బంజారాహిల్స్: మూడేళ్ల బిడ్డ ఆలనాపాలన ఓవైపు... కడుపున పెరుగుతున్న శిశువు ఎదుగుదలను చూసుకోవాల్సిన బాధ్యత మరోవైపు. ఈ క్రమంలో అత్తింటి వారి వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. మరణమే శరణ్యమని భావించింది.
‘అమ్మా... మా అత్త నన్ను చితకబాదింది... ఏం చేస్తారో అని భయమేస్తోంది... చచ్చిపోవాలనిపిస్తోంది’అంటూ రోదిస్తూ తల్లికి ఫోన్ చేసిన 12 గంటల వ్యవధిలోనే బలవన్మరణానికి పాల్పడింది. తన ఒడిలో పడుకున్న బిడ్డకు ముందుగా ఉరేసి ఆ తర్వాత కడుపున ఉన్న బిడ్డతో సహా తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ ఫిలింనగర్‌లోని వినాయకనగర్ బస్తీలో చోటుచేసుకుంది.
పెళ్లయిన నెల నుంచే వేధింపులు...
మేడిపల్లికి చెందిన శిరీష (23) వివాహం ఫిలింనగర్‌లోని వినాయకనగర్ బస్తీకి చెందిన కారు డ్రైవర్ కావటి విశ్వనాథ్ (32)తో 2019 జూన్ 9న జరిగింది. వివాహ సమయంలో రూ. 8 లక్షల కట్నంతోపాటు 15 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లి జరిగిన నెల రోజులకే అత్త బసవమ్మ, భర్త విశ్వనాథ్ విశ్వరూపం చూపించారు. రోజూ కొట్టడంతోపాటు, అదనపు కట్నం తెమ్మంటూ పుట్టింటికి తరచూ పంపేవారు.
పుట్టింటికి వచ్చిన శిరీషకు తల్లి లక్ష్మి అప్పుచేసి ఒక్కోసారి రూ. లక్ష చొప్పున అయిదుసార్లు డబ్బులు ఇచ్చి పంపింది. అయినాసరే కూతురు కాపురం బాగుపడకపోగా రోజురోజుకూ వేధింపులు పెరిగిపోయి అత్తతోపాటు భర్త విశ్వనాథ్ తీవ్రంగా కొట్టేవాడు. ఈ నెల 9న పెళ్లి రోజున కూడా ఆమెను చితకబాదాడు. అదనపు కట్నం తేవాలంటూ పుట్టింటికి పంపించేందుకు యత్నించగా ఈసారి ఆమె కాళ్లావేళ్లాపడింది.
అయినాసరే ఆ కర్కశ హృదయాలు కరగలేదు. శుక్రవారం ఉదయం 12 గంటలకు తల్లికి ఫోన్ చేసి అత్త కొట్టిందంటూ చెప్పి భోరుమంది. వాళ్ల కదలికలు చూస్తుంటే తనను ఏదో చేసేలా ఉన్నారంటూ ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత తల్లి లక్ష్మి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అని వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో అల్లుడు విశ్వనాథ్ అత్త లక్ష్మికి ఫోన్ చేసి మీ కూతురు ఉరేసుకుందంటూ చెప్పాడు. కన్నీరుమున్నీరైన మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బస్తీకి పరిగెత్తుకొచ్చారు.
కుమార్తెతోపాటు పక్కనే చిన్నారి మనీష్ విగతజీవిగా కనిపించడంతో గుండెలవిసేలా రోదించారు. తన కూతురు వరకట్న వేధింపులతోనే చనిపోయిందని... ఆమె మృతిపై విచారణ జరపాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భర్త విశ్వనాథ్‌పై ఐపీసీ సెక్షన్ 304 (బీ), 498 (ఏ), 3, 4, వరకట్న నిషేధిత చట్టం, రెడ్‌విత్ 109 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అత్త బసవమ్మ, మామ రమే‹Ùలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment