ప్రయాణం నేర్పిన పాఠాలు
చదువు పూర్తయిన తర్వాత అయిదుగురు విద్యార్థులు చేసిన ప్రయాణం వారికి ఏం నేర్పింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘పాఠశాల’. నందు, అనుప్రియ, శిరీష, సాయిరోనాక్, హమీద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మహి.వి రాఘవ్ దర్శకుడు. రాకేష్ మహంకాళి, పవన్‌కుమార్‌రెడ్డి నిర్మాతలు. రాహుల్‌రాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్లరి నరేశ్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శాసనసభ్యురాలు డి.కె.అరుణకు అందించారు.
దర్శకుడు మాట్లాడుతూ -‘‘జీవితంలో గోల్డెన్‌డేస్ అంటే కాలేజీ రోజులే. నా స్వీయానుభవాలను కూడా క్రోడీకరించి ఈ కథ రాసుకున్నాను. యువతకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. నేను నిర్మించిన ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు. అందుకే కసితో ఈ సినిమా చేశాను’’ అని తెలిపారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు దామోదరప్రసాద్, నవదీప్, శశిధర్‌రెడ్డి, శశాంక్, ఖయ్యూమ్ తదితరులు కూడా మాట్లాడారు.