అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి | Arallaku admit married in Bali | Sakshi
Sakshi News home page

అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి

Published Thu, Jul 17 2014 1:03 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Arallaku admit married in Bali

  •      మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
  •      పోలీసుల అదుపులో భర్త, మరో నలుగురు
  • విజయనగరం క్రైం: ఎన్నో ఊహలు.. ఎన్నో ఆశలతో.. సంసార జీవితాన్ని సంతోషంగా పండించుకోవాలని అత్తారింట్లో అడుగుపెట్టింది ఆ యువతి. సంప్రదాయబద్ధంగా తనను కోడలిని చేసుకున్న అత్తింటి వారు జీవితాంతం కష్టపెట్టకుండా చూసుకుంటారని ఆశించిన ఆమెకు నిరాశే ఎదురైంది. వరకట్న వేధింపులు భరించలేక పెళ్లయి ఏడాది తిరక్కముందే ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి, పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామానికి చెందిన ఎం.మహేష్‌కు ఇద్దరు కుమార్తెలు శిరీష, జ్యోతి. విజయనగరం పట్టణం సుద్ధవీధికి చెందిన కె.రవికుమార్‌కు శిరీష(19)ను ఇచ్చి గత ఏడాది ఆగస్టు 11న వివాహం జరిపించారు.

    పెళ్లి సమయంలో రూ.రెండు లక్షల కట్నం, తులంన్నర బంగారు అభరణాలు, సారె అందించారు. పెళ్లయిన కొద్దిరోజులకే అల్లుడు రవికుమార్, కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధించేవారు. గర్భం దాల్చిన ఆమెను కన్నవారింటికి పంపించేందుకు ఒప్పుకోలేదు. దీంతో అల్లుడు నివాసం ఉంటున్న దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకుని మహేష్ కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు. సుమారు నెల కిందట శిరీషకు మగబిడ్డ జన్మించాడు. మంగళవారం ఉదయం శిరీషను, బిడ్డను అత్తవారు వారింటికి తీసుకెళ్లారు.

    సాయంత్రం కన్నవారింటికి వచ్చిన ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరుపోసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు 108 ద్వారా కేంద్రాస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. శిరీష బంధువులు బుధవారం జిల్లా కేంద్రాస్పపత్రికి చేరుకొని రవికుమార్ వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
     
    అత్తింటి వేధింపులే వల్లే ?
     
    అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపుల వల్లే తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందని శిరీష తల్లిదండ్రులు ఆరోపించారు. అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్నయ్య అశోక్, వదిన సంధ్య,  రవికుమార్ అక్క జయశ్రీ, బావ అప్పారావు నిత్యం వేధించేవారన్నారు. శిరీష మృతికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రవికుమార్‌తోపాటు మరో నలుగురిని కేంద్రాస్పత్రి వద్ద టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement