ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,చీపురుపల్లి రూరల్(విజయనగరం): ఎన్నో కలలు..మరెన్నో ఆశలు..భర్తతో నిండు నూరేళ్ల బంగారు భవిష్యత్తును ఊహించుకుని మెట్టినింట అడుగు పెట్టిన ఆమె..వివాహమైన ఏడు నెలలు తిరగక ముందే అనంత లోకాలకు చేరుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక గరివిడి పట్టణంలోని రామేశ్వర కాలనీకి చెందిన వివాహిత లండ నాగమణి(22) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మూడు నెలల గర్భిణి కావడం విచారకరం. గురువారం రాత్రి జరిగిన ఈ విషాద సంఘటనకు సంబంధించి మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గరివిడి పట్టణంలోని రామేశ్వర కాలనీ బాగువీధికి చెందిన లండ సన్యాసిరావుతో గరివిడి మండలం కొండదాడి పంచాయతీ చినవెంకటాపురం గ్రామానికి చెందిన నాగమణికి గత ఏడాది డిసెంబర్‌లో వివాహం జరిగింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ పాసి పండోడు ఆమెను పెంచి వివాహం చేశాడు. వివాహ సమయంలో రూ.2లక్షలు కట్నం కూడా ఇచ్చాడు. పెళ్లై అత్తవారింట అడుగు పెట్టిన నాటి నుంచి భర్త సన్యాసిరావు ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో జీవితం మీద విరక్తి చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఉరివేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సీఐ టి.సంజీవరావు, ఎస్సై బి.మురళి స్థానికులను విచారణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment