స్ట్రెన్త్ అయితే తనది ఎమోషనల్ బ్యాలెన్స్’ షౌకత్. ‘మా మధ్య వచ్చిన ఏ గొడవైనా మా రిలేషన్‌ని స్ట్రాంగ్చేసిందే తప్ప బలహీనపర్చలేదు’ శిరీష. ‘ఓపెన్మైండెడ్.. ట్రస్ట్, రెస్పెక్ట్’ఈ మూడే తమ అనుబంధానికి మూడు ముళ్లు అంటూ తమ లవ్ స్టోరీకి ఎండ్ టచ్ ఇచ్చారు షౌకత్ అండ్ శిరీష! ఫొటోలు: జి.రాజేష్ -
ఫ్యాషన్ లైఫ్ స్టైల్
ట్రెండ్జ్ ఎగ్జిబిషన్ పాఠశాల మూవీ టీమ్ సందడి చేసింది. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో మంగళవారం ప్రారంభమైన ఎక్స్పో తారల సందడికి వేదికగా నిలిచింది. హీరో నందు, హీరోయిన్ శిరీష, నటులు శశాంక్, హమూద్ ఎక్స్పో ఓపెనింగ్‌లో పాల్గొన్నారు. ఈ రోజుతో ముగియనున్న ఈ మేళాలో 110 మంది డిజైనర్లు రూపొందించిన జ్యుయలరీ వెరైటీలు ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. డిజైనర్ వేర్, బ్రైడల్ జ్యుయలరీ, కాంటెంపరరీ ఆభరణాలు, యాక్సెరీస్, కిడ్స్ వేర్, లెహంగాస్, ట్రెడిషనల్ హ్యాండ్లూమ్స్ సిటీవాసులను అలరిస్తున్నాయి. దీపావళి ఫెస్ట్ కోసం ప్రత్యేకంగా పూజా సెట్స్ కూడా ఎక్స్‌పోలో అందుబాటులో ఉన్నాయి. -
ప్రయాణం నేర్పిన పాఠాలు
చదువు పూర్తయిన తర్వాత అయిదుగురు విద్యార్థులు చేసిన ప్రయాణం వారికి ఏం నేర్పింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘పాఠశాల’. నందు, అనుప్రియ, శిరీష, సాయిరోనాక్, హమీద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మహి.వి రాఘవ్ దర్శకుడు. రాకేష్ మహంకాళి, పవన్‌కుమార్‌రెడ్డి నిర్మాతలు. రాహుల్‌రాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్లరి నరేశ్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శాసనసభ్యురాలు డి.కె.అరుణకు అందించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘జీవితంలో గోల్డెన్డేస్ అంటే కాలేజీ రోజులే. నా స్వీయానుభవాలను కూడా క్రోడీకరించి ఈ కథ రాసుకున్నాను. యువతకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. నేను నిర్మించిన ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు. అందుకే కసితో ఈ సినిమా చేశాను’’ అని తెలిపారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు దామోదరప్రసాద్, నవదీప్, శశిధర్‌రెడ్డి, శశాంక్, ఖయ్యూమ్ తదితరులు కూడా మాట్లాడారు. -
నిజ జీవిత అనుభవాల ఆధారంగా...
అది కళాశాల ముగింపు రోజు. గడచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, బరువెక్కిన హృదయాలతో విద్యార్థులంతా ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు. అలాంటి క్షణంలో ఆ అయిదుగురు మిత్రులు... ‘ఎవరిళ్లకు వాళ్లు వెళ్లే ముందు... ఒకరి ఇళ్లకు ఒకరం నాలుగు రోజులు అతిథులుగా వెళ్దాం’ అని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆ మిత్రుల జీవితాల్లో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పదహారేళ్ల చదువులో నేర్చుకోని పాఠాలను ఈ నాలుగు రోజుల ‘పాఠశాల’ ఆ అయిదుగురికీ నేర్పింది... ఈ ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘పాఠశాల’. సాయిరోనక్, అనుప్రియ, నందు, శిరీష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మూన్‌వాటర్ పిక్చర్స్ పతాకంపై రాజేశ్ మహంకాళి, పవన్‌కుమార్‌రెడ్డి నిర్మించారు. మహి వి.రాఘవ్ దర్శకుడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా అతిథులుగా విచ్చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ, దేవా కట్టా, నందినీ రెడ్డి తమ కళాశాల నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అలాగే సినిమా విజయం సాధించాలని ఆకాక్షించారు. నిజ జీవితంలో ఎదురైన అనుభవాలనే ఆధారంగా చేసుకొని ఈ కథ తయారు చేశానని దర్శకుడు చెప్పారు. కథే ఈ చిత్రానికి ప్రాణమని నిర్మాతలు తెలిపారు. -
అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి
మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ పోలీసుల అదుపులో భర్త, మరో నలుగురు విజయనగరం క్రైం: ఎన్నో ఊహలు.. ఎన్నో ఆశలతో.. సంసార జీవితాన్ని సంతోషంగా పండించుకోవాలని అత్తారింట్లో అడుగుపెట్టింది ఆ యువతి. సంప్రదాయబద్ధంగా తనను కోడలిని చేసుకున్న అత్తింటి వారు జీవితాంతం కష్టపెట్టకుండా చూసుకుంటారని ఆశించిన ఆమెకు నిరాశే ఎదురైంది. వరకట్న వేధింపులు భరించలేక పెళ్లయి ఏడాది తిరక్కముందే ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి, పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామానికి చెందిన ఎం.మహేష్‌కు ఇద్దరు కుమార్తెలు శిరీష, జ్యోతి. విజయనగరం పట్టణం సుద్ధవీధికి చెందిన కె.రవికుమార్‌కు శిరీష(19)ను ఇచ్చి గత ఏడాది ఆగస్టు 11న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ.రెండు లక్షల కట్నం, తులంన్నర బంగారు అభరణాలు, సారె అందించారు. పెళ్లయిన కొద్దిరోజులకే అల్లుడు రవికుమార్, కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధించేవారు. గర్భం దాల్చిన ఆమెను కన్నవారింటికి పంపించేందుకు ఒప్పుకోలేదు. దీంతో అల్లుడు నివాసం ఉంటున్న దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకుని మహేష్ కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు. సుమారు నెల కిందట శిరీషకు మగబిడ్డ జన్మించాడు. మంగళవారం ఉదయం శిరీషను, బిడ్డను అత్తవారు వారింటికి తీసుకెళ్లారు. సాయంత్రం కన్నవారింటికి వచ్చిన ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరుపోసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు 108 ద్వారా కేంద్రాస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. శిరీష బంధువులు బుధవారం జిల్లా కేంద్రాస్పపత్రికి చేరుకొని రవికుమార్ వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తింటి వేధింపులే వల్లే ? అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపుల వల్లే తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందని శిరీష తల్లిదండ్రులు ఆరోపించారు. అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్నయ్య అశోక్, వదిన సంధ్య, రవికుమార్ అక్క జయశ్రీ, బావ అప్పారావు నిత్యం వేధించేవారన్నారు. శిరీష మృతికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రవికుమార్‌తోపాటు మరో నలుగురిని కేంద్రాస్పత్రి వద్ద టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. -
ఒక్క సారీ... చెప్తే ఏం పోతుంది?
‘‘ఇప్పుడు నేనేం తప్పు చేశానని అంత కోపం’’... విసుగ్గా అన్నాడు సురేశ్. ‘‘తప్పు చేసింది మీరు కాదు... మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు’’... అనేసి విసవిసా బెడ్రూమ్లోకి వెళ్లిపోయింది శిరీష. ఆమె అన్న మాటకు షాక్ తిన్నట్టుగా అయ్యాడు సురేశ్. ఆ రాత్రిని ఒంటరిగా హాల్లోనే గడిపాడు. శిరీష కూడా మెత్తబడలేదు. అతడే దారికొస్తాడులే అనుకుంది. కానీ ఆమె మాట అన్నదానికంటే, మళ్లీ దగ్గరకొచ్చి సారీ చెప్పకపోవడం సురేశ్‌ని బాధించిందని ఆమెకు తెలీదు. అలా వారి మధ్య ఏర్పడిన దూరం పెరుగుతూనే ఉంది. దాన్ని శిరీష గమనించుకునేలోపే వారి అనురాగం ఉనికిని కోల్పోయింది. పరుషమైన మాట పెదవి దాటితే... ఓ అందమైన బంధం బీటలు వారుతుంది. మనిషికి మాట ఎంత అవసరమో... ఆ మాట మధురంగా ఉండటం అంతకంటే అవసరం. అలా అని అందరూ ఎప్పుడూ స్వీట్‌గానే మాట్లాడలేరు. మనిషన్న తర్వాత కోపాలు, తాపాలు, విసుగులు, చిరాకులు, అపార్థాలు, అసూయలు... ఇలా ఎన్నో ఉంటాయి. అవి ఒక్కసారి మన మనసును ఆక్రమిస్తే... మన మాట మీద అధికారాన్ని చెలాయించడం మొదలు పెడతాయి. అందుకే ఒక్కోసారి అనకూడని మాట అనేస్తాం. ఆ తర్వాత మన కోపం చల్లారిపోవచ్చు. కానీ అవతలివారి మనసులో రగిలిన మంట ఆరుతుందని గ్యారంటీ లేదు. సురేశ్, శిరీషల మాటల్నే తీసుకుంటే... ఏదో విషయం మీద మాటా మాటా వచ్చింది. దానికి మామూలుగా కూడా కోప్పడవచ్చు. కానీ పెళ్లి చేసుకోవడమే తప్పని పెద్ద మాట అనేసింది శిరీష. అది సురేశ్ మనసును గాయపర్చింది. ‘సారీ’ అన్న చిన్న పదాన్ని చెప్పలేక, అనవసరమైన ఇగోతో బంధాల్ని విచ్ఛిన్నం చేసుకునేవాళ్లు చాలామంది ఉంటారు. తెలిసో తెలియకో అవతలివారి మనసును గాయపరుస్తాం. వారికి చిన్న సారీ చెప్పడానికి ఎందుకు బాధ? మనవాళ్ల దగ్గర ఎందుకు ఇగో? భార్యాభర్తలనే కాదు... తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, పిల్లలు, చివరకు పని వాళ్లయినా సరే... ఒకరిని బాధపెట్టే హక్కు ఎవరికీ ఉండదు. ఒకవేళ తెలియక పెడితే... ఒక్కసారి సారీ అంటే చాలు... కోపం దూదిపింజలా ఎగిరిపోతుంది. దానిస్థానే ప్రేమ వచ్చి చేరిపోతుంది. బంధాలను నిలబెట్టుకోవాలంటే కొన్నిసార్లు తగ్గాలి. చాలా విషయాల్లో తగ్గించుకోవాలి. సారీ అనే ఓ చిన్న మాటను పలకడానికి బాధపడి, విలువైన బంధాన్ని దూరం చేసుకోవడం అవసరమా? ఫలితం బాగుంటుందనుకున్నప్పుడు కాస్త కాంప్రమైజ్ కావడంలో తప్పేముంది చెప్పండి! -
హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ విజయం
=తొలిసారిగా అధ్యక్షురాలిగా మహిళ =రెండు స్థానాల్లో ఏబీవీపీ, ఒక స్థానంలో యూడీఏ కూటమి విజయం =ఫలితాలపై తిరస్కరణ ఓటు ప్రభావం సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ మరోమారు విజయం కేతనం ఎగురవేసింది. కీలకమైన మూడు పదవుల్లో జెండా ఎగురవేసింది. 34 సంవత్సరాల హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవికి ఎన్నికైంది. ఎన్నికల్లో 4,626 ఓట్లకుగాను 3738 ఓట్లు పోలయ్యాయి. ఎస్ఎఫ్ఐ అధ్యక్ష అభ్యర్థి శిరీష 1197 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి ఉదయ్‌పై 79 ఓట్ల తేడాతో విజయం సాధించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన వి. శిరీష యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్) చదువుతోంది. ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ అభ్యర్థి సందీప్‌కుమార్ 1174 ఓట్లు, సంయుక్త కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ అభ్యర్థి ఆదిత్య హరీష్ 1283 ఓట్లతో విజయం సాధించారు. సాంస్కృతిక కార్యదర్శిగా ఏబీవీపీకి చెందిన స్వాతి వీఎం 1272 ఓట్లతో, క్రీడల కార్యదర్శిగా ఏబీవీపీ అభ్యర్థి కృష్ణచైతన్య 1221 ఓట్లతో విజయం సాధించారు. యునెటైడ్ డెమొక్రటిక్ అలయన్స్(యూడీఏ) కూటమికి చెందిన మణికంఠ ఉపాధ్యక్షులుగా 1189 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐలు ఒంటరిగా పోటీ చేయగా.. ఏఎస్ఏ, టీఎస్ఏ, టీఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ సంఘాలు యూడీఏ పేరిట బరిలో నిలిచాయి. తొలిసారిగా నమోదైన తిరస్కరణ ఓట్లు ఫలితాలపై తిరస్కరణ ఓట్లు ప్రభావం చూపాయి. ఆరు పదవుల్లో తిరస్కరణ ఓట్ల కారణంగానే మెజార్టీ గణనీయంగా తగ్గింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ దేశంలోనే తొలిసారిగా హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు విధానాన్ని వర్సిటీ అధికారులు అమలు చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం పోలైన 3738 ఓట్లలో అధ్యక్ష పదవికి 87, ఉపాధ్యక్ష పదవికి 146, ప్రధాన కార్యదర్శికి 137, సంయుక్త కార్యదర్శికి 200, సాంస్కృతిక కార్యదర్శికి 172, క్రీడల కార్యదర్శికి 167 తిరస్కరణ ఓట్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. తమకు నచ్చని అభ్యర్థులకు తిరస్కరణ ఓటు వారి విజయంపై ప్రభావాన్ని చూపింది. గర్వంగా ఉంది హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో నన్ను తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం పట్ల గర్వంగా ఉంది. దీని ద్వారా విద్యార్థినుల సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. 34 సంవత్సరాల హెచ్‌సీయూ చరిత్రలో నాకు గౌరవం దక్కడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. - శిరీష, హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు